గడప గడపకు బాబు 'విజన్' ఏం చేస్తున్నారంటే!
ఏపీ సీఎం చంద్రబాబు.. తన విజన్‌ను ఇక నుంచి గడప గడపకు చేరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.;
ఏపీ సీఎం చంద్రబాబు.. తన విజన్‌ను ఇక నుంచి గడప గడపకు చేరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమాచారం చేరువ చేయడంతోపాటు.. పాలన ఫలాలను వారికి మరింత దగ్గరగా అందించేందుకు కార్యాచరణకు రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీజీ ఎస్ కేంద్రా లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి డిసెంబరు 15 నాటికి అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీజీఎస్ కేంద్రం ఉంది. ఇప్పుడు ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక ఆర్టీజీఎస్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా.. ప్రజలకు మరింత చేరువ కావాలన్నది బాబు వ్యూహం. ముఖ్యంగా పాలనా సంస్కరణలు.. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. సమస్యలు-పరిష్కారాలపై మరింతగా దృష్టిపెట్టనున్నారు. ఏదైనా సమస్య ప్రజల నుంచి వస్తే.. దానిని కొన్ని గంటల్లోనే పరిష్కరించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది.
అదేవిధంగా ప్రజలకు అన్ని మార్గాల్లోను సేవలు చేరువ చేసేలా మంత్రులు, కలెక్టర్లు ఎమ్మెల్యేల భాగస్వా మ్యాన్ని పెంచనున్నారు. ముఖ్యంగా ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరగడం.. అధికారులను వేడుకోవడం.. తమ సమస్యలు విన్నవించడం అనే మూస ధోరణికి దాదాపు చెక్ పెట్టనున్నారు. ప్రజలు ఎక్కడ నుంచి అయినా.. తమ ఫోన్ల ద్వారా సమస్యలు వెల్లడించే వెసులుబాటు కల్పిస్తారు. ఇవి.. లోకల్‌గా ఉన్న ఆర్టీజీఎస్‌కు చేరువ అవుతాయి. అనంతరం.. అవి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు చేరుతాయి.
తద్వారా ప్రజలకు మరింత సంతృప్తి ఇచ్చేలా సేవలు చేరువ చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అదేసమయంలో ఆర్టీజీ కేంద్రాల్లో ఏఐని ఏర్పాటు చేయనున్నారు. తద్వారా.. సమస్యల పరిష్కారంపై మరింత పారదర్శకత ఏర్పడనుంది. అలాగే.. సంక్షేమ పథకాలు.. లబ్ధిదారుల వివరాలను కూడా ప్రజ లకు అందుబాటులో ఉంచనున్నారు. ఇలా.. ఇక నుంచి గడపగడపకు కూడా.. సేవలను అందుబాటులోకి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే.. కార్యాలయాలకు ప్రజలు రావడం తగ్గుముఖం పడుతుందన్న అంచనా వేస్తున్నారు.