లిక్కర్ కేసులో మరో కీలక నేత అరెస్టు.. విదేశాలకు పారిపోతుండగా పట్టుకున్నట్లు ప్రచారం!

లిక్కర్ కేసులో చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు, బాల్య స్నేహితుడు అయిన వెంకటేశ్ నాయుడును సిట్ అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది.;

Update: 2025-06-18 07:08 GMT

ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక నేత అరెస్టు అయ్యారు. ఈ కేసులో వైసీపీకి చెందిన కీలక నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేస్తారని వారం రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అనూహ్యంగా బెంగళూరులో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తుండగా, లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీ సిట్ అధికారులకు సమాచారమిచ్చారు.

లిక్కర్ కేసులో చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు, బాల్య స్నేహితుడు అయిన వెంకటేశ్ నాయుడును సిట్ అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇద్దరు కాకుండా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, అనుచరులు బాలాజీ యాదవ్, నవీన్ ను కూడా నిందితులుగా చేర్చారు. లిక్కర్ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు చెవిరెడ్డిపై అభియోగాలు మోపారు సిట్ అధికారులు.

డిస్టలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన డబ్బును గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున చెవిరెడ్డి ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఏ1 రాజ్ కసిరెడ్డి నుంచి తన అనుచరుడు నవీన్, బాలాజీ యాదవ్ ద్వారా నగదు తెప్పించి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చినట్లు సిట్ కు ఆధారాలు లభ్యమైనట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుపతికి చేరుకున్న సిట్ పోలీసులు చెవిరెడ్డి పాత్రపై విచారణ జరిపారు. అయితే మద్యం వ్యాపారమంటే తనకు అసహ్యమని, అలాంటి పాపం పని తాను చేయనని చెవిరెడ్డి అప్పట్లో ప్రకటించారు. అంతేకాకుండా తనను అరెస్టు చేయాలంటే చేసుకోవచ్చని చాలెంజ్ విసిరారు.

అయితే ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన సిట్ అరెస్టుకు మాత్రం ప్రయత్నించడలేదు. కానీ, చెవిరెడ్డి శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నంచగా, బెంగళూరు ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. గతంలో కూడా చెవిరెడ్డి, ఆయన కుమారుడు విదేశాలకు వెళ్లే సమయంలో ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. అప్పట్లో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు పెండింగులో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.

కాగా, మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి సుమారు రూ.250 కోట్లు మేర లావాదేవీలు జరిపినట్లు సిట్ చెబుతోంది. ఈ డబ్బును చెవిరెడ్డి తన సన్నిహిత మిత్రుడు వెంకటేశ్ నాయుడు కలిసి ఇతరులకు చేరవేసినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి నుంచి వసూలు చేసిన సొమ్ములను తన వ్యక్తిగత సహాయకులు, గన్ మన్స్, డ్రైవర్లు ద్వారా తెప్పించినట్లు చెబుతున్నారు. ఈ డబ్బును ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైసీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చెబుతున్నారు. ఆ సొమ్మునే ఓటర్లకు పంపిణీ చేశారంటున్నారు.

ఈ క్రమంలోనే గత ఏడాది మే 9న గరికపాడు చెక్ పోస్టు వద్ద రూ.8.36 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఆ డబ్బు తనదని చెబుతూ వెంకటేశ్ నాయుడు తిరిగి తీసుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై పూర్తిగా కూపీ లాగిన పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించింది. ఎవరెవరి పాత్ర ఉన్నదనే విషయమై పూర్తి ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. కాగా, చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడు అరెస్టుతో మద్యం స్కాంలో మొత్తం అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మొత్తం కేసులో 39 మంది ప్రస్తుతానికి నిందితులు జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News