దొంగా-పోలీస్ దోస్తీ.. పల్నాడు జిల్లాలో చెలరేగిపోయిన ముఠా!
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మరణానికి కారణమైన దొంగల ముఠా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.;
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మరణానికి కారణమైన దొంగల ముఠా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముఠా నాయకుడైన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడికి పల్నాడు జిల్లాకు చెందిన కొందరు పోలీసు అధికారుల మద్దతు ఉందనే తాజా సమాచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా నిందితుడు వెంకటనాయుడితో చేతులు కలిపారన్న ఆరోపణలతో చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ రహంతుల్లాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హైవేపై వాహనాలను దొంగిలించడం, వాహనదారులను దోచుకున్న దొంగల గ్యాంగ్ కు ఎస్ఐ పూర్తిస్థాయిలో సహకరించారని ఉన్నతాధికారులకు నిర్ధారించారు. అంతేకాకుండా వెంకటనాయుడు గ్యాంగ్ దొంగిలించిన కార్లలో నాలుగింటిని ఎస్ఐ రహంతుల్లా కుటుంబ సభ్యులతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందులో ఒక కారు ఎస్ఐ వాడుతున్నట్లు సమాచారం.
ఆర్టీఓ అధికారులు అంటూ హైవేపై వాహనాలను ఆపుతూ దోచుకుంటున్న నిందితులు.. ఐదుగురు అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసిన పోలీసులు.. వెంకటనాయుడు గ్యాంగ్ ను గుర్తించారు. కేసును తొలుత రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు గ్యాంగ్ కు స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఉన్నతాధికారులను రంగంలోకి దింపి మొత్తం కూపీ లాగడంతో ఎస్ఐ రహంతుల్లా బాగోతం బయటపడిందని చెబుతున్నారు. నిందితులు చాలా కాలంగా హైవేపై కార్లు దొంగిలిస్తున్నారని, వాటినే తమ దోపిడీలకు వాడుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని వాహనాలను విక్రయించగా, అందులో కొన్ని పల్నాడు జిల్లాలో తిరుగుతున్నాయని అంటున్నారు.
నిందితుడు వెంకటనాయుడు అరెస్టు తర్వాత అతడి వద్ద కార్లు కొనుగోలు చేసిన వారు హడలిపోతున్నారు. ఏఎస్ఐ కుమారుడు అన్న కారణంతో వాహనాలు కొనుగోలు చేశామని, అవి దొంగిలించినవని ఇప్పుడే తెలిసిందని పలువురు పోలీసుల ఎదుటకు వచ్చి చెబుతున్నారని అంటున్నారు. నిందితులు దొంగిలించిన రెండు కార్లకు ఫాస్టాగ్ పెట్టుకుని నిత్యం హైవేపై తిరుగుతూ ఆర్టీవో పేరుతో చాలాకాలంగా వసూళ్లకు పాల్పడుతున్నా, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఎస్ఐ రహంతుల్లాతోపాటు డిపార్ట్మెంటులో మరికొందరు నిందితులకు సాయం చేస్తున్నారా? అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి.
ప్రధానంగా పోలీసుశాఖకు చెందిన ఏఎస్ఐ కుమారుడు అన్న ధీమాతో ఎక్కువ మంది పోలీసులు నిందితుడు వెంకటనాయుడుతో సన్నిహితంగా మెలిగారని చెబుతున్నారు. అంతేకాకుండా అతడి వద్ద చౌకగా వస్తున్నాయని కార్లు కూడా కొనుగోలు చేశారని అంటున్నారు. ఇలాంటి వారంతా నిందితుడు అరెస్టు తర్వాత నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల మరణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన వెంటనే నిందితుడు వెంకటనాయుడు బాగోతాలు బయటకు వచ్చాయని, ఈ క్రమంలో కార్ల చోరీని తొక్కిపెట్టాలని కొందరు పోలీసులు ప్రయత్నించారని ప్రచారం జరుగుతోంది. కానీ పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో మొత్తం బయటపడిందని అంటున్నారు.
ఇక నిందితుడు వెంకటనాయుడు బృందంలోని ఇంకా ఇద్దరు తప్పించుకుతిరుగుతున్నారు. మొత్తం ఏడుగురు కలిసి ముఠాగా ఏర్పడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందలాది కార్లు దొంగిలించినట్లు చెబుతున్నారు. నిందితులు అపహరించిన కార్లలో కొన్ని పోలీసులు, మరికొన్ని ప్రజాప్రతినిధులు కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. అదేవిధంగా గుంటూరులోని ఓ షెడ్డులో 9 కార్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారని చెబుతున్నారు. ఇక నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరుతో ఫాస్టాగ్ తీసుకుని, నిందితుడు వెంకటనాయుడు కారుకు వాడుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. సదరు వ్యక్తిని కూడా పిలిచి ప్రశ్నించారని చెబుతున్నారు. మొత్తానికి ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు కేసు అనేక మలుపులు తిరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు.