‘స్కూల్ థీక్ కరో’.. సీజేపీ జంతర్ మంతర్ సీజన్-2 ఇదేనా?
సీజేపీ పిలుపునిచ్చిన స్కూల్ థీక్ కరో ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
సీజేపీ పిలుపునిచ్చిన స్కూల్ థీక్ కరో ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల జంతర్ మంతర్ వద్ద నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతం కావడంతో సీజేపీ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ సీజన్ 2 ఉంటుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాజాగా చేసిన ప్రకటన మరింత ఆసక్తిని పెంచేసింది. ఇదే సమయంలో సీజేపీ వెబ్ సైట్లో స్కూల్ థీక్ కరో పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను తల్లిదండ్రులు సందర్శించాలని, అక్కడ వసతులు, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై తమకు ఒక నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో సీజేపీ రెండో విడత ఆందోళనలు దేశవ్యాప్తంగా పాఠశాలల సమస్యలపై ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో బలమైన గొంతుకగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ),తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జంతర్ మంతర్ ఆందోళనల వేడి చల్లారకముందే, సీజేపీ ఇప్పుడు గ్రామీణ భారతంలోని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. దీంతో తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా "స్కూల్ థీక్ కరో" (పాఠశాలలను బాగు చేయండి) అనే కొత్త ప్రచార కార్యక్రమానికి సీజేపీ శ్రీకారం చుట్టిందని అంటున్నారు.
ఈ ప్రచారంలో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు స్వయంగా సందర్శించాలని సీజేపీ కోరింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన నాణ్యత వంటి అంశాలపై సమగ్రమైన 'సోషల్ ఆడిట్' (సామాజిక తనిఖీ) నిర్వహించి, ఆ నివేదికను తమకు పంపాలని విజ్ఞప్తి చేసింది. సీజేపీ తీసుకుంటున్న ఈ చర్యలతో పాఠశాలల సమస్యలపైనే , రెండో విడత ఆందోళనలు చేయాలని సీజేపీ రంగం సిద్ధం చేస్తున్న సంకేతాలు ఇస్తున్నాయని అంటున్నారు.
నీట్ వంటి పెద్ద పరీక్షల్లో అక్రమాలపై గళమెత్తిన సీజేపీ, ఇప్పుడు గ్రామీణ పాఠశాలల్లోని దయనీయ పరిస్థితులను వెలుగులోకి తెచ్చేందుకు సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం ద్వారా, విద్యారంగంలోని లోపాలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేయాలని కాక్రోచ్ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, సీజేపీ ప్రారంభించిన "స్కూల్ థీక్ కరో" ఉద్యమం రాబోయే రోజుల్లో పాలకులపై ఎంతటి ఒత్తిడిని పెంచుతుందో చూడాల్సివుందని అంటున్నారు. ఇప్పటికే జెన్ జీ యువతలో ఆదరణ పొందుతున్న కాక్రోచ్ పార్టీ విద్యారంగ సమస్యలతో దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా ఎలాంటి మార్పు కోరుకుంటుంది. దీనికి తల్లిదండ్రుల నుంచి సహకారం ఉంటుందా? లేదా? అనేది విస్తృత చర్చకు దారితీస్తోందని చెబుతున్నారు.