మోడీపై పొగ‌డ్త‌ల ప‌ర‌మార్ధ‌మేమి చంద్ర‌బాబు గారు...!

ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో కూడా సందర్భం లేకపోయినా మోడీని 20 నిమిషాల పాటు ప్రశంసించారు.;

Update: 2025-09-17 16:55 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగడడం తప్పు కాదు. ఆయనను మెచ్చుకోవడం కూడా తప్పుకాదు. ఎందుకంటే రాష్ట్రంలో బిజెపి- జనసేన- టిడిపి కలిసి ప్రభుత్వంగా ఏర్పడ్డాయి. కాబట్టి బిజెపి ఎలాగూ మోడీని అత్యున్నత స్థాయి నాయకుడిగా చూస్తున్న నేపథ్యంలో ఆయనను పొగడడం ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ, దీనికి కూడా సమయం, సందర్భం అంటూ ఒకటి ఉండాలి. ఇవేవీ లేకుండా ఏ సమయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ప్రధానమంత్రి మోడీని ఆకాశానికి ఎత్తేయడం ఇటీవల కాలంలో చంద్రబాబుకు అలవాటుగా మారింది.

వాస్తవానికి ఇంత స్థాయిలో అసలు పొగడాల్సింది చంద్రబాబుని. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో చక్రం తిప్పుతోంది అంటే దానికి కారణం చంద్రబాబు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మద్దతు మోడీకి ఉన్నప్పటికీ అంతకు మించిన సంఖ్యలో ఎంపీల ద్వారా చంద్రబాబు మోడీకి మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడేలాగా సహకరించారు. కాబట్టి ఎక్కడ మాట్లాడినా మోడీ లాంటి వ్యక్తులు చంద్రబాబును హైలెట్స్ చేయాలి. చంద్రబాబు ను పొగడాలి. కానీ, దీనికి భిన్నంగా సంపూర్ణ మద్దతు ఉన్న చంద్రబాబు పదేపదే మోడీని ప్రస్తావించటం ఆకాశానికి తీయడం వంటివి ఆశ్చర్యకరంగాను ఆసక్తిగాను మారాయి.

ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో కూడా సందర్భం లేకపోయినా మోడీని 20 నిమిషాల పాటు ప్రశంసించారు. ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మోడీనే గెలుస్తారని చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చారు. వాస్తవానికి బిజెపి నాయకులు కూడా ఈ మాట చెప్పడం లేదన్నది వాస్తవం. ఎందుకంటే గత ఏడాది జరిగిన ఎన్నికల్లోనే బిజెపికి ఓట్లు తగ్గాయి, అదే విధంగా సీట్లు కూడా తగ్గాయి. దీంతోనే ఏపీలో చంద్రబాబు బీహార్ లో నితీష్ కుమార్‌ను పెట్టుకొని కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చారు.

ఆ నేపథ్యంలో బిజెపి నాయకులు వచ్చే ఎన్నికల్లో మోడీ మళ్ళీ గెలుస్తారనే విషయాన్ని ఎక్కడ ప్రస్తావించడం లేదు. కానీ, చంద్రబాబు మాత్రం పదేపదే ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇక తాజాగా జరిగిన కలెక్టర్లు ఎస్పీల సదస్సులో కూడా చంద్రబాబు మోడీ గురించి పదేపదే తన ప్రసంగంలో ప్రస్తావించారు. అద్భుతమైన పాలన అందిస్తున్నారని, వికసిత భారత ద్వారా దేశ పురోగతిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కలెక్టర్ల సదస్సులో రెండు రోజులపాటు ప్రస్తావించడంతో పాటు ప్రశంసలు గుర్తించారు.

ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇంతగా మోడీని పొగడాల్సిన అవసరం ఎందుకని, మనకు చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయి ఉన్నాయని, ముందు వాటిపై దృష్టి సారించి మోడీని ఒప్పించే ప్రయత్నం చేయాలన్నది మెజారిటీ రాజకీయ వర్గాలు కోరుతున్నాయి. కాబట్టి చంద్రబాబు ఈ పొగడ్తల మాట ఎలా ఉన్నప్పటికీ మోడీని మచ్చిక చేసుకున్నారు కాబట్టి ఏపీకి రావలసిన హక్కులను ఇతర అంశాలను సాధించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు కూడా చెబుతున్నారు.

Tags:    

Similar News