చంద్రబాబును కదిలించిన వైరల్ వీడియో.. రూ.5 లక్షలు ఇచ్చిన సీఎం

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబును కదిలించింది.;

Update: 2025-06-18 09:38 GMT
చంద్రబాబును కదిలించిన వైరల్ వీడియో.. రూ.5 లక్షలు ఇచ్చిన సీఎం

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబును కదిలించింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన దారుణం తెలుసుకున్న చంద్రబాబు చలించిపోయారు. బాధితురాలితో స్వయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తక్షణ సహాయంగా ఆ మహిళకు రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బాధితురాలిపై దుశ్చర్యకు పాల్పడిన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించారు.

కుప్పం నియోజకవర్గం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన శిరీషను అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప అనే వ్యక్తి చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. బాధితురాలు శిరీష చిన్నకుమారుడు పక్కనే ఏడుస్తున్నా నిందితుడు కనికరించలేదు. శిరీష భర్త తిమ్మరాయప్ప దాదాపు 80 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తం తిరిగి చెల్లించకుండా అతడు భార్య, పిల్లలను వదిలేసి పరారయ్యాడు. అయితే భర్త లేకపోవడంతో శిరీష పిల్లలను తన కన్నవారింటికి పంపి, ఉపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. చిన్నకుమారుడు చదువు నిమిత్తం సొంత ఊరిలో టీసీ తీసుకోవాలని భావించిన శిరీష నారాయణపురం తిరిగి వచ్చింది. ఆమె రాక తెలుసుకున్న మునికన్నప్ప భర్త చేసిన అప్పు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె పట్ల కర్కశంగా వ్యవహరించాడు.

శిరీషను బంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకపోయిందని ప్రతిపక్షం వైసీపీ తన సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. మహిళను చెట్టుకు కట్టేసినట్లు ఉన్న ఆ ఫొటో చూసిన వారు అంతా దారుణంపై స్పందించారు. అయితే ఫొటో బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం కూడా స్పందించింది. హోంమంత్రి అనిత బాధితురాలితో వీడియో కాల్ లో మాట్లాడి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రంగంలోకి దిగారు.

మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిరీషతో ఫోన్ లో మాట్లాడారు. తక్షణ సహాయంగా రూ.5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠతో మాట్లాడారు. నిందితుడు మునికన్నప్ప అరెస్టుతోపాటు బాధితురాలు శిరీషను ఆదుకునే అంశంపై చర్చించారు.

కాగా, శిరీష విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. బాధితురాలు విషయం వెలుగు చూసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరూ స్పందించడాన్ని అంతా అభినందిస్తున్నారు. ముందు రోజు ఫొటోను వైరల్ చేసి విమర్శలు గుప్పించిన వారే బాధితురాలి కష్టాలు తీర్చేలా రూ.5 లక్షలు సాయం చేయడంపై ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News