పదికి పదీ..బాబు రాజకీయ వ్యూహమిది !
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుని అందుకే అపర రాజకీయ చాణక్యుడు అంటారు. ఆయన ఒక విజయంతో ఆనందపడరు.;
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుని అందుకే అపర రాజకీయ చాణక్యుడు అంటారు. ఆయన ఒక విజయంతో ఆనందపడరు. ఒక అవకాశంతో రిలాక్స్ కారు. ఆయన చూపు దీర్ఘంగా ఉంటుంది. ఆయన ఆలోచనలు ఇంకా తీక్షణంగా ఉంటాయి. ఆయన రాజకీయ ప్రణాళికలు పదును తేరి ఉంటాయి. ఆయన నోటి వెంట ఒక ప్రకటన వచ్చిందంటే దాని వెనక ఒక భారీ వ్యూహం అప్పటికే మస్తిష్కంలో తయారై ఉంటుంది అని కూడా చెబుతారు.
కంచుకోట మంచుకోటగా :
వైసీపీకి తిరుగులేని బలాన్ని ఇస్తూ కంచుకోటగా మారిన రాయలసీమను 2024 ఎన్నికల్లో మంచు కోటగా బాబు మార్చేశారు అంటే ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటో ఎవరైనా ఊహించగలరా. ఇక 2024 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ వాటాను కేవలం ఏడు సీట్లే అని విదిలించేసి మొత్తం సీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలలో ఉన్న 52 సీట్లలో 45 సీట్లను కూటమి వైపు లాగేసిన బాబు చాకచక్యం కూడా గణనీయమైనదిగా చెబుతారు.
కడపలో పాగా :
కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఏడు సీట్లను 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుచుకుంది. కేవలం మూడు సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయి. అందులో జగన్ పులివెందుల ఒకటి. అక్కడ జగన్ మెజారిటీ 2019 కంటే చాలానే తగ్గింది. దాంతో టీడీపీ కొత్త ఆశలతో సరికొత్త ఆలోచనలతో ముందుకు కదులుస్తోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి కడప జిల్లా వచ్చిన చంద్రబాబు అక్కడ జరిగిన సభలో మాట్లాడుతూ రాయలసీమ కూటమికి మద్దతుగా 2024 ఎన్నికల్లో నిలిచింది. దానికి తగినట్లుగా గత ఏడాదిగా అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపడుతూ వస్తోందని చెప్పారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు కడప జిల్లా నుంచి గెలవడం తధ్యం అని ముందుగానే జోస్యం చెప్పారు ప్రజలు ఆ దిశగా అధ్బుతమైన తీర్పు ఇస్తారని కూడా బాబు పేర్కొనడం విశేషం.
పులివెందుల టార్గెట్ :
యాభై ఏళ్ళుగా వైఎస్సార్ కుటుంబానికి కట్టుబడిపోయిన పులివెందులను సైకిలెక్కించడానికి టీడీపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కానీ అది సాధ్యపడలేదు. అయితే వైసీపీ అధినాయకత్వం వ్యవహార శైలితో పాటు పులివెందులలో ఆ పార్టీకి సరైన బలమైన నాయకత్వం ఇటీవల కాలంలో లేకపోవడం టీడీపీ ఆశలను పెంచుతోంది. పులివెందులకు అసలైన పులిగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఉండేవారు. ఆయన 2019 ఎన్నికల ముందు దారుణ హత్యకు గురి అయ్యారు. ఆ కేసు వైసీపీని ఈ రోజుకీ ఉక్కిరిబిక్కిరి చేయడం ఒక ఎత్తు అయితే వివేకా వంటి గట్టి నేతను జనంతో మమేకం అయిన వారిని కోల్పోవడం ఆ పార్టీకి తీరని లోటుగా ఉంది. దాంతోనే టీడీపీ ఒక వ్యూహం ప్రకారం జగన్ పులివెందుల కోటను బద్ధలు కొట్టాలని చూస్తోంది అని అంటున్నారు.
సెంటిమెంట్ పలచన అవుతోందా :
చంద్రబాబు పదే పదే వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారు. ఆయన పులివెందులలో అత్యంత కీలక నాయకుడు. ప్రజా సమస్యలను ఆయన ఎన్నో పరిష్కరించిన వారుగా వారు మనసులో ఉన్నారు. అందుకే ఆయన హత్యను తన మీద పెట్టారని నాటకాలు ఆడారని, చివరికి ఏమి జరిగిందో తెలుసు కదా అని ప్రజలనే చంద్రబాబు నేరుగా ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఏడేళ్ళ క్రితం జరిగిన వివేకా హత్య ఈ రోజుకీ లైం లైట్ లో ఉంది. ఈ హత్య ఎంతకాలం నలుగుతూ ఉంటే అది వైసీపీకి తీరని నష్టాన్ని రాజకీయంగా కలుగ చేస్తూనే ఉంటుంది. ఇక దాని ప్రభావం కడప జిల్లా మొత్తం మీద కూడా ఉంటుందని అంటున్నారు.
ఏమి జరగనుంది :
వైఎస్సార్ కుటుంబానికి పులివెందుల ఊరకే కంచుకోట కాలేదు. వైఎస్సార్ అక్కడ నుంచి ఆరు సార్లు గెలిచారు. కానీ ఆయన తన ప్రతినిధిగా వివేకాను అక్కడ ప్రతిష్టింపచేశారు. వివేకా జనంతో ఉండడం వల్లనే ఆ కుటుంబానికి ఒక సెంటిమెంట్ గా మారుతూ వచ్చింది. ఇపుడు ఎటూ వివేకా లేకుండా పోయారు. దాంతో ప్రజలకు వైఎస్సార్ కుటుంబానికి మధ్య ఒక గ్యాప్ అయితే ఏర్పడింది అని అంటున్నారు. మరో వైపు వైఎస్సార్ కుటుంబంలో సైతం చీలికలు వచ్చాయి.
జగన్ సొంత చెల్లెలు షర్మిల వేరే పార్టీలో ఉంటూ రాజకీయంగా సవాల్ చేస్తున్నారు. అలాగే వివేకా కుమార్తె సునీత సైతం వ్యతిరేకం అయ్యారు. తల్లి విజయమ్మ మౌనంగా ఉండడం కూడా వైసీపీకి నష్టం తెచ్చిపెడుతోంది. ఈ పరిణామాలు అన్నీ టీడీపీకి కొత్త ధైర్యాన్ని ఇస్తున్నాయి. దాంతో పాటు సుదీర్ఘకాలంగా ఒకే కుటుంబానికి కట్టుబడిన పులివెందుల ఈసారి మార్పు కోరుకుంటే అక్కడ సంచలన రాజకీయ తీర్పు నమోదు కావచ్చు అని అంటున్నారు. మరి పదికి పది అని గట్టిగా గర్జిస్తున్న టీడీపీని వైసీపీ ఏ విధంగా ఫేస్ చేస్తుందో చూడాల్సిందే.