దేవన్ష్ ను మధ్యలోకి లాగిన వైసీపీ.. 'పిల్లలే సంపద'పై కొనసాగుతున్న విమర్శలు
ఇందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు రంగంలోకి దిగి ముందుగా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.
అధిక సంతానం కనాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై నిరసనలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. ఇక విపక్షం వైసీపీ సైతం చంద్రబాబు ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది. పిల్లల్ని కనడానికి వేలం పాట పెడతారా? అంటూ వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పెళ్లికాని యువకులు అంతా రూ.30 వేలు ఇస్తారు మూడో పిల్లాడ్ని కనండి.. రూ.40 వేలు ఇస్తాడు నాలుగో పిల్లాడ్ని కనండి అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. చంద్రబాబు మాత్రం ఒక్కరినే కంటాడు, ఆయన కొడుకు లోకేశ్ కూడా ఒక్కడినే కంటాడు. వారి అబ్బాయి దేవాన్ష్ సైతం ఒక్కరినే కంటాడు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.
‘పిల్లలే సంపద’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. జాతీయస్థాయిలో కూడా పలువురు మేథావులు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవవనరులు కావాలంటే మహిళలు మరింతమంది పిల్లల్ని కనడం ఒక్కటే పరిష్కారమా? అంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్ఛేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడి ప్రశ్నించారు. పిల్లల్ని కనడానికి బదులు వేరుగా ఆలోచించలేమా? అంటూ ఆమె ప్రశ్నించారు. తెలుగు భాషాభివృద్ధితోపాటు నైపుణ్య కేంద్రాలపై పెట్టుబడులు పెట్టాలని, దేశవ్యాప్తంగా ప్రతిభను ఆకర్షించడంతోపాటు సామర్థ్యంను పెంచి ఉత్పాదకతను బలోపేతం చేయాలని కిరణ్ బేడీ సూచించారు.
జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం కంటే, పిల్లలపై పెట్టుబడి పెట్టడం ముఖ్యం కాదా? అంటూ కిరణ్ బేడి ప్రశ్నించారు. కాగా, రెండు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన ‘జనాభా మేనేజ్మెంట్’పై హాట్ డిబేట్ జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా మేథావులు, విశ్లేషకులు చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఈ విషయంలో రాజకీయంగా దూకుడు చూపుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో యువత, మహిళలలో అవగాహన పెంచేలా విమర్శలు ఎక్కుపెడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు రంగంలోకి దిగి ముందుగా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఒక్కరినే కంటారని చెప్పడమే కాకుండా, వారి కుటుంబానికి చెందిన లోకేశ్ కొడుకు దేవాన్ష్ ను సైతం ఇందులోకి లాగుతున్నారని అంటున్నారు. వారి ఆస్తులను కాపాడుకోడానికి, ఆస్తులు చెక్కుచెదరకుండా ఉండటానికి ఒక్కొక్కరినే కంటారని, కానీ పేదలు మాత్రం నలుగురు, ఐదుగురుని కనమంటే ఎలా అంటూ మాజీ మంత్రి అంబటి ప్రశ్నిస్తున్నారు. మూడో పిల్లాడికి ఇస్తామన్న రూ.30 వేలతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తారు? రూ.30 వేలతో ఎంబీబీఎస్ చదివించాలా? రూ.40వేలతో అమరావతిలో స్థలం కొనుగోలు చేయాలా? అంటూ అంబటి ధ్వజమెత్తారు. ఆర్థిక స్థోమత లేని వారు అధిక సంతానం ఎలా కంటారంటూ ప్రశ్నించారు.