భర్తల్ని చంపే బ్లాక్ విడోస్ లో టాప్ 10 దేశాలివే!

భర్తల్ని ఏసేసే భార్యల ఉదంతాలు ఇప్పుడు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా భార్యల్ని ‘బ్లాక్ విడో’గా వ్యవహరిస్తారు.

Update: 2026-08-13 07:36 GMT

భర్తల్ని ఏసేసే భార్యల ఉదంతాలు ఇప్పుడు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా భార్యల్ని ‘బ్లాక్ విడో’గా వ్యవహరిస్తారు. ఎందుకన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశం ఒకటి కనిపిస్తుంది. బ్లాక్ విడో అనేది ఒకలాంటి విషపూరితమైన నల్లటి సాలీడు పేరు. ఈ సాలీడు తన భాగస్వామితో శారీరక కలయిక తర్వాత వెంటనే మగ సాలీడును చంపి తినేస్తుంది. అందుకే.. భర్తల్ని చంపే భార్యల్ని బ్లాక్ విడోస్ గా వ్యవహరిస్తుంటారు. ఇటీవల కాలంలో భర్తల్ని.. కాబోయే భర్తల్ని భారీ ప్లాన్ వేసి మరీ చంపేసే ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ దరిద్రం కేవలం భారతదేశంలోనే ఎక్కువ? అన్న సందేహం కలుగుతుంది. దీనికి సంబంధించిన వివరాల్ని సేకరిస్తే.. దిమ్మ తిరిగే అంశాలు బోలెడు కనిపిస్తాయి. ఈ తరహా దారుణ ఉదంతాల్ని క్రిమినాలజీలో ‘మారిటిసైడ్’గా వ్యవహరిస్తుంటారు.

మరో షాకింగ్ అంశం ఏమంటే.. ఈ తరహా హత్యలకు 2018 ఏడాదికి మధ్య ఒక లింక్ ఉందా? అంటే.. ఒక వాదన ప్రకారం నిజమేనన్న మాట బలంగా వినిపిస్తుంది. అదెలా చెబుతారంటే.. దానికి ఒక చట్టపరమైన అంశం కూడా ఉందని చెప్పేటోళ్లు లేకపోలేదు. దీనికి బలం చేకూరేలా దేశంలో భర్తల్నిభార్యలు చంపే ఉదంతాలు 2018 తర్వాత నుంచే ఎక్కువ కావటం కనిపిస్తుంది. ఈ ఏడాదిలో తొలి ఆర్నెల్ల కాలంలో దేశం మొత్తంగా దాదాపు 322 మంది భర్తల్ని భార్యలు చంపేసినట్లుగా ఒక అంచనా. మీడియా కథనాల ఆధారంగా ఈ గణాంకాల్ని లెక్క కట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనధికారిక గణాంకాల్ని చూస్తే.. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 31 వరకు చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లో సుమారు పాతిక పైగా హత్య కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి చిత్తూరు.. గుంటూరు.. క్రిష్ణా జిల్లాల్లో నమోదైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే ఇదే కాలంలో సుమారు 18కి పైనే భర్తల్ని హత్య చేసిన భార్యల ఉదంతాలు కనిపిస్తాయి. ఇందులో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈ తరహా నేరాలు ఎక్కువగా చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

కొంతకాలంగా భర్తలు మాత్రమే కాదు.. కాబోయే భర్తల్ని చంపే ఉదంతాలు పెరుగుతున్నాయి. నిజానికి ఇష్టం లేని పెళ్లి ఇంట్లో వారు కుదిర్చే వేళలో.. వారికి ఆ విషయాన్ని స్పష్టంగా చెబితే సరిపోతుంది. కానీ.. ఇంట్లోని వారి మాటకు ఎదురు చెప్పలేని కొందరు.. గుట్టుచప్పుడు కాకుండా కాబోయే భర్తల్ని చంపేయొచ్చన్న తెలివితక్కువతనంతో ఆలోచించి.. తమ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్న పరిస్థితి.

పెళ్లి తర్వాత వివాహేతర సంబంధాలు మోజుతో భర్తల్ని చంపేయటం ఈ మధ్యన ఎక్కువైంది.అదే సమయంలో తాము ప్రేమించిన ప్రియుడితో కాకుండా వేరే వారితో జరిగే పెళ్లి నుంచి తప్పించుకోవటానికి.. వారిని అడ్డు తొలగించుకోవటానికి హత్యకు మించిన మార్గం మరొకటి లేదన్న భావన దీనికి కారణంగా చెప్పొచ్చు. దారుణ నేరం చేసినోళ్లు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేదన్న చిన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఎవరెంత అద్భుతంగా ప్లాన్ చేసినా.. పోయిన ప్రాణం.. దాన్ని తీసినోడి గుట్టు రట్టు చేయటమే కాదు.. వారిని కటకటాల వెనక్కి నెడుతోందన్న విషయాన్ని ఈ దారుణాలకు పాల్పడే చాలామంది మిస్ అవుతుంటారు.

సినిమాలు.. సీరియల్స్.. పుస్తకాల్లో మాత్రమే అద్భుతమైన ప్లానింగ్ ఉంటుంది. ఎందుకంటే.. రాసేటోడు.. తీసేటోడు ఎలా అనుకుంటే అలా పాత్రలు వ్యవహరిస్తాయి. కానీ.. వాస్తవ జీవితంలో అలాంటి పరిస్థితి ఉండదు. ఇంతకు ఇలా కట్టుకున్న భర్తల్ని చంపేసే భార్యలు భారతదేశంలోనే ఎక్కువ? అన్న విషయంలోకి వెళితే.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ దరిద్రపుగొట్టు వ్యవహారం నడుస్తోంది. కాకుంటే.. ఒక్కో దేశంలో ఒక్కో కారణంతో భర్తల్ని ఏసేసే భార్యలు కనిపిస్తారు.

మన దేశంలో 2019-2024 మధ్య కాలంలో సుమారు 785 మంది భర్తలు తమ భార్యల చేతిలో హత్యకు గురైనట్లుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. సమాజంలో మారుతున్న విలువలు.. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులతో ఈ తరహా ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్న దుస్థితి. మన దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరహా ఉదంతాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు చెప్పాలి.

అందరికి అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాతో కొత్త పరిచయాలు కొత్త బంధాలకు తెర తీస్తుంటే.. విపరీత మనస్తత్వం ఉన్నోళ్లు ప్రియుడి కోసం తమ జీవిత భాగస్వాములను హతమార్చేందుకు సైతం వెనుకాడని తీరు కనిపిస్తోంది. ఈ తరహా ఉదంతంలో నిందితులు తమను తాము చాలా బ్రహ్మండంగా ప్లాన్ చేశామని.. ఇట్టే చంపేయొచ్చన్న భావన కనిపిస్తుంది. అందుకు తమ జీవితాల్ని పణంగా పెట్టేసే దుస్థితి.

మన దేశంలో భర్తల్ని చంపేసే భార్యల ఉదంతాల్లో 60 నుంచి 80 శాతం వరకు భార్యలు వివాహేతర సంబంధాలు ఉన్న వారు.. ప్రియుడితో కలిసి జీవించటానికి భర్తను శాశ్వితంగా తొలగించటమే మంచి మార్గంగా భావించటం ఈ తరహా దారుణాలకు కారణంగా చెప్పాలి. సామాజిక కట్టుబాట్లు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో.. జీవిత భాగస్వామి నుంచి విడాకులు తీసుకునే కన్నా.. గుట్టుచప్పుడు కాకుండా చంపేస్తే.. భర్త పీడ పోయి ప్రియుడితో బాగా బతికేయొచ్చన్న విపరీత ఆలోచనలు ఈ తరహా హత్యలకు కారణాలుగా చెబుతున్నారు.

ఈ తరహా దరిద్రం మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ బాగానే కనిపిస్తుంది. కాకుంటే.. కొన్ని దేశాల్లో కొన్ని కారణాలతో భర్తల్ని చంపేసే భార్యల ఉదంతాలు కనిపిస్తాయి. ప్రపంచంలో భర్తల్ని చంపేసే భార్యలు ఏ దేశంలో ఎక్కువ ఉంటారన్న గణాంకాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ దేశంలో భర్తలను చంపేయటం ద్వారా భారీగా బీమా సొమ్ము లభిస్తుందన్న ఉదంతాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆ తర్వాతి దేశం రష్యాగా చెబుతారు. ఈ దేశంలో మితిమీరిన మద్యపానం భార్యభర్తల మధ్య గొడవలకు కారణం. ఈ వేధింపుల్ని తట్టుకోలేక భార్యలు తిరగబడి భర్తల్ని చంపే ఉదంతాలు ఎక్కువగా నమోదవుతుంటాయి.

భర్తల్ని చంపే భార్యల ఉదంతాల్లో భారతదేశం ఇప్పుడు మూడో స్థానంలో నిలిచినట్లుగా చెబుతున్నారు. అమెరికా, రష్యాతో పోలిస్తే మన వద్ద ఎక్కువగా వివాహేతర సంబంధాలు.. విడాకులు తీసుకుంటే ఎదురయ్యే సామాజిక అంశాల కారణంగా భర్తల్ని చంపే విపరీత ధోరణి కనిపిస్తుంది. నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా నిలుస్తుంది. ఈ దేశంలో సాధారణంగానే నేరాల రేటు ఎక్కువ. వైవాహిక బంధాల హింసలో పురుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. వివాహేతర సంబంధాల మోజులో భర్తల్ని కిరాయి హంతకులతో చంపే ఉదంతాలు నైజీరియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దేశం టాప్ 5లో నిలుస్తుంది. ఆరో స్థానంలో బ్రెజిల్, ఏడో స్థానంలో మెక్సికో, ఎనిమిదో స్థానంలో బ్రిటన్, తొమ్మిదో స్థానంలో ఆస్ట్రేలియా, పదో స్థానంలో కెనడా నిలుస్తుంది.

బ్రిటన్.. ఆస్ట్రేలియా, కెనడా దేశాల విషయానికి వస్తే ఎక్కువగా ఆర్థిక అంశాలే భర్తల ప్రాణాలు తీయటానికి కారణంగా చెబుతారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా భార్యల చేతుల్లో మరణించే భర్తల ఉదంతాలు దాదాపు 20వేల వరకు ఉంటే.. భర్తల చేతిలో మరణించే భార్యల సంఖ్య సుమారు 50 వేల వరకు ఉండటం గమనార్హం. ప్రపంచ దేశాల్ని ఖండాల వారీగా చూస్తే.. అమెరికా ఖండంలో భర్తల్ని చంపే భార్యల ఉదంతాలు అత్యధికంగా నమోదవుతుంటాయి. ఆ తర్వాతి స్థానం ఆఫ్రికా ఖండంగా చెప్పాలి. మూడో స్థానంలో యూరోప్ లోని కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ తీరు ఎక్కువగా ఉంది. చివరి స్థానంలో ఆసియా ఖండం నిలుస్తుంది. ఇందులో కూడా భారత్, చైనాలోనే ఈ తరహా దారుణాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రాశ్చాత్య దేశాల్లో ఆర్థిక అంశాలతో ఈ తరహా నేరాలు జరుగుతుంటే.. ఆసియా ఖండంలోని దేశాల్లో ఎక్కువగా సామాజిక అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఆసియా దేశాల్లో విడాకులు తీసుకోవటం కంటే గుట్టుచప్పుడు కాకుండా చంపేయాలన్న ధోరణి ఎక్కువగా ఉందన్న వాదన వినిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని పెళ్లిళ్లు.. మరికొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధాలు భర్తల ప్రాణాలు తీయటానికి భార్యలు వెనుకాడటం లేదు. తమ అక్రమ సంబంధం గురించి తెలిస్తే సామాజికంగా సమస్యలు ఎదుర్కొంటామన్న ఆలోచనతో కిరాయి హంతకులతోనూ.. భర్తలకు నిద్రమాత్రలు ఇచ్చి.. వారిని చంపేయటం కనిపిస్తుంది.

ఇక్కడో మరో షాకింగ్ అంశాన్ని ప్రస్తావించాలి. విదేశాల్లో భర్తల్ని చంపే భార్యల్లో ఎక్కువగా ఆర్థిక అంశాలు కనిపిస్తుంటాయి. ఆర్థికంగా భర్తపై ఆధారపడే వారు.. నిరుద్యోగ మహిళలు ఎక్కువగా కనిపిస్తారు. భారతదేశంలో మాత్రం మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతితోపాటు బాగా చదువుకున్న వారు.. ఉద్యోగాలు చేస్తున్న వారు కనిపిస్తారు. విడాకులు తీసుకోవటం.. సామాజిక అంశాల్ని ఎదుర్కొనే కన్నా.. తమ వివాహేతర సంబంధాల్ని కొనసాగించేందుకు వీలుగా ప్లాన్ చేయటం.. కిరాయి హంతకుల సాయం తీసుకోవటం కనిపిస్తుంది.

మన దేశం విషయానికి వస్తే.. 2018 సంవత్సరం ఈ తరహా ఉదంతాలు మరింత పెరగటానికి ఒక కారణంగా కొందరు వాదిస్తారు. ఇంతకూ ఆ ఏడాది ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే.. 2018 సెప్టెంబరు 27న సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దీని ప్రకారం ఈ తీర్పునకు ముందు వరకు భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న సెక్షన్ 497 (వ్యభిచార నేరం)ను రద్దు చేసింది. 2018 ముందు ఒక వివాహిత మహిళ మరో పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమె భర్త సదరు వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపే వీలుండేది. 2018 తీర్పు తర్వాత అక్రమ సంబంధం పెట్టుకోవటం కేవల సివిల్ తప్పుగా మారింది.

విడాకులు తీసుకోవటానికి ఒక కారణం మాత్రమే. క్రిమినల్ నేరం ఎంతమాత్రం కాదు. దీంతో అక్రమ సంబంధాలపై చట్టపరమైన క్రిమినల్ భయం పూర్తిగా పోయింది. దీంతో విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగి.. సామాజిక ఇబ్బందులు ఎదుర్కొనే కన్నా.. గుట్టుచప్పుడు కాకుండా చంపేసే విపరీత ధోరణికి దిగుతున్నారు. కొందరు పురుషులు వివాహేతర సంబంధాలపై ప్రశ్నిస్తే.. భర్తలపై గృహహింస (498A) లేదా వరకట్న వేధింపుల కేసులు పెడుతున్న ఉదంతాలు పెరిగాయి. ఇలాంటి అంశాలపై హర్యానా కేంద్రంగా పని చేసే ‘‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’’ పలు అధ్యయనాలు చేపట్టింది. ఈ మధ్యనే హస్బెండ్ మర్డర్ అండ్ మెన్ సూసైడ్ రిపోర్ట్’ ను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది మొదటి ఆర్నెల్ల వ్యవధిలో దేశం మొత్తంలో 322 మంది భర్తలు హత్యకు గురైతే.. ఇందులో వివాహేతర సంబంధాల వాటా 60.2 శాతంగా తేల్చారు. మొత్తంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే. నచ్చని బంధాలను దుర్మార్గమైన ఎత్తులతో అంతం చేసే కన్నా.. నచ్చని విషయాన్ని నేరుగా చెప్పేసి బయటకు వచ్చేయటం మంచిది. తెలివిగా అంతం చేయాలన్న అతితెలివి మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందన్న నిజాన్ని మర్చిపోకూడదు.

Tags:    

Similar News