మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి బిగ్ షాక్.. లిక్కర్ స్కాంపై సంచలన నిర్ణయం

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మి, కుమారులు మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి పేరున ఉన్న ఆస్తులను కూడా జప్తు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.;

Update: 2025-11-19 10:18 GMT

వైసీపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం స్కాంలో అరెస్టు కావడంతో ప్రస్తుతం జైలులో ఉన్న చెవిరెడ్డికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసేందుకు సిట్ కు అధికారాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మి, కుమారులు మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి పేరున ఉన్న ఆస్తులను కూడా జప్తు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు స్తంభించేపోయే అవకాశం ఉందని అంటున్నారు.

మద్యం కుంభకోణంలో రోజుకో సంచలనం చర్చనీయాంశం అవుతోంది. ఈ స్కాంలో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబం కూడా లిక్కర్ స్కాంలో అక్రమంగా, కమీషన్ల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్‌ ఆరోపణలు చేస్తోంది. లిక్కర్ స్కాంలో కమీషన్ గా తీసుకున్న మొత్తాన్ని గత ఎన్నికల్లో చెవిరెడ్డి పంచిపెట్టారని, రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి ఆయన డబ్బు సమకూర్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై చెవిరెడ్డితోపాటు ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడిని సిట్ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఇద్దరు విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.

కాగా, రూ.54.87 కోట్ల లిక్కర్ సొమ్ముతో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ఆస్తులను చెవిరెడ్డి కూడబెట్టారని సిట్ నివేదిక తయారు చేసింది. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. వాటి జప్తునకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. గత ప్రభుత్వ హయాంలో అధికారం అండతో మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు సిట్‌ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో అవినీతి నిరోధక చట్టం ప్రకారం చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామంతో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబం ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు.

లిక్కర్ కేసులో చెవిరెడ్డి ఏ 38 కాగా, ఆయన కుమారుడు ఏ39. మద్యం ముడుపుల డబ్బులో సుమారు రూ.280 కోట్లు చెవిరెడ్డి తీసుకున్నారని, ఈ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు వాడారని, కొంత మొత్తంతో ఆయన ఆస్తులు కొన్నారని సిట్ ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు చూపుతూ జూన్ 18న అరెస్టు చేసింది. స్నేహితుడు, లిక్కర్ కుంభకోణంలో మరో నిందితుడు అయిన చెవిరెడ్డి శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నించగా, బెంగళూరు విమానాశ్రయంలో పట్టుకుని అరెస్టు చేశారు. అప్పటి నుంచి అంటే సుమారు 150 రోజులుగా మాజీ ఎమ్మెల్యే జైలులోనే గడుపుతున్నారు. బెయిలు కోసం ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఇప్పటివరకు ఫలించలేదు.

Tags:    

Similar News