అమరావతికి ‘స్పీడ్’ యాక్సెస్.. రాజధాని పనుల్లో కీలక మైలురాయి

అమరావతి రాజధాని ప్రయాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని నగర అనుసంధానానికి అత్యంత కీలకమైన 'E3 సీడ్ యాక్సెస్ రోడ్డు'లో మేజర్ స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

Update: 2026-08-13 06:51 GMT

అమరావతి రాజధాని ప్రయాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని నగర అనుసంధానానికి అత్యంత కీలకమైన 'E3 సీడ్ యాక్సెస్ రోడ్డు'లో మేజర్ స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీంతో రాజధాని అమరావతి పనులు మరింత వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజధాని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా రాజధానిని విజయవాడ, గుంటూరు నగరాలకు అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్డును త్వరతగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చిందని చెబుతున్నారు.

రాజధాని నగర అనుసంధానానికి అత్యంత కీలకమైన 'ఈ3 సీడ్ యాక్సెస్ రోడ్డు'లో మేజర్ స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. 'ఈ3 సీడ్ యాక్సెస్ రోడ్డు' అనేది కేవలం ఒక సాధారణ రోడ్డు మాత్రమే కాకుండా, అమరావతి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఒక వ్యూహాత్మక కనెక్టివిటీ కారిడార్ అంటున్నారు. దొండపాడు నుండి రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా తాడేపల్లి వరకు సుమారు 21.77 కి.మీ పొడవైన సబ్-ఆర్టీరియల్ రోడ్డు మణిపాల్ హాస్పిటల్స్ వద్ద జాతీయ రహదారి-16తో అనుసంధానమవుతుంది. ఈ కారిడార్ పొడవునా 60 మీటర్ల రైట్-ఆఫ్-వే (ROW) కేటాయించారు. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసిన దీర్ఘకాలిక ప్రణాళికకు నిదర్శనంగా నిలుస్తుందని అంటున్నారు.

కేవలం రోడ్డు మాత్రమే కాకుండా, బీఆర్టీఎస్, సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు గ్రీన్ బెల్టులతో కూడిన ఒక సమగ్ర రవాణా వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులు పూర్తి కావడానికి సంవత్సరాల సమయం పడుతుంది, కానీ ప్రభుత్వం ఇక్కడ వినూత్నమైన 'ఫేజ్డ్ అప్రోచ్' విధానాన్ని అనుసరిస్తోంది. పూర్తిస్థాయి ఈ3 కారిడార్ (దశ-3) 2028 నాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ప్రజలకు ఇప్పుడే ప్రయోజనం కలగాలనే లక్ష్యంతో మేజర్ స్టీల్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల విజయవాడ-మంగళగిరి ఓల్డ్ హైవేకి డైవర్షన్ లింక్ ఏర్పడి, అమరావతికి రాకపోకలు సులభతరమయ్యాయి.

సుమారు రూ.1,600 కోట్ల భారీ వ్యయంతో ఈ కారిడార్ రూపుదిద్దుకుంటోంది. ఏ పెద్ద ప్రాజెక్టుకైనా భూసేకరణ అనేది ఒక అతిపెద్ద సవాలుగా మారుతుంది. ఈ కారిడార్ నిర్మాణంలో కూడా కొన్ని అడ్డంకులు ఎదురైనా, అమరావతి రైతులు అందించిన సహకారం వెలకట్టలేనిదని ముఖ్యమంత్రి కొనియాడారు. రైతులు, ప్రభుత్వం, ఇంజనీరింగ్ బృందాల సమన్వయంతోనే స్టీల్ బ్రిడ్జి సాకారం అయింది. ఇదే రోజు అమరావతిలో మరో అద్భుతమైన మైలురాయి ఆవిష్కృతమైంది. E3 రోడ్డు ప్రారంభంతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన 18 నివాస టవర్లను కూడా సీఆర్డీఏకి బదిలీ చేస్తున్నారు.

ప్రతి అపార్ట్‌మెంట్ 3,500 చదరపు అడుగుల వైశాల్యంతో, జిమ్, స్పూ, మినీ-థియేటర్ వంటి అన్ని సౌకర్యాలతో కూడిన ఒక రెసిడెన్షియల్ కమ్యూనిటీగా వీటిని అభివృద్ధి చేశారు. మొత్తంగా చూస్తే, రోడ్లు రాజధానిని కలుపుతాయి, భవనాలు పరిపాలనను స్థిరపరుస్తాయని విశ్లేషిస్తున్నారు. ఈ మౌలిక వసతులు అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా, భవిష్యత్తు తరాలకు గర్వకారణమైన ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా వేసిన బలమైన అడుగులు. అమరావతి ఇప్పుడు కేవలం ఆకాంక్ష కాదు, అది క్షేత్రస్థాయిలో వేగంగా మారుతున్న వాస్తవంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News