చీపురుప‌ల్లి లో టీడీపీ - వైసీపీ కి నేత‌లు కావ‌లెను...?

ఉమ్మ‌డి విజ‌యన‌గ‌రం జిల్లాలోని చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రికీ తెలిసిందే.

Update: 2026-05-23 12:30 GMT

ఉమ్మ‌డి విజ‌యన‌గ‌రం జిల్లాలోని చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రికీ తెలిసిందే. దీనికి కార‌ణం.. ఇక్క‌డ నుంచి ప‌లుమార్లు .. బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌యం ద‌క్కించుకున్నారు. పైగా.. ఆయ‌న కుటుంబ రాజ‌కీయాలు కూడా ఎక్కువ‌గా ఇక్క‌డ నుంచే సాగాయి. చీపురుప‌ల్లి అంటేనే.. బొత్స‌కు కేరాఫ్‌గా కూడా మారిపోయింది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఇక‌, ఇదే స‌మ‌యంలో టీడీపీ నుంచి అయిష్టంగానే పోటీచేసిన‌.. మాజీ మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట్రావు.. 2024 ఎన్నిక‌ల్లో చీపురుప‌ల్లి నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీనికి ముందు ఆయ‌న ఎచ్చెర్ల నుంచి విజ‌యం దక్కించుకున్నారు. పైగా అది ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం. అయితే.. మార్పులు, చేర్పుల కార‌ణంగా.. చీపురు ప‌ల్లికి మారాల్సివ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌ళా వెంక‌ట్రావు సైలెంట్ అయిపోయారు. ఇక‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ వైసీపీ త‌ర‌ఫున శాస‌న మండ‌లిలో విప‌క్ష‌నాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు.

ఇది లావుంటే.. ఇరువురు నాయ‌కులు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌ప్పుకొనే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. వీరిలో బొత్స స‌త్య‌నారాయణ పూర్తిగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌ నుంచి త‌ప్పుకొంటార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌న ఆరోగ్య కార‌ణాల‌తో త‌ప్పుకొంటార‌ని అనుకున్నా.. జ‌గ‌న్ ఒత్తిడి మేర‌కు పోటీ చేశారు. ఇటీవ‌ల కాలంలో బొత్స‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు పెరిగాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బొత్స స్థానంలో ఎవ‌రిని నియ‌మిస్తార‌న్న చ‌ర్చ ఉంది.

ఇక‌, చీపురుప‌ల్లి కంటే కూడా.. త‌న‌కు క‌లిసి వ‌చ్చిన ఎచ్చెర్ల వైపే కిమిడి మొగ్గు చూపుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌న అత్యంత అయిష్టంగా చీపురుప‌ల్లి నుంచి పోటీ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకుంటే.. ఎచ్చ‌ర్ల నుంచే చేయాల‌ని భావిస్తున్నారు. దీంతో త‌ర‌చుగా ఆయ‌న సైలెంట్ విజిట్ చేస్తున్నారు. అంతే కాదు.. త‌న వ‌ర్గాన్ని కూడా ఎంగేజ్ చేస్తున్నారు. అంటే.. చీపురుప‌ల్లి నుంచి కిమిడి పోటీ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. దీంతో టీడీపీ కూడా ఇక్క‌డ అభ్య‌ర్థిని వెతుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి.

Tags:    

Similar News