వరల్డ్ రికార్డు దిశగా చంద్రబాబు

యోగా డే సందర్భంగా మొత్తం 22 వరల్డ్ రికార్డులు స్థాపించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.;

Update: 2025-06-20 04:51 GMT

ఏపీ సీఎం చంద్రబాబు అరుదైన రికార్డు సాధించబోతున్నారు. ఇప్పటికే అత్యధిక కాలం ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్న చంద్రబాబు.. విభజిత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా కూడా ఘనత వహించారు. ఇక పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంపై తన బ్రాండ్ వేసిన సీఎం.. ఇప్పుడు యోగాంధ్ర కార్యక్రమంతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు స్థాపించబోతున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శనివారం విశాఖలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. విశాఖలో దాదాపు 5 లక్షల మందితో యోగా నిర్వహించడంతోపాటు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 2.30 కోట్ల మంది యోగా నిర్వహించేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారు.

యోగా డే సందర్భంగా మొత్తం 22 వరల్డ్ రికార్డులు స్థాపించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. దీనికోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో చేపడుతున్న కార్యక్రమంలో 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లక్ష 29 వేల ప్రాంతాల్లో యోగా నిర్వహించేలా కార్యక్రమం డిజైన్ చేశారు. అదేవిధంగా విశాఖలో 26 కిలోమీటర్ల పొడవున 326 కంపార్టమెంట్లను ఏర్పాటు చేశారు.

రెండు గిన్నిస్ రికార్డులతోపాటు 22 ప్రపంచ రికార్డులు సాధించడమే టార్గెట్ గా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు.గ్రామ, మండల స్థాయిలో కూడా ఎన్నడూ లేని విధంగా యోగా శిబిరాలు పెడుతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందిని భాగస్వాములుగా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తే.. 2.30 కోట్ల మంది రిజిస్ట్ చేసుకున్నారు. మొత్తానికి రేపు జరిగే కార్యక్రమంతో అంతర్జాతీయంగా చంద్రబాబు పేరు మార్మోగనుందని అంటున్నారు.

Tags:    

Similar News