బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. మహానాడులో చంద్రబాబు ఆగ్రహం

ఇక అంతకు ముందు ఇదే విషయంపై మాట్లాడిన రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు బనకచర్ల ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించారు.;

Update: 2025-05-28 16:02 GMT

గోదావరి మిగుల జలాల వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కడప మహానాడులో అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్రానికి సాగునీరు అవసరాలు తీర్చే తన కలల ప్రాజెక్టు బనకచర్లపై తెలంగాణ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు.

నదుల అనుసంధానం పూర్తి చేస్తామని, నదీ జలాల వినియోగంలో ఏపీ చివరి రాష్ట్రమని చెప్పారు. నదుల అనుసంధానం వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందని చెప్పారు. బనకచర్ల వరకు గోదావరి జలాలను తీసుకురావడమే తన జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సీఎం వెల్లడించారు. బనకచర్లలో తాను ప్రాజెక్టు కడతానంటే బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. బనకచర్లతో తెలంగాణకు ఎలా నష్టమూ ఆ పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

ఇక అంతకు ముందు ఇదే విషయంపై మాట్లాడిన రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు బనకచర్ల ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించారు. పోలవరం-బనకచర్ల పూర్తయితే రాయలసీమ మొత్తం పచ్చని పైర్లతో కళకళలాడుతుందని మంత్రి రామానాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వృథాగా పోతున్న నీటిలో 200 టీఎంసీలు తీసుకుని తెలుగుతల్లికి జలహారతి ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకుందని వివరించారు. జలహారతి పథకంలో భాగంగా పోలవరం-బనకచర్ల పూర్తయితే రాష్ట్రంలో 80 లక్షల మందికి తాగునీటి సమస్య తీరుతుందని వెల్లడించారు. అదేవిధంగా 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి రామానాయుడు తెలిపారు.

కాగా, బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి అయినా అడ్డుకుంటామని ప్రకటించింది. కేంద్ర జల సంఘం కార్యాలయం వద్ద ధర్నా కూడా చేసింది. ప్రజల్లో బనకచర్లపై అవగాహన కల్పించడం ద్వారా రాజకీయంగా తెలంగాణలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ హక్కులకు విరుద్ధమని, తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయంగా ఆ పార్టీ భావిస్తోంది. దీనిపై అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చి చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ ద్వారా బొల్లపల్లి రిజర్వాయర్ కు 200 టీఎంసీల నీటిని తరలించాలని శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. రూ.80 వేల కోట్ల మేర ఖర్చయ్యే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతోపాటు అవసరమైన ఆర్థిక సహకారం అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అభ్యంతరాలు, రాద్ధాంతం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారని అంటున్నారు.

Tags:    

Similar News