టీడీపీ టాక్: ఇదే కదా.. బాబు వీక్నెస్ ..!
చంద్రబాబు స్థిత ప్రజ్ఞుడు. ఆలోచనా పరుడు. దూరదృష్టి ఉన్న నాయకుడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.;
చంద్రబాబు స్థిత ప్రజ్ఞుడు. ఆలోచనా పరుడు. దూరదృష్టి ఉన్న నాయకుడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆయన విపక్షం విషయంలో అతిగా స్పందించడమే అన్ని రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. అంతేకాదు.. చంద్రబాబు వైసీపీ విషయంలో అతిగా స్పందించడంతో లేని గ్రాఫ్‌ను ఆ పార్టీకి కట్టబెడుతున్నారన్న చర్చ కూడా సొంత పార్టీ నాయకుల మధ్యే ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. తాజాగా వైసీపీ ప్రతిపక్షం కాదు.. విషవృక్షం... అన్నారు. మంచిదే. చంద్రబాబు ఆలోచన అలా ఉంటే.. దానిని అంతర్గతంగా తమ్ముళ్లకు చెప్పాలి.
ఇక, వైసీపీని భూస్థాపితం చేస్తున్నామని, కానీ, అది పైకి లేస్తోందని పేర్కొంటూ.. అరుంధతి సినిమా ను ఉదహరించారు. వాస్తవానికి ఇవన్నీ.. చంద్రబాబుస్థాయికి అవసరం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆ దాడి చేయమంటే మాబోటి వాళ్లం చేస్తాం.. అని తూర్పుగోదావరికి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యా నించారు. కానీ, చంద్రబాబు.. తాను భయ పడనని, వైసీపీ అయిపోయిందని.. భూస్థాపితం చేస్తున్నామని చెబుతూనే ఇలా వ్యాఖ్యానించడం ద్వారా.. వైసీపీ గ్రాఫ్‌ను ఆయన పరోక్షంగా పెంచుతున్నారని చెబుతు న్నారు.
''వైసీపీ పరిస్థితి ఎప్పుడో అయిపోయింది. కానీ, మేం మాత్రం.. ఆ పార్టీని పైకి లేపుతున్నాం. మేం సైలెంట్ గా ఉంటే.. అసలు వైసీపీని ఎవరు పట్టించుకుంటారు. మా నాయకుడు వైసీపీ గురించి మాట్లాడిన ప్రతిసారీ ప్రజల మధ్య చర్చకు వస్తోంది. కొన్ని పత్రికల్లో దీనిని హైలెట్ కూడా చేస్తున్నారు. దీంతో లేని గ్రాఫ్‌ను ఆ పార్టీకి ఇస్తున్నారు.పైగా చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకునేలా కూడా ఈ వ్యవహారం మారుతోంది.'' అని సదరు మాజీ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇది కూడా.. నిజమే. వైసీపీ గురించి చంద్రబాబు మాట్లాడితే.. అవుతున్న చర్చ... వైసీపీ నాయకులు మాట్లిడితే కూడా కావడం లేదని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే..చంద్రబాబు మాట్లాడితే అది మంచైనా చెడైనా కొన్ని మీడియా వర్గాలు హైలెట్ చేస్తున్నాయి. ఇక, వైసీపీ నేతలు ఏం మాట్లాడినా.. అంతగా ప్రచారంలోకి రావడం లేదు. ఈ వ్యవహారంలో చంద్రబాబు మౌనంగా ఉంటే.. ఎన్నికలకు ముందు చూసుకోవచ్చని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ప్రజలు మరిచిపోతున్న వైసీపీని ఆయనే ఏదో ఒకరకంగా కెలుకుతున్నారన్న వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం.