గవర్నమెంట్ లోనూ వర్క్ ఫ్రం హోమ్.. చంద్రబాబు కీలక ప్రకటన
ప్రధాని మోదీ సూచనల మేరకు దేశ ప్రజలు అంతా పొదుపు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు వర్క్ ఫ్రం హోంపై ఆసక్తికర ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీ సూచనల మేరకు దేశ ప్రజలు అంతా పొదుపు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు వర్క్ ఫ్రం హోంపై ఆసక్తికర ప్రకటన చేశారు. వర్క్ ఫ్రం హోం అనేది రియాలిటీ. ప్రపంచం మొత్తం ఇంటి నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది. దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల్లోనే తన ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందని వెల్లడించారు. అమరావతిలోని బొల్లినేని మెడికల్ సైన్స్ అండ్ స్కిల్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ చెప్పిన 8 పొదుపు చర్యలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గల్ఫ్ యుద్ధం, చమురు సంక్షోభం నేపథ్యంలో పొదుపు మంత్రాన్ని పాటించాలని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించడంతోపాటు వంట గ్యాస్, వంట నూనెల వినియోగంపై ప్రధాని కీలక సూచనలు చేశారు. బంగారం కొనుగోలు నిర్ణయాన్ని ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. దీనిపై తాజాగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలు అంతా దేశం కోసం బాధ్యత వహించాలని, ప్రధాని పిలుపునిచ్చిన పొదుపు చర్యలను పాటించాలని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తుందని వెల్లడించారు. యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై భారం పడుతోందని సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతోపాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండాలని, తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులు అధిగమించాలని సీఎం సూచించారు. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు.
వర్క్ ఫ్రం హోం సాధ్యమా?
గవర్నమెంటులోనూ వర్క్ ఫ్రం హోం విధానం తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కోవిడ్ ఎఫెక్ట్ తో ఐటీతోపాటు మరికొన్ని రంగాల్లో వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేసిన విషయం తెలిసిందే. ఐటీ సెక్టార్ లో ఇప్పటికీ కొన్ని సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, గత ఏడాది నుంచి కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి చెప్పాయి. అయితే తాజా పరిస్థితులతో రవాణా ఖర్చులు భారంగా మారడంతో మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానంవైపు మళ్లేలా ప్రయత్నాలు మొదలు అయ్యాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా వర్క్ ఫ్రం హోం పాటిస్తుందంటూ సీఎం చంద్రబాబు చేసిన సూచనలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వంలో పలు విభాగాలు ఉండగా, ఏ విభాగాలలో ఈ పద్ధతి ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. దీనిపై రెండు రోజుల్లోనే ప్రకటన చేస్తామని సీఎం చెప్పడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.