కేంద్రప్రభుత్వాన్ని వణికిస్తున్న సీజేపీ అభిజీత్ వార్నింగ్

సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటైన నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు.

Update: 2026-07-29 08:59 GMT

ఢిల్లీలో ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసనల అనంతరం దేశవ్యాప్తంగా రాజకీయంగా, న్యాయపరంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఘాటుగా స్పందించారు. శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సీజేపీ మరోసారి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో శాంతియుత ఉద్యమానికి దిగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోలీసుల చర్యలు

ఈ విషయమై అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ "శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడిన యువతను, విద్యార్థులను నేరస్థులుగా చూడటం సరికాదు. పోలీసుల ద్వారా వారిని టార్గెట్ చేస్తూ చర్యలు కొనసాగించడం నిలువెత్తు ప్రజాస్వామ్య విరుద్ధం" అని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విధమైన వేధింపులను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాకుండా సీజేపీ పోరాటం ఇంకా ముగియలేదని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. గతంలో నిరసనను తాత్కాలికంగా విరమించినప్పటికీ ఇది కేవలం ఉద్యమానికి సంబంధించిన తొలి దశ మాత్రమేనని అభిజీత్ తెలిపారు. ప్రజల, యువత సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగేది లేదని తేల్చిచెప్పారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు.. సీజేపీ ఆందోళన

మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై సీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తును కొనసాగించవచ్చని.. అయితే ప్రస్తుతానికి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోర్టు తెలిపిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల నిరసనకారులపై ఉన్న కేసుల ఉపసంహరణ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముందని అన్నారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటైన నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు. జూలై 25న కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీ ప్రకారం శాంతియుత నిరసనకారులపై కేసులను ఎత్తివేయాలి. ముఖ్యంగా అస్సాం, బిహార్ వంటి ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన హామీని గౌరవించి కేసులను ఉపసంహరించుకోవాలి. కోర్టు విచారణ సమయంలో కేంద్రం తరఫున వాదించిన న్యాయవాదులు ఈ హామీ ప్రస్తావన తేకపోవడం నిరాశ పరిచిందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన మాటను నమ్మి తాము నిరసన విరమించామని, ఒకవేళ ఆ హామీలు అమల్లోకి రాకపోతే సీజేపీ మళ్లీ ఉద్యమ బాట పట్టక తప్పదని పార్టీ స్పష్టం చేసింది. దీంతో ఈ అంశం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News