ఎన్టీఆర్ ఫ్యామిలీలో చంద్రబాబుకు మొదట పరిచయం ఆయనతోనే !

ఎన్టీఆర్ మద్రాస్ లో బిజీగా సినిమా షూటింగ్ చేస్తున్న రోజులు అవి. అయితే హైదరాబాద్ లో ఆయనకు స్టూడియోతో పాటు సినిమా ధియేటర్లు ఉండేవి.;

Update: 2025-08-20 14:15 GMT

వెండి తెర వేలుపు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ది చాలా పెద్ద కుటుంబం ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు. ఇక ఆయన సినీ రాజకీయ రంగాలలో ఎంతలా రాణించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కుటుంబంలోకి చంద్రబాబు ఎలా వచ్చారో అన్నది చాలా మందికి తెలియని విషయం. ఎన్టీఆర్ కి ఆయన మూడవ అల్లుడు. అయితే బాబు అల్లుడు కాకముందే ఆ కుటుంబంతో ఒకరితో సాన్నిహిత్యం బాగా ఉండేది. ఒక విధంగా ఆయన ద్వారానే బాబు ఎన్టీఆర్ కి చేరువ అయి కుటుంబ సభ్యుడు అయ్యారని చెప్పాల్సి ఉంటుంది.

చంద్రబాబు కాంగ్రెస్ లో :

ఇక చంద్రబాబు రాజకీయ జీవితం కాంగ్రెస్ లో ప్రారంభం అయింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా కీలక శాఖలు చూసారు. అందులో సినిమాటోగ్రఫీ శాఖ ఒకటి. ఈ శాఖ పూర్తిగా సినీ రంగానికి సంబంధించినది. ఆ రోజులలో చంద్రబాబు కూడా ఆరడుగులకు పైగా పొడువుతో ఒక సినిమా హీరోగా ఉండేవారు. ఆయన అనేక చిత్రాలకు క్లాప్ కొడుతూ యువ మంత్రిగా అందరికీ ఆకర్షిస్తూ ఉండేవారు.

ఆయనతో బంధం అలా :

ఎన్టీఆర్ మద్రాస్ లో బిజీగా సినిమా షూటింగ్ చేస్తున్న రోజులు అవి. అయితే హైదరాబాద్ లో ఆయనకు స్టూడియోతో పాటు సినిమా ధియేటర్లు ఉండేవి. వాటి బాధ్యతలను పెద్ద కుమారుడు జయకృష్ణ చూసేవారు. ఆలా ఆయన సినీ ఎగ్జిబిటర్ గా ఉంటూ తమ శాఖకు చెందిన చంద్రబాబుని సినీ సమస్యల విషయంలో తరచూ కలుస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన బాబుల మధ్య మంచి స్నేహ బంధం తొలినాళ్ళలో ఏర్పడింది. ఇక ఆయన వల్లనే చంద్రబాబు ఎన్టీఆర్ ని అనురాగదేవత అన్న ఒక సినిమా షూటింగులో కలవడం జరిగింది అని చెబుతారు.

బావగారు అంటూ బాబు :

అయితే ఈ విషయం మరోసారి తలచుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మంగళవారం హైదరాబాద్ లో మరణించారు. దీంతో బాబు తన అధికార కార్యక్రమాలను పక్కన పెట్టి మరీ జయక్రిష్ణ ఇంటికి వెళ్ళారు. ఆయనను ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన జయకృష్ణ నందమూరి కుటుంబం నుంచి తనకు తొలి పరిచయం అని చెప్పారు. ఇక తనకు ఎన్టీఆర్ కుటుంబంతో బంధుత్వం కలవడానికి కూడా ఆయన దివంగత పద్మజ చేసిన సాయం చాలా ఉందని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. బావగారూ అంటూ దగ్గరగా తీసుకుని మరీ జయక్రిష్ణను ఓదార్చారు. దీంతో బాబు పెళ్ళినాటి సంగతులు మరోసారి అందరికీ ఆయన నోటి ద్వారా తెలుసుకునే అవకాశం కలిగింది.

రాజకీయాల్లో జయక్రిష్ణ :

ఇక జయక్రిష్ణ ఎక్కువగా ఎగ్జిబిటర్ గానే కనిపించేవారు. అలాగే స్టూడియో వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. అయితే ఆయన కూడా రాజకీయాల వైపు చూశారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కాదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎంపీగా పోటీ చేశారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన శ్రీకాకుళం నుంచి అచ్చెం నాయుడు మీద పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల వైపు చూడలేదు. చిత్రమేంటి అంటే బాబుకు మొదటి స్నేహితుడిగా నందమూరి కుటుంబం నుంచి ఉన్న జయక్రిష్ణ టీడీపీ నుంచి మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. ఏ పదవీ అందుకోలేదు. ఇక ఏడున్నర పదుల వయసులో ఉన్న ఆయనకు ఇపుడు సతీవియోగం అన్నది చాలా కష్టమైనది అని చెప్పాలి. అందుకే మేమంతా మీకు అండగా ఉంటామని దిగులు చెందవద్దు అని ఒకటికి రెండు సార్లు చంద్రబాబు మీడియా ముఖంగానే చెప్పి ఓదార్చారు.

Tags:    

Similar News