చర్లపల్లి కంపెనీలో నెల రోజులు కూలీగా మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్

అయితే.. ఇదేమీ అలా వచ్చి ఇలా తనిఖీలు నిర్వహించి.. డ్రగ్స్ రాకెట్ ను బయటపెట్టలేదు. దీని కోసం భారీ ఎత్తున ప్లాన్ చేసిన వైనం వెలుగు చూసింది.;

Update: 2025-09-08 05:43 GMT

హైదరాబాద్ శివారులోని చర్లపల్లి పారిశ్రామికవాడలో వాగ్దేవీ ల్యాబ్ పేరిట నిర్వహిస్తున్న కంపెనీలో మెఫిడ్రిన్ డ్రగ్స్ ను తయారు చేస్తున్న వైనాన్ని మహారాష్ట్ర పోలీసులు గుర్తించి.. దాడులు నిర్వహించిన వైనం తెలిసిందే. అయితే.. ఇదేమీ అలా వచ్చి ఇలా తనిఖీలు నిర్వహించి.. డ్రగ్స్ రాకెట్ ను బయటపెట్టలేదు. దీని కోసం భారీ ఎత్తున ప్లాన్ చేసిన వైనం వెలుగు చూసింది. మాదకద్రవ్యాల దందా గుట్టు రట్టు చేసేందుకు నెల రోజులు మహారాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇందులో భాగంగా పోలీసు కానిస్టేబుల్ కూలీగా కంపెనీలోకి వెళ్లి.. అక్కడ జరుగుతున్న భాగోతాన్ని గుర్తించి.. పక్కాగా నిర్దారణ అయ్యాకే దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

ఈ దందాలో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ విజయ్ ఓలేటీ.. అతని వద్ద కెమికల్ ఎక్స్ పర్ట్ గా పని చేస్తున్న తానాజీ పండరీనాథ్ పట్వారీని అరెస్టు చేసిన వైనం తెలిసిందే. ఈ ఆపరేషన్ వివరాల్ని మహారాష్ట్ర విరార్ పోలీస్ కమిషనర్ నికేత్ కౌశిక్ స్థానిక మీడియాకు వివరాలు వెల్లడించారు. డ్రగ్స్ నెట్ వర్క్ చాలా క్లిష్టంగా ఉందని.. ఈ కారణంగా ఒక్కో దశను దాటేందుకు చాలా కష్టపడిన తర్వాతే చర్లపల్లికి చేరామని పేర్కొన్నారు.

మెఫిడ్రిన్ తయారీకి శ్రీనివాస్ విజయ్ గురుగ్రామ్ లోని కిమియా బయోసైన్స్ అనే కంపెనీ నుంచి ముడిపదార్థాలు తెప్పించినట్లుగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. ముడిపదార్థాలను అసలు పేర్లను పక్కన పెట్టేసి.. ఇతర పేర్లు ఉన్న లేబుళ్లు వాటికి అంటించి హైదరాబాద్ కు తరలించేవారని చెబుతున్నారు. మార్కెట్లో కిలో మెఫిడ్రిన్ విలువ రూ.1.25 కోట్లు ఉంటే.. శ్రీనివాస్ విజయ్ మాత్రం తన నెట్ వర్క్ కు రూ.50 లక్షలకే అమ్మినట్లుగా తాము గుర్తించినట్లు చెబుతున్నారు.

మొదట్లో హైదరాబాద్ లోని టెకీలకు మెఫిడ్రిన్ అమ్మేవాడని.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయటం షురూ చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ టెకీలు మెఫిడ్రిన్ తో పట్టుబడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గత ఏడాది తెలంగాణలో 107 కేజీల మెఫిడ్రిన్ పట్టుబడింది. శ్రీనివాస్ నెట్ వర్కుపై ఫోకస్ చేసిన మహారాష్ట్ర పోలీసులు అతను ఏయే ప్రాంతాలకు వీటిని సరఫరా చేసే వారన్న విషయంపై విచారిస్తున్నారు. అయితే.. నిందితుడి కుటుంబ వాదన మరోలా ఉంది. శ్రీనివాస్ విజయ్ కు అప్పులున్న విషయం అందరికి తెలుసని.. అలాంటప్పుడు డ్రగ్స్ తయారీకి లక్షలాది రూపాయిలు విలువ చేసే ముడిపదార్థాలు ఎలా కొంటాడని ప్రశ్నిస్తున్నారు. ముంబయికి చెందిన ఒక వ్యక్తికి శ్రీనివాస్ విజయ్ బాకీ ఉన్నారని.. అతను కక్షకట్టి డ్రగ్స్ కేసులో ఇరికించినట్లుగా ఆరోపిస్తున్నారు.

మరోవైపు మహారాష్ట్ర పోలీసులు శ్రీనివాస్ విజయ్ నిర్వహించే కంపెనీకి బోర్డు ఉండని వైనాన్ని గుర్తించి.. తమ సిబ్బందిని లారీ డ్రైవర్లు.. క్లీనర్లు..కూలీల రూపంలో రెండు రోజులు రెక్కీ నిర్వహించినట్లు చెబుతున్నారు. రోజు కూలీగా కానిస్టేబుళ్లను పంపి ఆ కంపెనీలో పనులు చేయించటం ద్వారా.. అక్కడేం జరుగుతుందన్న విషయాన్ని తాము గుర్తించామంటున్నారు. సదరు కంపెనీలు డ్రగ్స్ తయారీ జరుగుతుందన్న అంశంపై పక్కా సమచారం అనంతరమే దాడులు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. చర్లపల్లి కంపెనీలో మెఫిడ్రిన్ తయారీకి వినియోగించే ముడిపదార్థాలు.. రసాయన డ్రమ్ములను మహారాష్ట్ర పోలీసులు ఆదివారం తరలించారు. మొత్తంగా ఈ వ్యవహారం చర్లపల్లి పారిశ్రామిక వాడలో సంచలనంగా మారింది.

Tags:    

Similar News