పవర్ సేవింగ్, పర్యావరణ హితం: అండర్‌వాటర్ డేటా సెంటర్‌తో చైనా ముందడుగు

స్మార్ట్‌ఫోన్ల వాడకం.. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా డేటా నిల్వ సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఏర్పడింది.;

Update: 2026-04-05 05:25 GMT

ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటా అనేది కొత్త చమురుతో సమానం. స్మార్ట్‌ఫోన్ల వాడకం.. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా డేటా నిల్వ సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అయితే భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ స్థలం.. వేలాది టన్నుల నీరు, విపరీతమైన విద్యుత్ అవసరమవుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమిస్తూ చైనా సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. సముద్ర గర్భంలో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది.

సముద్ర గర్భంలో డేటా సెంటర్: అసలేమిటి ఈ ప్రాజెక్ట్?

చైనాలోని హైనాన్ ప్రాంత తీరంలో సముద్ర మట్టానికి సుమారు 35 మీటర్ల లోతులో ఈ డేటా సెంటర్‌ను నిర్మించారు. ప్రత్యేకంగా రూపొందించిన భారీ ‘సీల్డ్ కంటైనర్లలో’ వేలాది సర్వర్లను ఉంచి.. వాటిని సముద్ర గర్భంలో అమర్చారు. ఒక్కో కంటైనర్ బరువు దాదాపు 1,300 టన్నులు ఉంటుంది. ఇది కేవలం ప్రయోగం మాత్రమే కాదు.. వాణిజ్యపరంగా క్లౌడ్ సేవలను అందించే స్థాయికి చేరుకోవడం విశేషం.

ప్రధాన ప్రయోజనాలు.. సహజమైన కూలింగ్, పొదుపు

సాధారణ డేటా సెంటర్లలో అతిపెద్ద సమస్య వేడి. వేలాది సర్వర్లు నిరంతరం పని చేయడం వల్ల వెలువడే వేడిని తగ్గించడానికి భారీ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలు అవసరమవుతాయి. దీనివల్ల విద్యుత్ భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు కూలింగ్ చేయడానికి నీరు భారీగా కావాలి. ఇక్కడే చైనా తన ఆలోచనలకు పదును పెట్టింది. సముద్రపు నీరు సహజంగానే చల్లగా ఉంటుంది. ఈ చల్లదనాన్ని ఉపయోగించుకోవడం వల్ల డేటా సెంటర్లకు ప్రత్యేకంగా కూలింగ్ సిస్టమ్స్ అవసరం లేదు. దీనివల్ల దాదాపు 40% నుండి 60% విద్యుత్ ఆదా అవుతుంది. భూమిపై ఉండే డేటా సెంటర్లను చల్లబరచడానికి ఏటా మిలియన్ల గాలన్ల మంచినీటిని వృధా చేస్తారు. అండర్‌వాటర్ ప్రాజెక్ట్ వల్ల ఈ నీటి వృధా పూర్తిగా అరికట్టబడుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో భూమి ధరలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర గర్భాన్ని వాడటం వల్ల భూమి కొరత సమస్య ఉండదు.

సాంకేతికత.. రక్షణ

సముద్రపు ఉప్పు నీటి వల్ల కంటైనర్లు తుప్పు పట్టకుండా ఉండేందుకు అత్యాధునిక యాంటీ-కొరోసివ్ మిశ్రమ లోహాలను వాడారు. అలాగే లోపల ఉన్న సర్వర్ల పనితీరును పర్యవేక్షించేందుకు ఎటువంటి మనుషుల అవసరం లేకుండా రిమోట్ మానిటరింగ్ , రోబోటిక్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇవి భూకంపాలు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తుల నుంచి కూడా సురక్షితంగా ఉంటాయని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పర్యావరణ కోణం.. సవాళ్లు

ఈ ప్రాజెక్ట్ వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని ఒకవైపు సంతోషం వ్యక్తం అవుతున్నా మరోవైపు పర్యావరణ నిపుణులు కొన్ని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. "డేటా సెంటర్ల నుంచి వెలువడే వేడి వల్ల సముద్రపు నీటి ఉష్ణోగ్రత పెరిగి స్థానిక సముద్ర జీవరాశిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే చైనా ఇంజనీర్లు దీనిని ఖండిస్తున్నారు. కంటైనర్ల చుట్టూ ప్రవహించే నీరు వేడిని త్వరగా గ్రహించి విస్తరిస్తుందని, దీనివల్ల జీవవ్యవస్థకు పెద్దగా నష్టం ఉండదని వారు చెబుతున్నారు.

భవిష్యత్తు దిశగా ఒక ముందడుగు

చైనా చేపట్టిన ఈ సాహసోపేతమైన అడుగు సక్సెస్ అయితే భవిష్యత్తులో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఏఐ, బిగ్ డేటా అవసరాలకు తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా డేటాను నిల్వ చేయడానికి 'అండర్‌వాటర్ డేటా సెంటర్లు' గేమ్ చేంజర్‌గా మారబోతున్నాయి. టెక్నాలజీ , ప్రకృతిని సమన్వయం చేస్తూ చైనా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Tags:    

Similar News