దెందులూరు మీర‌నుకున్న‌ట్టు లేదు... చింత‌మ‌నేని మారిపోయాడు...!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి.;

Update: 2026-05-08 15:30 GMT

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. గతానికి భిన్నంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజ‌కీయం చేస్తున్నారు. వారానికి ఆరు రోజులు పాటు ఆయన ప్రజల మధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమమైనా ప్రజలతోనే గడుపుతున్నారు. పైగా పండగలు ఇతర విశేషాలు వచ్చినప్పుడు కానుకలు పంచి పెడుతున్నారు. తద్వారా నియోజకవర్గంలో గతానికి భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. చింతమనేని ప్రభాకర్ అంటే ఫైర్‌ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే. ఆయన దగ్గరికి వెళ్లేందుకు కూడా ఒకప్పుడు నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఇది ఆయనకు ఎన్నికల సమయంలో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడేలా చేసింది. దీంతో గత ఎన్నికల సమయంలో టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేసింది. ఈ పరిణామాల క్రమంలో తనంతట తాను మార్చుకునే దిశగా చింతమనేని అడుగులు వేస్తున్నారు. ప్రజలకు ఎక్కువగా సమయాన్ని కేటాయించడంతో పాటు వారికి చేరువ‌య్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభాకర్ నిత్యం ప్రజల మధ్య ఉంటే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి విస్తృతంగా కృషి చేస్తున్నారు. పార్టీ పరంగా కార్యకర్తలపరంగా ఆయన తన హవాను కొనసాగిస్తున్నారు. గతంలో లేని విధంగా ఇప్పుడు కార్యకర్తల విష‌యంలో దూకుడు కాస్త త‌గ్గించి మ‌చ్చిక‌తో ముందుకు వెళుతున్నారు.

మరోవైపు వైసీపీ తరఫున ఇక్క‌డ కార్యక్రమాలు అంత యాక్టివ్‌గా లేవు. మాజీ ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి స్లో అయిపోయారు. ఇది చింతమనేనికి కలిసి వస్తున్న విషయం. వ్యక్తిగతంగా చింతమనేని పై గతంలో ఉన్న వాదన ఏదైతే ఉందో అది ఇప్పుడు చెరిగిపోయి ప్రజా నాయకుడిగా ఆయన ఎదుగుతున్న క్రమం స్పష్టంగా కనిపిస్తోంది. చింత‌మ‌నేనిలో ఈ మార్పు ఇలాగే కంటిన్యూ అయితే ఇది అటు పార్టీకి... వ్యక్తిగతంగా చింత‌మ‌నేనికి మేలు చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.

ఇప్పటికైతే చింతమనేని వ్యవహారం నియోజకవర్గంలో పాజిటివ్ గా ఉంది. ఆయన దగ్గరికి సులభంగా ప్రజలు వెళ్లగలుగుతున్నారు వారి సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడింది. అదే సమయంలో ప్రభాకర్ కూడా సాధ్యమైనంత వేగంగా సమస్యలు పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా దెందులూరు నియోజకవర్గంలో అనూహ్యమైన రాజకీయ పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే ప్రజా నాయకుడిగా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనేది టిడిపిలో జరుగుతున్న చర్చ.

Tags:    

Similar News