ఒట్టు పెట్టించుకున్న చంద్రబాబు.. విశాఖ సభలో రేర్ సీన్
తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఒక ఆసక్తికర వ్యాఖ్యను ప్రస్తావించాల్సిందే.;
సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నంతనే ఆయనకు సంబంధించిన కొన్ని అంశాలు ప్రతి తెలుగోడి మనసులోనూ మెదులుతాయి. ఆయనలో కొన్ని కోణాల్ని అస్సలు ఊహించలేం. పని.. పని.. మాత్రమే తప్పించి.. కాస్తంత చమత్కారంగా.. పార్టీ కార్యకర్తల మనసుల్ని టచ్ చేసేలా మాట్లాడే తీరు తక్కువే. కానీ.. 2019 తర్వాత నుంచి ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా చెప్పాలి. అన్నింటికి మించి జైలుజీవితం ఆయన్ను సమూలంగా మార్చటమే కాదు.. అప్పటివరకున్న ఆలోచనా ధోరణి మీదా మార్పులు తెచ్చిందని చెప్పాలి.
తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఒక ఆసక్తికర వ్యాఖ్యను ప్రస్తావించాల్సిందే. ఈ నెల 21న జరిగే యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరిన ఆయన.. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సభలో ఎంతమంది యోగా నేర్చుకున్నారో చేతులు ఎత్తాలని అడిగితే.. అందరూ చేతలు ఎత్తేశారు. దీంతో స్పందించిన చంద్రబాబు.. ‘‘నమ్మమంటారా? నా మీద ఒట్టా?’’ అని వ్యాఖ్యానించటంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ తరహాలో కార్యకర్తల మాటల్ని చంద్రబాబు.. తన మీద ఒట్టుగా పెట్టుకున్న రేర్ సందర్భంగా చెబుతున్నారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు తనను మోసం చేశారన్న చంద్రబాబు.. ‘ఎన్నికల సమయంలో బాబాయికి గుండెపోటు అనగానే.. తాను నమ్మానని.. ఆ రోజు కరెక్టుగా పని చేసి దోషుల్నిజైల్లో పెట్టి ఉంటే మనం ఓడిపోయేవాళ్లమా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. మరి గడిచిన ఏడాది నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో ఏం చేశారు? అన్నది ప్రశ్న. అంతేకాదు.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా తీరుస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు..ఏడాది వ్యవధిలో రాష్ట్రానికి రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని.. తన మీద నమ్మకంతో వచ్చినట్లుగా పేర్కొన్నారు.
కాకుంటే.. చాలామంది మీ రాష్ట్రంలో భూతం ఉంది. ఆ భూతం లేవదని గ్యారెంటీ ఏమిటి? అని అడుగుతున్నారని.. అలాంటి వారికి తాను చెప్పేది ఒక్కటేనని.. ఆ భూతాన్ని రాజకీయంగా శాశ్వితంగా భూస్థాపితం చేశానని.. భయపడాల్సిన అవసరం లేదని తాను చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఈ మాటలు ఆచరణలో అంత తేలిక కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి. మళ్లీ కార్యకర్తల సమావేశం జరిగే లోపు.. తాను చెప్పిన మాటల్లో కొన్నింటినైనా చేతల్లో చేసి చూపిస్తే బాగుంటుంది. మరేం జరుగుతుందో చూడాలి.