న‌మ‌స్కారం.. నేను మీ చంద్ర‌బాబు!

''న‌మ‌స్కారం.. నేను మీ చంద్ర‌బాబు!'' అంటూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ రాశారు.;

Update: 2026-04-14 09:49 GMT

''న‌మ‌స్కారం.. నేను మీ చంద్ర‌బాబు!'' అంటూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ రాశారు. ఈ లేఖ‌ను పార్టీల‌కు అతీతంగా అంద‌రికీ పంపించారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల‌కు ఆయ‌న ఈ లేఖ రాయ‌డం విశేషం. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కీ.. ఈ లేఖ సారాంశం.. మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’‌కు సంబంధించే కావ‌డం గ‌మ‌నార్హం.

ఏంటా లేఖ‌..

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఈ నెల 16-18 వ‌రకు ప్ర‌త్యేకంగా భేటీ కానున్నాయి. ఈ భేటీలో ఇత‌ర అంశా లేవీ ఉండ‌వు. కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ అంశ‌మే ఉంటాయి. ఈ రెండు అంశాల‌కు పార్టీల‌కు అతీతంగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే విన్న‌వించింది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీల‌కు.. సీఎం చంద్ర‌బాబు తాజాగా లేఖ రాశారు. దీనిని జనసేన అధ్యక్షుడు కె పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావుకు ముఖ్యమంత్రి లేఖను పంపారు.

లేఖ‌లో ముఖ్యాంశాలు..

+ 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’‌ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలి.

+ మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని బలపరుద్దాం. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టం.

+ ‘నారీ శక్తీ వందన్ అధినియం’ మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుంది. ప్రభుత్వం

లో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుంది.

+ భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదాం.

+ మహిళా రిజర్వేషన్ అమ‌లుకు బాట‌లువేసే ‘నారీ శక్తి వందన్ అధినియం’ స‌వ‌ర‌ణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల‌ ముందుకు రానుండ‌టంతో దశాబ్దాల కల నిజం అవుతోంది. భారత ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలిచేలా, సమానత్వం సాధించేందుకు ఇది గొప్ప ముందడుగు.

+ "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" ఎక్కడ మహిళలను గౌరవిస్తారో...అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన భారతీయ ధర్మం చెబుతోంది. దీనికి నిదర్శనమే ‘నారీ శక్తి వందన్ అధినియం’. చట్ట సభల్లో మన ఆడబిడ్డలకు 33 శాతం రిజర్వేషన్లు 2029 నుంచే అమల్లోకి వచ్చేలా చట్ట సవరణకు కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం ఒక గొప్ప ఆలోచనగా నేను భావిస్తున్నాను.

+ ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా చట్టసభల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించడం ప్రతీ భారతీయుడు గర్వించే సందర్భం. మహిళా సాధికారత దిశగా మనం చేస్తున్న ఆలోచనలు సాకారం అవుతుండటం అభినందనీయం.

‘నారీ శక్తీ వందన్ అధినియం’ సవరణకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున, మహిళామూర్తుల తరపున ప్ర‌ధాని మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు.

+ ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని మొదటి నుంచీ నేను బలంగా నమ్ముతాను. మహిళలకు సముచిత స్థానంతోనే సమాజ అభివృద్ధి. రాష్ట్ర, దేశ పురోగతిలో మహిళలు కీలక పాత్ర పోషించాలన్నది నా అభిప్రాయం.

+ పార్లమెంట్‌తో పాటు రాష్ట్ర విధాన సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై దశాబ్దాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెడితే ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఒకే తాటిపైకి వచ్చి మద్దతు పలికారు. ఆ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నేను భావిస్తున్నాను.

+ 2029లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు కావాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షకు మనందరం మద్దతు పలుకుదాం.

Tags:    

Similar News