అమరావతి మన ఆత్మగౌరవం.. సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం

రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.;

Update: 2026-03-28 18:13 GMT

రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఆంధ్రుల చరిత్ర, రాజధాని ఆవశ్యకత, గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అంటే కేవలం ఐదేళ్ల చరిత్ర మాత్రమే కాదన్నారు. మన రాజధానికి వేల ఏళ్ల వైభవం ఉందని సీఎం గుర్తుచేశారు. తెలుగు జాతి ఘన చరిత్ర అమరావతి అని, శాతవాహనుల వారసత్వంగా అమరావతి మనకు రాజధానిగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాజధాని అమరావతికి ప్రాచీన వైభవం ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. కృష్ణా-గోదావరి నదుల మధ్య ఉన్న అమరావతిని రాజధానిగా చేసుకుని శాతవాహనులు పాలించారని, ఆ చరిత్రకు సాక్ష్యంగా నేటికీ బ్రిటిష్ మ్యూజియంలో 'అమరావతి గ్యాలరీ' ఉందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చే వరకు మనల్ని మద్రారాసీలు అనేవారని, కానీ, ఎన్టీఆర్ కారణంగా 'ఆంధ్రులు' అనే ప్రత్యేక గుర్తింపు లభించిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించిందని కొనియాడారు.

హైదరాబాద్ ఆదాయం.. విజన్ ఫలితమే!

రాష్ట్ర అభివృద్ధిలో తన దార్శనికతను వివరిస్తూ హైదరాబాద్ ప్రస్తావన తెచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐటీ రివల్యూషన్ తీసుకువచ్చామని, 1991 ఆర్థిక సంస్కరణలను అందిపుచ్చుకుని, 'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్'తో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశామన్నారు. తాను ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన సైబరాబాద్ వల్ల నేడు హైదరాబాద్ నుండి రూ.1.05 లక్షల కోట్ల రెవెన్యూ వస్తోందని, అది తన విజన్ అని స్పష్టం చేశారు.

రైతుల త్యాగం అమరావతి

విభజన కష్టాల్లో ఉన్నప్పుడు రాజధాని కోసం రైతులు ముందుకు రావడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన అమరావతి రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాదును పదేళ్ల పాటు రాజధానిగా వాడుకునే అవకాశం ఉన్నా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో విజయవాడ వచ్చేశామని, కేవలం 9 నెలల్లోనే అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలను నిర్మించుకున్నామని వివరించారు. సింగపూర్ సహకారంతో ప్రపంచస్థాయి ప్రణాళికలు సిద్ధం చేశామని గుర్తుచేశారు.

'ఊసరవెల్లి' రాజకీయాలు

ఇక ఈ సందర్భంగా గత పాలకుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా రంగులు మార్చారని విమర్శించారు. రాజధానిపై కుట్రలు చేస్తూ తోటలకు నిప్పు పెట్టడం, ప్రపంచ బ్యాంకుకు ఈ-మెయిళ్లు పంపడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్, అమరావతి.. తెలుగు వారికి చెందిన ఈ రెండు నగరాలు దేశంలోనే టాప్-2 స్థానాల్లో ఉండాలన్నదే నా సంకల్పం. పవిత్రమైన మట్టి, నీరుతో పునీతమైన అమరావతి శాశ్వతంగా నిలుస్తుంది." అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

Tags:    

Similar News