ఎంత సేపూ బాబేనా.. బీజేపీకి బాధ్యత లేదా?
వాస్తవానికి కూటమిగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న బిజెపి.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది.;
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను, అదేవిధంగా కేంద్రం అమలు చేస్తున్న పథకాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఆయన ఎక్కడ పర్యటించినా.. ఎక్కడ ప్రసంగించినా.. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అయితే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో చేపడుతున్న పథకాలను, రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను కూడా ప్రజలకు వివరిస్తున్నారు.
కేంద్రంలో మోడీ అవసరమని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే విజయం దక్కించుకుంటారని చెబుతున్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని, దీనివల్ల `వికసిత్ భారత్` సాకారం అవుతుంది అన్నది చంద్రబాబు పదేపదే చెబుతున్న మాట. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా చంద్రబాబు అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని రెండు కలిపి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, కూటమిలో ఉన్న బిజెపిలో మాత్రం ఈ తరహా సంస్కృతి కనిపించడం లేదు.
వాస్తవానికి కూటమిగా గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న బిజెపి.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. సీఎం చంద్రబాబు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నారో ఏ విధంగా పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారో కేంద్రాన్ని ఎలా అయితే క్షేత్రస్థాయిలో బలంగా ప్రచారం చేస్తున్నారో.. అదే తరహాలో బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది,
కానీ, ఈ విషయంలో బిజెపి నాయకులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. మరి ఇది కూటమి ధర్మానికి విరుద్ధమా? కాదా? అనేది నాయకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఈ తరహాలో అయితే ప్రచారం చేయలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా మోడీనే గెలుస్తారని అప్పట్లో చెప్పలేదు. కానీ, ఇప్పుడు పదేపదే ప్రధానమంత్రి మోడీని.. అదేవిధంగా కేంద్రం అమలు చేస్తున్న పథకాలను కూడా ప్రచారం చేస్తున్నారు. మరి బీజేపీ నాయకులకు ఎందుకని ఇది పట్టడం లేదు? అనేది ప్రశ్న.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను ప్రచారం చేయడంలోనూ, సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ వారు ఎక్కడా ఉత్సాహంగానీ.. కనీసం ఆలోచన గానీ చెయ్యకపోవడం రాజకీయ వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదే విషయాన్ని టిడిపి నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తమను ఆదేశిస్తున్నారని.. డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో మంచి చేస్తోందన్న విషయాన్ని చెప్పాలని పదేపదే చెబుతున్నారని అంటున్నారు.
కానీ బిజెపి నాయకులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆ విధంగా ప్రచారం చేయడం లేదని అంటున్నారు. అలాంటప్పుడు తాను ఎందుకు చేయాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే కూటమిలో ఉన్న బిజెపి డబుల్ ఇంజన్ సర్కారును ప్రస్తావించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం పట్ల టిడిపి నాయకుల్లో కొంత అసహనం అయితే పెరుగుతోంది. మరి దీనిపై చంద్రబాబు జోక్యం చేసుకొని బిజెపి నాయకులను కూడా కలుపుకొని వెళ్లే లాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.