బీహార్ కొత్త సీఎం చిరాగ్ పాశ్వాన్ అవుతారా ?
బీహార్ దంగల్ మొదలైంది. నవంబర్ నెలలో 6, 11 తేదీలలో రెండు విడతలుగా జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిది పీఠం అన్నది బీహార్ ప్రజలు నిర్ణయిస్తారు.;
బీహార్ దంగల్ మొదలైంది. నవంబర్ నెలలో 6, 11 తేదీలలో రెండు విడతలుగా జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిది పీఠం అన్నది బీహార్ ప్రజలు నిర్ణయిస్తారు. మొత్తం 243 అసెంబ్లీ సీట్లు కలిగిన బీహార్ ఉత్తరాదిన హిందీ బెల్ట్ లో అత్యంత కీలకమైన రాష్ట్రం. అంతే కాదు కాదు కేంద్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలీ అంటే యూపీతో పాటు బీహార్ కూడా ఎంతో ముఖ్యం. ఇక్కడ మొత్తం 40 ఎంపీ సీట్లు ఉన్నాయి. యూపీలో 80 ఉన్నాయి. ఈ రెండు కలిపితే 120 ఎంపీ సీట్లు. దేశంలో మొత్తం ఎంపీ సీట్లు 543. అంటే 23 శాతం ఎంపీ సీట్లు ఈ రెండు రాష్ట్రాలలోనే ఉన్నాయి. ఇక్కడ కనుక ఆధిపత్యం సంపాదిస్తే కేంద్రంలో అధికారం చేపట్టడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 272కి చేరుకోవడం సులువు అవుతుంది. అందుకే ఈ రాష్ట్రాలు ఎంతో కీలకంగా ఉన్నాయి.
ఎన్డీయే వర్సెస్ మహా ఘట్ బంధన్ :
బీహార్ లో ఎన్డీయే అధికారంలో ఉంది. ఆ కూటమిని గద్దే దించేందుకు మహా ఘట్ బంధం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. పైగా రెండు దశాబ్దాలుగా సీఎం గా ఉన్న నితీష్ కుమార్ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని దాంతో తమ విజయం సాధించడం చాలా ఈజీ అని ఘట్ బంధన్ భావిస్తోంది అయితే రెండు కూటములలోనూ సీట్ల పంచాయతీ ఉంది. దానికి తగినట్లుగా రెండు చోట్ల మిత్ర పార్టీలు ఎక్కువగానే సీట్ల కోసం చేస్తున్నాయి.
ఎన్డీయే కసరత్తు పూర్తి :
ఎట్టకేలకు అనేక సిట్టింగుల తరువాత సీట్ల షేరింగ్ ని ఎన్డీయే విజయవంతంగా పూర్తి చేసింది. దీని ప్రకారం చూస్తే మొత్తం 243 సీట్లకు గానూ బీజేపీ 101, జేడీయూ 101 సీట్లకు పోటీ చేయనున్నాయి. అదే విధంగా మూడవ పెద్ద పార్టీగా ఉన్న లోక్ జన శక్తి పార్టీ 29 సీట్లకు పోటీ చేస్తోంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో ఈ పార్టీ ఉంది. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఆరు సీట్లు, హిందుస్థానీ ఆవాం మోర్చాకు మరో ఆరు సీట్లు కేటాయించారు.
ఎక్కువ సీట్లు సాధించిన చిరాగ్ :
బీహార్ లో చిరాగ్ పార్టీ ఎల్జేపీ ఈసారి ఎక్కువ సీట్లను సాధించింది. 29 సీట్లకు పోటీ చేస్తోంది. ఇక 2020లో చిరాగ్ నాయకత్వంలోని ఎల్జేపీ మొత్తం 134 సీట్లకు సొంతంగా పోటీ చేసింది. ఎన్డీయే నుంచి వేరు పడి చిరాగ్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన తండ్రి రాం విలాస్ పాశ్వాన్. బీహార్ లో సొంతంగానే పార్టీ పెట్టి అనేక ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన జీవిత కాల కోరిక ముఖ్యమంత్రి పీఠం. దానిని అందుకోకుండానే ఆయన మరణించారు. ఇక ఆ తండ్రికి వారసుడిగా 2014 నుంచి ఎంపీగా గెలుస్తూ ఈ రోజున కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ లక్ష్యం మాత్రం సీఎం పీఠమే.
పట్టుదలతో యువనేత :
నిజానికి ఎన్డీయేలో కేంద్రంలో ఉన్న చిరాగ్ పాశ్వాన్ పార్టీకి అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆయన ఈసారి ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తారు అని ఊహాగానాలు వినిపించాయి. ఆయన కూడా నితీష్ కుమార్ సర్కార్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం సరిగ్గా లేదని విపక్షాల మాదిరిగా విమర్శలు గుప్పించారు. ఇక సీట్ల పంపిణీలో కూడా ఆయన ఎక్కువగానే డిమాండ్ చేశారు. అయితే ఆయన పార్టీకి ఉన్నంతలో మూడవ పార్టీకి అధిక ప్రాధాన్యతనే ఎన్డీయే పెద్దలు ఇచ్చారు 29 సీట్లను కట్టబెట్టారు. అయితే ఎన్ డీయే మరోసారి గెలిస్తే కనుక జేడీయూ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ తదుపరి ప్రధాని వస్తారు అన్నది అందరికీ తెలిసిందే. అయితే చిరాగ్ పాశ్వాన్ మాత్రం అంత తేలికగా వదిలేసే వారు కాదని అంటారు.
తండ్రి ఆశయానికి లక్ష్యం తోడుగా :
బీహార్ కి సంబంధించి యువ నేతగా దూకుడుగా రాజకీయాలు చేసే లీడర్ గా చిరాగ్ పాశ్వాన్ ఎదుగుతున్నారు. 42 ఏళ్ళ ఈయన ఇంకా అవివాహితుడు. రాం విలాస్ పాశ్వాన్ పార్టీని ఆయన వైపు ఉన్న సామాజిక వర్గాలను తన వైపునకు తిప్పుకుని తండ్రికి తగిన వారసుడిగా ముందుకు సాగుతున్న చిరాగ్ కి తాను సీఎం అయి తండ్రి జీవిత కాల కోరిక తన రూపంలో అయినా తీర్చాలని ఉంది. ఒక వైపు జేడీయూ నేత నితీష్ వృద్ధుడు కావడంతో పాటు బీజేపీ నుంచి అంత ఫోకస్డ్ గా జనంలో ఉండే నేతలు లేకపోవడంతో ఆ లక్కీ చాన్స్ తనకు దక్కే విధంగా ఆయన పావులు కదుపుతారేమో చూడాల్సి ఉంది. ఒక వైపు మహా ఘట్ బంధన్ నుంచి ఎన్ డీయేకి టఫ్ ఫైట్ సాగుతోంది దాంతో ఎవరికీ మెజారిటీ రాకపోతే అపుడు నంబర్ గేమ్ స్టార్ట్ అవుతుంది. 29 సీట్లలో ఎల్జేపీ గణనీయంగా సీట్లు గెలుచుకుంటే చిరాగ్ పాశ్వాన్ కింగ్ మేకర్ కావచ్చు, అంతే కాదు కింగ్ కూడా అయినా కావచ్చు అన్నది ఒక విశ్లేషణ. చూడాలి మరి ఏమి జరుగుతుందో.