సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపిన సీఐ శంకరయ్య డిస్మిస్
కొంతకాలంగా కర్నూలు రేంజ్ లో వేకెన్సీ రిజర్వ్ లో ఉన్న శంకరయ్య ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపటం పోలీసు శాఖలో పెద్ద చర్చగా మారింది.;
అదేం సిత్రమో కానీ.. చట్టం కొన్నిసార్లు కాలం కంటే వేగంగా దౌడు తీస్తుంటుంది. మరికొన్ని సందర్భాల్లో నత్త సైతం ఓడిపోయేలా చట్టం నడక సాగుతుంటుంది. ఇలాంటి గమ్మత్తు పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పరువునష్టం వాటిల్లిందని పేర్కొంటూ పరిహారం చెల్లించి.. క్షమాపణలు చెప్పాలని కోరుతూ సీఐ స్థాయి పోలీసు అధికారి లీగల్ నోటీసులు పంపటాన్ని ఎప్పుడైనా ఊహించారా? అందులోనూ.. సదరు సీఐ శంకరయ్య మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపటం ఆయనకే చెల్లుతుంది. ఇలాంటి చేష్టలకు దిగిన వారిపై చర్యల కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిన రావటం చూస్తే.. అప్పుడప్పుడు చట్టం ఇంత నెమ్మదిగా పని చేస్తుందన్న సందేహం కలుగక మానదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణహత్య కేసులో నిందితులు.. ఆధారాల్ని చెరిపేశారని.. వారికి అప్పట్లో పులివెందుల మాజీ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా శంకరయ్య తీరును తప్పు పడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
దీనిపై స్పందించిన సీఐ శంకరయ్య.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించారని.. అసెంబ్లీ వేదికగా తనకు క్షమాపణలు చెప్పాలని కోరటమే కాదు.. రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలన్న డిమాండ్ చేశారు.
కొంతకాలంగా కర్నూలు రేంజ్ లో వేకెన్సీ రిజర్వ్ లో ఉన్న శంకరయ్య ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపటం పోలీసు శాఖలో పెద్ద చర్చగా మారింది.
ఈ తీరును తీవ్రంగా పరిగణిస్తూ.. క్రమశిక్షణ చర్యలు షురూ చేశారు. తాజాగా ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్ లో ఉండటం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.