అడగకుండా వరం ఇచ్చిన బాబు
ఇక ఏపీలో చూస్తే మొత్తం 64 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 వేల 717 కోట్ల రూపాయలు విడుదల చేసింది.;
చంద్రబాబు ఎపుడూ అభివృద్ధి మంత్రమే జపిస్తారు. కానీ ఈసారి మాత్రం ఆయన రూట్ మార్చారు. సంక్షేమానికి కూడా బ్రాండ్ అంబాసిడార్ కావాలని చూస్తున్నారు. ఆయన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా సామాజిక పెన్షన్లు ఏకంగా వేయి రూపాయలు ఒకేసారి పెంచడం అన్నది చిన్న విషయం కాదు. పైగా 2024 ఏప్రిల్ నుంచి బకాయిలతో ఆయన చెల్లించారు.
ఇది ఇంకా గ్రేట్ అని ఇప్పటికీ అంటారు. ఇక ఠంచనుగా ప్రతీ నెలా ఒకటవ తేదీకి పెన్షన్ వారి ఇళ్లకు వెళ్ళి ఇచ్చే విధంగా సచివాలయ సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటూ బాబు రికార్డు టైం లో పంపిణీ చేస్తున్నారు. అలాగే ఒకటవ తేదీ ఆదివారం పడితే ముందు రోజునే పెన్షన్ ఇవ్వడం ద్వారా సామాజిక పెన్షన్ల విషయంలో తన నిబద్ధతను ఆయన చాలా గట్టిగానే చాటుకుంటున్నారు.
ఇక ఏపీలో చూస్తే మొత్తం 64 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 వేల 717 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అంతే కాదు సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల దాకా అందరూ ఇంటింటికీ వెళ్లి మరీ పెన్షన్ ఇచ్చారు.
చంద్రబాబు అయితే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గున్నేపల్లి లో ఉపాధి హామీ పధకంలో పనిచేస్తున్న మహిళలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ ఎవరూ కోరకుండానే ఒక వరం ఇచ్చేశారు.
తనకు ఏ మాత్రం అవకాశం ఉన్నా సామాజిక పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఫించను మొత్తాన్ని అందిస్తున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని గుర్తు చేశారు. పేదలకు అండగా నిలవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని చంద్రబాబు చెప్పారు.
ఏపీలో సామాజిక పెన్షన్లను ఒకేసారి 75 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచిన ఘనత తనదే అన్నారు. ఆ తరువాత వాటిని 2000 రూపాయలు చేశామని చెప్పారు. ఇపుడు నాలుగు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్లను భగవంతుడు కరుణిస్తే మరింతగా పెంచుతామని ఒక భారీ హామీని బాబు ఇచ్చారు.
బాబు ఇలా అన్నారంటే కచ్చితంగా చేస్తారు. అది ఇవాళా రేపో కాకపోవచ్చు కానీ 2029 ఎన్నికల ముందు కచ్చితంగా పెన్షన్ అయిదు వేల రూపాయలు చేసి ఆయన జనం వద్దకు వెళ్తారని అంటున్నారు. దాంతో పెన్షన్లు జగన్ పెంచుతామని హామీ ఇచ్చే చాన్స్ లేకుండా ఇప్పటి నుంచే ముందర కాళ్ళకు బంధం వేశారు అని అంటున్నారు. ఇక జగన్ అయితే ఆరు వేల రూపాయలు అని చెప్పాలి. అది మరీ ఎక్కువగా ఉంటుంది. పైగా ఆర్ధికంగా ఇబ్బంది అవుతుంది. సో బాబు అయిదు వేల రూపాయల పెన్షన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్ళేట్లుగా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి బాబు సామాజిక పెన్షనర్ల విషయంలో దేవుడిగా కనిపిస్తున్నారు.