జగన్ విషయలో ఫెయిల్... సంచలన వ్యాఖ్యలు చేసిన బాబు !

అందుకేనేమో బహుశా ఆయన తండ్రి వైఎస్సార్ కూడా జగన్ ని తన వద్ద ఉంచుకోకుండా బెంగళూరు పంపేశారు అంటూ సెటైర్లు వేశారు.

Update: 2024-05-08 17:19 GMT

జగన్ ని సరిగ్గా అంచనా వేయడంలో తాను గతంలో ఫెయిల్ అయ్యాను అని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రముఖ చానల్ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మీద సంచలన కామెంట్స్ చేశారు. జగన్ అన్న వ్యక్తి ఎవరి ఊహలకూ అందడని బాబు చెప్పడం విశేషం. ఆయన ఆలోచనలను ఎవరూ అంచనా వేయలేరని అన్నారు. అందుకేనేమో బహుశా ఆయన తండ్రి వైఎస్సార్ కూడా జగన్ ని తన వద్ద ఉంచుకోకుండా బెంగళూరు పంపేశారు అంటూ సెటైర్లు వేశారు.

జగన్ అన్న సీఎం ని తాను ఎక్కడా చూడలేదు అని బాబు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎంలతో పనిచేశాను అని జగన్ మాత్రం వేరే రకం అంటూ కామెంట్స్ చేశారు. ఆయన సీఎం గా అయిన అయిదేళ్ల కాలంలో ఏపీని సర్వనాశనం చేశాడని కోలుకోలేని దెబ్బను రాష్ట్రానికి కొట్టాడని బాబు విమర్శించారు.

ఏపీలో ఏ రంగమూ అభివృద్ధి చెందలేదని అప్పుల కుప్పగా చేశారు అని అన్నారు. ఈ రోజున జగన్ పరిస్థితి చూస్తే ఆయన రాజకీయంగా మళ్ళీ గెలిచే పరిస్థితులు లేకుండా చేసుకున్నాడని బాబు అన్నారు. తనను ఎవరూ టచ్ కూడా చేయలేరు అని ఒకనాడు విర్రవీగిన జగన్ కి ఈసారి బేలతనం ఆవహించిందంటే అది టీడీపీ కూటమి బలం అన్నారు. మూడు పార్టీలు జట్టుకట్టాయని జగన్ భయంతో చెబుతున్నారని అన్నారు.

తాను సీఎం గా అసెంబ్లీలో అడుగుపెట్టే రోజు చాలా దగ్గరలో ఉందని అన్నారు. ఎన్నికలు లాంచనం అని బాబు పేర్కొన్నారు. తాను ఏపీ కోసం పొత్తులు పెట్టుకున్నాను అని ఆయన చెప్పారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ఆయన చెప్పారు.

Read more!

మోడీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. తాను కేంద్రంతో గతంలో కొన్ని విషయాల్లో విభేదించిన మాట వాస్తవమని అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీని రక్షించుకునేందుకు కలవడం అనివార్యం అని బాబు అన్నారు.

ఇదిలా ఉండగా 2019లో జగన్ ని తాను తక్కువ అంచనా వేయడం వల్లనే ఓటమి పాలు అయ్యాను అని ఆయన అంగీకరించారు. ఈసారి మాత్రం తాను అన్నీ చూసుకుంటూ ముందుకు వచ్చానని ప్రజలు కూడా ఈసారి జగన్ ప్రభుత్వాన్ని దించాలని కంకణం కట్టుకున్నారు అని బాబు అంటున్నారు.

మొత్తానికి చూస్తే మరోసారి ఏపీలో అధికారం టీడీపీకి తధ్యమన్న ధీమాను బాబు వ్యక్తం చేశారు. జగన్ పార్టీని జనాలు సంపూర్ణంగా తిరస్కరిస్తున్నారు అది ఉగ్యోగులతోనే మొదలైందని కూడా ఆయన చెప్పారు. ఏది ఏమైనా చంద్రబాబు పూర్తి ఆత్మ విశ్వాసంతో మనోనిబ్బరంతో ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

Tags:    

Similar News