అదరగొట్టిన ఆర్థిక మంత్రి కేశవ్.. మిగిలిన మంత్రులు ఫాలో కావాలంటున్న సీఎం
కూటమి మంత్రులు ఎలా ఉండాలి? ఏం చేయాలనే విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ సూచనలు, సలహాలిస్తుంటారు.;
కూటమి మంత్రులు ఎలా ఉండాలి? ఏం చేయాలనే విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ సూచనలు, సలహాలిస్తుంటారు. అదే సమయంలో తన అంచనాలకు తగ్గట్టు పనిచేస్తున్నారా? లేదా? అనేది కూడా తరచూ తెలుసుకుంటుంటారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మంత్రుల పనితీరు, నడవడికపై తరచూ సమీక్షలు నిర్వహిస్తుంటుంది. మంత్రులే కాదు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు అంతా ప్రజాభిమానాన్ని చూరగొనేలా నడుకుకోవాలని చంద్రబాబు ఆకాంక్షిస్తుంటారు. తన మనసుకు నచ్చినట్లు పనిచేసిన వారిని ప్రత్యేకంగా అభిమానిస్తారు సీఎం చంద్రబాబు. అయితే ఇలా చంద్రబాబు అభిమానం, అభినందనలు లభించేవి ఏ కొద్ది మందికి మాత్రమే అని చెబుతారు.
ఏపీకి నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. ఈ సారి కేబినెట్లో ఎక్కువ మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. దీంతో చంద్రబాబు పాలనలో ఎలా నడుచుకోవాలనేది చాలా మందికి తొలి రోజుల్లో అర్థం కాలేదు. ఫలితంగా ఎప్పటికప్పుడు చంద్రబాబుతో క్లాసులు తీసుకునేవారు. గతంలో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి మూడు దఫాలలో సీనియర్లు ఉండటం వల్ల ఇలాంటి సమస్య ఎక్కువగా ఉండేది కాదు. కానీ, ఇప్పుడున్న కేబినెట్లో తొలిసారి మంత్రులు ఎక్కువ ఉండటం వల్ల తొలిరోజుల్లో పాలనపై కొంత పట్టు సాధించకలేక తడబాటుకు లోనయ్యారని అంటున్నారు. అయితే చంద్రబాబు మార్గనిర్దేశంలో ప్రస్తుతం మంత్రుల పనితీరు మెరుగుపడిందని, దీనికి ఆయా శాఖల్లో వేగవంతమైన ఫైళ్ల క్లియరెన్స్ ను ఉదాహరణగా చూపుతున్నారు.
సీఎం చంద్రబాబు కోరుకున్నట్లు మంత్రులు పనితీరులో వేగం పుంజుకున్నా.. ఇంకా కొంత మార్చుకోవాలని సూచనలు వస్తున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి తన కార్యాలయానికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారని టాక్ నడుస్తోంది. కేబినెట్ లో ఉన్న 24 మంది మంత్రుల్లో ఉప ముఖ్యమంత్రి పవన్, ఐటీ మంత్రి లోకేశ్ మినహా మిగిలిన వారు రోజువారి కార్యక్రమాలపై సీఎంవోకు నోట్ సమర్పించాలని తాజాగా ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. చాలా మంది మంత్రులు పాలన అంటే కేవలం ఫైళ్ల క్లియరెన్స్ కి మాత్రమే పరిమితం అవుతున్నారని, ఇతరత్రా రాజకీయ సవాళ్లను అధిగమించలేకపోతున్నారని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకర్షించిందని, మిగిలిన మంత్రులు కూడా ప్రజా సమస్యలపై కేశవ్ మాదిరిగా స్పందిస్తే బాగుంటుందని తన కార్యాలయం ద్వారా మంత్రులకు సమాచారం పంపినట్లు చెబుతున్నారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం ఉరవకొండలో పర్యటించిన ఆర్థిక మంత్రి కేశవ్ పొలాల్లో పనిచేస్తున్న రైతు కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. మార్గమధ్యలో కారు దిగి మహిళా కూలీల దగ్గరకు వెళ్లిన ఆర్థిక మంత్రి కేశవ్ మహిళలతో కలుపుగోలుగా మాట్లాడటం ప్రత్యేకంగా నిలిచినట్లు చెబుతున్నారు. దీనిపై మీడియాలోనూ సానుకూల కథనాలు రావడంపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసిందని అంటున్నారు. ఇలా మిగిలిన మంత్రులు కూడా పాలనకే పరిమితం కాకుండా ప్రజలతో మమేకమయ్యేలా ప్రత్యేక కార్యక్రమాలతో ఆకట్టకోవాలని సీఎం భావిస్తున్నారు. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయంలో తొలి నుంచి అగ్రస్థానంలో ఉన్నారని, కేశవ్ వంటివారు ఇప్పుడిప్పుడు ఇలాంటి ధోరణి అలవాటు చేసుకోవడం వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.