చంద్రబాబుకు కొత్త తలనొప్పి.. అనుకున్నవి జరగవా?

తాను చూసిన ఎత్తుపల్లాలతో తనకున్న పరిధి..బలాన్ని చంద్రబాబు అర్థం చేసుకోవటంతో పాటు.. మోడీ విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం మొదలుపెట్టారు.

Update: 2026-06-10 06:30 GMT

హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి.. ఆ సమయంలో తమ పార్టీ సొంత బలం తగ్గటం.. గతానికి భిన్నంగా మిత్రుల మీద ఆధారపడాల్సి రావటం తెలిసిందే. అయితే.. తమకు లభించిన అవకాశాన్ని మిత్రపక్షాలు తమకు అడ్వాంటేజ్ గా తీసుకోలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంత బలం పడిపోయి.. మిత్రులైన టీడీపీతో పాటు మరికొందరి బలం అవసరపడింది. ఆ సమయంలో జాతీయ మీడియా చంద్రబాబు చేతిలోనే అంతా ఉందని.. ఆయన మోడీ సర్కారును ప్రభావం చూపగలుగుతారన్న విశ్లేషణలు చేశారు.

సాధారణంగా ఇలాంటి విశ్లేషణలను పరిగణలోకి తీసుకోవటంతో పాటు.. తలకు ఎక్కించుకునే గుణం చంద్రబాబులో కాస్త ఉంటుంది. కానీ..ఆ ఎన్నికలకు ముందు ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనంత సంక్షోభాన్ని.. ప్రతికూలతల్ని ఎదుర్కోవటంతో పాటు.. చివరకు జైలుకు వెళ్లాల్సి రావటం తెలిసిందే. బలమైన ఆధారాలు లేకుండా.. ఒక వాదనతో జైలుపాలు కావటం.. బెయిల్ కోసం ఆయన పడిన పాట్లు అన్ని ఇన్ని కావు.

ఈ ఎదురుదెబ్బల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అపూర్వ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబుకు.. కేంద్రంలోనూ కీలకభూమిక పోషించే వీలు కలిగింది. అయితే.. ఆ అంశానికి చంద్రబాబు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. తన పరిధిలోనే నడుచుకోవటం కనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే 2014 సీన్ గుర్తుకు తెచ్చుకుంటే.. మారిన చంద్రబాబు ఇట్టే అర్థమవుతారు. 2014 సార్వత్రిక ఎన్నికల వేళలో.. ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన చంద్రబాబు.. ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి.. ప్రధానిగా మోడీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన వేళలో.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోలేం.

వారంలో రెండు రోజులు ఢిల్లీలో ఉంటానని.. జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేయాలన్న భావన ఆయనలో ఉండేది. దేశ ప్రధానిగా మోడీ కొత్త కావటం.. గతంలో కేంద్రంలోని ప్రభుత్వాలతో కలిసి పని చేసిన తన అనుభవం మోడీకి అవసరమన్న విషయాన్ని ఆయన తన మాటలతో చెప్పకనే చెప్పేసేవారు. అయితే.. ఇలాంటి తీరును మొగ్గలోనే తుంచేసిన మోడీ..చంద్రబాబును దూరంగా పెట్టటమే కాదు.. ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిందంతా తెలిసిందే. మోడీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ తో కలవటం.. దారుణ పరాజయాన్ని సొంతం చేసుకోవటం.. తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని.. చివరకు పవన్ కల్యాణ్ తో జత కట్టి.. ఎన్డీయే కూటమిలో చేరటం తెలిసిందే.

తాను చూసిన ఎత్తుపల్లాలతో తనకున్న పరిధి..బలాన్ని చంద్రబాబు అర్థం చేసుకోవటంతో పాటు.. మోడీ విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం మొదలుపెట్టారు. మోడీకి తిరుగులేదన్నట్లుగా చెప్పటమే కాదు.. మోడీ అధిక్యతను సంపూర్ణంగా గుర్తించేందుకు వెనుకాడని తత్త్వం చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయినప్పటికి.. ఏపీకి సంబంధించిన అంశాలకు కేంద్ర సహాయ సహకారాలను కోరటం.. అది కూడా డిమాండ్ గా కాకుండా స్నేహపూర్వకంగా.. రిక్వెస్టింగ్ గా అడగటం ద్వారా అనుకున్నది సాధించుకుంటున్న తీరును చంద్రబాబు ప్రదర్శించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్.. డీఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు ఎన్డీయే కూటమికి తమ మద్దతు ఇచ్చేందుకు ఆసక్తిని ప్రదర్శించటం తెలిసిందే. బెంగాల్ లో విపక్ష టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు తమను ప్రత్యేక సమూహంగా గుర్తించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. నిబంధనల ప్రకారం చూసినా.. టీఎంసీ చీలిక పక్షానికి గుర్తు లభిస్తుంది. దీంతో.. ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీయేకు ఉన్న 293 మంది ఎంపీలకు అదనంగా 20 మంది టీఎంసీ చీలిక వర్గం మద్దతు లభించినట్లు అవుతుంది. దీంతో.. ఎన్డీయే బలం 313కు చేరుతుంది. మొత్తం 543 స్థానాలున్న లోక్ సభలో 313 సభ్యుల బలం.. ఎన్డీయే కూటమికి అదనపు శక్తిని ఇస్తుందని చెప్పాలి.

ఇది సరిపోదన్నట్లుగా డీఎంకేకు చెందిన ఎంపీలు సైతం ఎన్డీయేకు మద్దతు ఇచ్చే అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. లోక్ సభలో ఎన్డీయే బలం మరింత పెరుగుతోందని చెప్పాలి. ఈ పరిణామాలు చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతుందా? ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యత తగ్గుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. మారిన మైండ్ సెట్ తో తన పరిధిలోనే ఉంటున్న చంద్రబాబు తీరుతో మోడీ ఎలాంటి అసౌకర్యానికి గురి కావట్లేదంటున్నారు. ఒకవేళ తన బలం మోడీకి అవసరమైన వేళలో.. చంద్రబాబు తన పాత మేజిక్ లు ప్రదర్శించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని.. కానీ మారిన చంద్రబాబు విషయంలో మోడీ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఎన్డీయేకు వచ్చే కొత్త బలంతో చంద్రబాబుకు ఎలాంటి సమస్యలు ఉండవనే వాదన బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News