నందిగామ ఫైల్స్: వైసీపీ వర్సెస్ టీడీపీ హీటెక్కుతోంది!
ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం నందిగామలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం నందిగామలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు తంగిరాల సౌమ్య దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీతోపాటు.. ప్రజల్లోనూ ఆమెకు మంచి ఇమేజ్ పెరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం టీడీపీ చేపట్టిన ఇంటింటి కీ తెలుగు దేశం కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఆమె విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు పార్టీకి నివేదికలు కూడా వస్తున్నాయి. రెండో సారి ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న సౌమ్య.. వివాదాలకు దూరంగా ఉండడం కూడా మంచి మార్కులు వేయిస్తోంది. నాయకులతో కలివిడిగా ఉంటూ.. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం కూడా కలిసి వస్తోందని అంటున్నారు.
మంత్రి పదవిపై..
ఎస్సీ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్న మహిళల్లో సౌమ్య పేరు కూడా చేరిందని పార్టీలో కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్సీకోటాలో హోం మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపు మంత్రి వర్గ ప్రక్షా ళన చేస్తే.. ఎస్సీ కోటాలో ఏదో ఒక పదవిని దక్కించుకునేందుకు సౌమ్య ప్రయత్నిస్తున్నారన్నది పార్టీ వర్గాల మాట. అందుకే ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న వాదన కూడా ఉంది. కానీ.. తనకు ప్రజలు ఇచ్చిన పదవి చాలని ఆమె చెబుతున్నారు. చంద్రబాబు ఆకాంక్షల మేరకు పార్టీని డెవలప్ చేయడమే తన ముందున్న కర్తవ్యమని కూడా చెబుతున్నారు.
చిక్కులు చాలానే..
నంది గామ నియోజకవర్గంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నప్పటికీ.. సౌమ్యకు కీలకమైన సమస్యల పరిష్కారం పెద్ద చిక్కుగానే మారింది. ఎప్పుడో దశాబ్దం కిందట.. ఇక్కడ నిర్మించిన జాతీయ రహదారికి భూములు ఇచ్చిన రైతులకు ఇంకా.. పరిహారం అందలేదు. ఆ సమస్యను పరిష్కరించలేక పోతున్నారు. అయితే.. కొందరికే పెండింగు ఉందని.. కోర్టు కేసులు ఉన్నాయని అందుకే సమస్య పరిష్కారం కావడం లేదని తెలుస్తోంది. అలానే.. డంపింగ్ యార్డ్ సమస్యతో పాటు.. నియోజకవర్గంలో ఎస్సీ హాస్టల్ నిర్మాణం కూడా సుదీర్ఘకాలంగా పెండింగులో ఉంది. వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
రాజకీయంగా మరింత..
నంది గామలో వైసీపీకి కీలక నాయకులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఆయన సోదరులు, కుటుంబం మొత్తం యాక్టివ్‌లోనే ఉంది. వీరంతా తరచుగా ప్రజల మధ్యకు వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. త్వరలోనేనియోజకవర్గంలో పాదయాత్రకు మొండితోక రెడీ అవుతున్నారు. ఇలా.. వైసీపీ నుంచి రాజకీయ ప్రత్యర్థులు ఎమ్మెల్యేకు పొంచి ఉన్నారన్నది వాస్తవం. ఇతర నియోజకవర్గాలతో పోల్చుకుంటే.. నందిగామలోనే వైసీపీ కొంత మేరకు దూకుడుగా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా సౌమ్య మరింత పుంజుకుని.. తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.