జనంతో బాబు నిరంతరం...ఎమ్మెల్యేలు మాత్రం

చంద్రబాబుకు రాజకీయాలు అంటే చాలా నిబద్ధత అంకితభావం అన్నది తెలిసిందే. బాబు ఈ విషయంలో అరుదైన నాయకుడు అని చెప్పాలి.;

Update: 2025-12-04 03:32 GMT

చంద్రబాబుకు రాజకీయాలు అంటే చాలా నిబద్ధత అంకితభావం అన్నది తెలిసిందే. బాబు ఈ విషయంలో అరుదైన నాయకుడు అని చెప్పాలి. చాలా మంది నాయకులు అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అవుతారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అయితే స్పీడ్ పెంచుతారు. కానీ బాబుకు ఆ తేడాపాడాలేమీ లేవు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో కంటే ఎక్కువగా జనంలో ఉంటారు. ఆయన ఏడున్నర పదుల వయసులో కూడా నిరంతం జనంతో అలా అనుసంధానం అవుతూ ఉంటారు. ఆయన కార్యక్రమాలు అన్నీ ప్రజలతో ముడిపడి ఉన్నవే. ప్రతీ పధకాన్ని జనం మధ్యనే ఆయన విడుదల చేస్తున్నారు. అంతే కాదు వివిధ వర్గాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా చేపడుతూ నేరుగా వారి ఇంటికి వెళ్ళి మరీ వారి స్థితిగతులు తెలుసుకోవడం అంటే అది బాబుకే చెల్లు అని చెప్పాల్సి ఉంది.

ఏణ్ణర్ధంగా అదే పని :

బాబు గడచిన ఏణ్ణర్థం కాలంలో చూస్తే కనుక ప్రజలలోనే ఉంటూ వస్తున్నారు. ఆయన ప్రతీ నెలా ఒకటవ తేదీన సామాజిక పెన్షన్ ని పంచుతూ ప్రజలతో ముఖాముఖీ జరుపుతున్నారు. అది ఠంచన్ కార్యక్రమంగా ఉంటోంది. అంతే కాదు ఆయన ప్రజా వేదిక పేరుతో ప్రజలను ఉద్దేశించి ఎన్నో ప్రసంగాలు ఇస్తూ వస్తున్నారు. ఇక ఆయన గ్రౌండ్ లెవెల్ లో ఉండడం ద్వారా మంచి మార్కులే వేయించుకుంటున్నారు. అదే సమయంలో ప్రజల పల్స్ ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తప్పు ఉందో పొరపాటు ఉందో తెలుసుకోవడమే కాకుండా సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు.

డైరెక్ట్ కనెక్షన్ :

ప్రజలతో నేరుగా కనెక్షన్ పెట్టుకున్న నాయకుడిగా బాబు ఉన్నారు. ఆయన ఏపీ మొత్తం అన్ని జిల్లాలను అనేక సార్లు ఇప్పటికే తిరిగారు. ఇంకా పర్యటిస్తూనే ఉన్నారు. అదే విధంగా గ్రామాలకు మండలాలకు సైతం వెళ్ళి మరీ ప్రజలను పలకరిస్తున్నారు. వివిధ వర్గాలతో మమేకం అవుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురించి బాబు చక్కగా వివరిస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వారికి తెలియచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు కార్యక్రమాలు ఉన్నా వాటిని కూడా జనంలో పెట్టి చర్చిస్తున్నారు.

రైతులతో ముఖాముఖీ :

ఇక తాజాగా చంద్రబాబు రైతన్న మీ కోసం పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం గోదావరి జిల్లాలో పర్యటించి వారికి ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో స్వయంగా వివరిస్తున్నారు. వారికి ప్రవేశపెడుతున్న పధకాలు అలాగే వారికి అందిస్తున్న సంక్షేమాన్ని గురించి కూడా తెలియచేస్తున్నారు. వారి సమస్యలను ఫిర్యాదులను స్వయంగా తెలుసుకుంటూ ప్రభుత్వం వారికి భవిష్యత్తులో ఏమి చేయనుందో కూడా స్పష్టంగా చెబుతున్నారు.

సూపర్ హిట్ అంటూ :

కూటమి పార్టీలు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చామని బాబు సభలలో చెబుతున్నారు సూపర్ హిట్ గా అవి అమలు అవుతున్న తీరుని కూడా చెబుతున్నారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి కూడా బాబు వివరిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సుని స్త్రీ శక్తి పేరుతో అమలు చేస్తున్న విధానం గురించి కూడా చెబుతున్నారు.

ప్రభుత్వానికి మైలేజ్ :

వరసబెట్టి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రజలలో ఉంటే కనుక ప్రభుత్వానికి పాజిటివిటీ పెరుగుతుందని మైలేజ్ కూడా దక్కుతుందని బాబు భావిస్తున్నారు. అంతే కాదు ప్రతీ జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారు అన్నది కూడా ఆయన తెలుసుకుంటున్నారు. ఆలాగే ప్రజలలోకి ఎంత మంది వెళ్తున్నారు ఎవరేమిటి అన్న డేటాను కూడా బాబు రెడీ చేస్తున్నారు అని అంటున్నారు.

అతి పెద్ద సెక్షన్ గా :

రైతులు అతి పెద్ద సెక్షన్ గా ఏపీలో ఉన్నారు. మొత్తం 66 లక్షలుగా రైతులు ఉంటే వారి కుటుంబాలతో కలుపుకుని రెండున్నర కోట్ల దాకా ఉంటారు. దాంతో రైతుల కోసం ప్రభుత్వం అన్నట్లుగా బాబు కార్యక్రమాలను తీసుకుని వెళ్తున్నారు. రైతన్న మీ కోసం కార్యక్రమం కూడా అందులో భాగానే. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులు అంతా పాల్గొనాలని బాబు కోరుతూ పది రోజుల పాటు నిర్వహించేలా డిజైన్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో కనీసంగా ముప్పయి మంది ఎమ్మెల్యేలు కూడా పాలు పంచుకోలేదని పార్టీకి అందిన సమాచారంగా చెబుతున్నారు. దాంతో ఇదే విషయం మీద బాబు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ప్రజలతోనే ఉండాలని ఆయన ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా గట్టిగానే చెబుతున్నారు. మరి మరోసారి దీని మీద పార్టీ దిశా నిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News