ఆటోలో ‘ఆటో డ్రైవర్ల సేవ’కు.. పథకాల ప్రారంభంలో స్టైల్ మార్చిన చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్ మార్చారు. సంక్షేమ పథకాల ప్రారంభంలో విలక్షణంగా వ్యవహరిస్తున్నారు.;

Update: 2025-10-04 06:31 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్ మార్చారు. సంక్షేమ పథకాల ప్రారంభంలో విలక్షణంగా వ్యవహరిస్తున్నారు. తానొక్కడే కాకుండా ప్రతి సారి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను వెంటపెట్టుకుని వెళ్లి పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో ఎప్పుడూ పథకాల ప్రారంభంలో చంద్రబాబు ఒక్కరే కనిపించేవారు. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుపుతున్నందున, మిత్రపక్షాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు ప్రత్యేక వ్యూహంతో కదులుతున్నట్లు చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ వెళుతున్నారు. శనివారం ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం నుంచి ఆటోలో విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు ప్రయాణించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం సమకూర్చింది. కానీ, చంద్రబాబు మాత్రం ఆటోలో ప్రయాణించడానికే మొగ్గు చూపారు.

‘ఆటో డ్రైవర్ సేవలో’ కార్యక్రమం కోసం ఉండవల్లిలో సీఎం నివాసం నుంచి వందలాది ఆటోలతో ర్యాలీగా చంద్రబాబు వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. చంద్రబాబుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చెరో ఆటోలో విజయవాడ సింగ్ నగర్ వరకు వచ్చారు. గతంలో ‘స్త్రీశక్తి’ పథకం ప్రారంభించే సందర్భంలో కూడా సీఎం తన నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. అప్పుడు కూడా ఆయనతో డీసీఎం పవన్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉన్నారు.

ఇక ఉండవిల్లి నుంచి సింగ్ నగర్ కు చేరుకున్న నలుగురు నేతలకు ఆయా ఆటోలు నడిపిన డ్రైవర్లకు చార్జీలు చెల్లించారు. దారిపొడవునా ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని చూసిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరులో చాలా మార్పు వచ్చిందని చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ మాత్రం సీఎం చంద్రబాబు పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తోంది. ఏదిఏమైనా చంద్రబాబు తనతోపాటు కూటమి నేతలకు సమ ప్రాధాన్యం దక్కేలా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుండటం మారిన రాజకీయ వ్యూహానికి నిదర్శనమని అంటున్నారు.

Tags:    

Similar News