తమిళనాడు అసెంబ్లీని కుదిపేసిన ‘కుప్పం ఎయిర్ పోర్టు’ - ఏం జరిగిందంటే...?

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నిర్మించనున్న విమానాశ్రయం ప్రాజెక్టు ఇప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-08-13 10:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నిర్మించనున్న విమానాశ్రయం ప్రాజెక్టు ఇప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్రంలోని హోసూరు విమానాశ్రయ నిర్మాణానికి ఆటంకం కలుగుతోందని, దీని వెనుక పొరుగు రాష్ట్రాల ప్రమేయం ఉందనే ఆరోపణలతో తమిళనాడు అసెంబ్లీలో ప్రకంపనలు రేగాయి. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిఎంకే ఎమ్మెల్యే శ్రీనివాసన్ లేవనెత్తిన అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టును దెబ్బతీయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కావాలనే అడ్డుపుల్లలు వేస్తున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. హోసూరు వంటి కీలక ప్రాంతంలో విమానాశ్రయం రావడం వల్ల పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, అయితే పొరుగు రాష్ట్రాలు వ్యూహాత్మకంగా ఆ ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలపై తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన స్పందిస్తూ, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను ఖండించారు. పొరుగు రాష్ట్రాలు హోసూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అసంబద్ధమైన వార్తలను నమ్మి అసెంబ్లీ వేదికపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని ఆమె ఎమ్మెల్యేకు హితవు పలికారు. పరిపాలనాపరమైన సమస్యలను రాజకీయ రంగు పులుమడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నష్టం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టుకు ఎదురవుతున్న సమస్యలను పరిశీలిస్తే, అందులో ప్రధానంగా సాంకేతికపరమైన అడ్డంకులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. హోసూరు ప్రాంతం బెంగళూరుకు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉండటం ఒక ప్రధాన సవాలు అంటున్నారు. ఇప్పటికే బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతానికి సేవలందిస్తోందని, నిబంధనల ప్రకారం, ఒక ప్రధాన విమానాశ్రయం ఉన్న నిర్దిష్ట పరిధిలో మరొక విమానాశ్రయాన్ని నిర్మించాలంటే అనేక విమానయాన నియమాలను పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనితో పాటు, హోసూరులో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రక్షణ సౌకర్యాలు, అడ్డంకులు విమానాల రాకపోకలకు అనుమతులు లభించడంలో ప్రధాన ఆటంకాలుగా మారాయంటున్నారు.

మరోవైపు, కుప్పం విమానాశ్రయం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో వేగంగా ముందుకు సాగుతోందని చెబుతున్నారు. భౌగోళికంగా కుప్పం కూడా బెంగళూరుకు దగ్గరగానే ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మక ఒప్పందాలతో ముందడుగు వేసిందని అంటున్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంతో సమన్వయం చేసుకుని, షరతులతో కూడిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందడంలో ప్రభుత్వం సఫలీకృతమైందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 1,788 ఎకరాల భూమి అవసరమని గుర్తించగా, ఇప్పటికే దాదాపు 1,300 ఎకరాల భూసేకరణ పూర్తికావడం ప్రాజెక్టు పురోగతికి నిదర్శనంగా చెబుతున్నారు. కుప్పంను లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడం ద్వారా చిత్తూరు జిల్లా పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News