బిజినెస్ రూల్స్ మారుద్దాం: చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి సంబంధించిన బిజినెస్ రూల్స్‌(ప్ర‌భుత్వం ఎలా ప‌నిచేయాల‌న్న విష‌యంపై నిర్దేశించుకున్న నియ‌మాలు) మార్చేద్దా మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.;

Update: 2025-12-11 04:24 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి సంబంధించిన బిజినెస్ రూల్స్‌(ప్ర‌భుత్వం ఎలా ప‌నిచేయాల‌న్న విష‌యంపై నిర్దేశించుకున్న నియ‌మాలు) మార్చేద్దా మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ''దేశం మొత్తానికీ వ‌ర్తించే రాజ్యాంగాన్నే మారుస్తున్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన బిజినెస్ రూల్స్‌ను మార్చ‌లేమా?'' అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

తాజాగా మంత్రులు, హెచ్‌వోడీలు, వివిధ శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌తో నిర్వ‌హించిన స‌ద‌స్సులో సీఎం ప్ర‌సం గించారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు బిజినెస్ రూల్స్‌ను మార్చడంలో తప్పులేద‌ని పేర్కొన్నారు. ఏ ప్ర‌భుత్వ‌మైనా ఉన్న‌ది ప్ర‌జ‌ల‌కోస‌మేన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేద్దామ‌ని అన్నారు. దీనికి సంబంధించి న క‌స‌ర‌త్తును తానే స్వ‌యంగా ప్రారంభిస్తాన‌న్నారు.

ఏం చేస్తారు?

+ బిజినెస్ రూల్స్‌లో భాగంగా.. అధికారుల‌కు మ‌రిన్ని అధికారాలు క‌ల్పిస్తారు.

+ ఫైళ్ల క్లియ‌రెన్సును నిర్దేశిత స‌మ‌యం విధిస్తారు. వేగం పెంచుతారు.

+ పాల‌న‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంలో భాగంగా అన్ని విభాగాల్లోనూ ఐటీ విప్ల‌వానికి పునాది వేస్తారు.

+ అనవసర నిబంధనలను తొలగిస్తారు.

+ టెక్నాలజీ, డేటాలేక్ వంటి ఆధునిక విధానాలను అమ‌లు చేస్తారు.

+ ప్ర‌తి శాఖ‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆడిటింగ్ విధానంలోకి తీసుకువ‌స్తారు.

+ శాఖల‌ పనితీరుపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌నుంది.

+ ప్రజలకు జవాబుదారీగా ఉండే విధానాల‌ను తీసుకువ‌స్తున్నారు.

దేశంలో తొలిసారా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు చెబుతున్న బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేయ‌డం ఇదే తొలిసారా? అంటే.. కాదు. ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 2018లోనే ఈ త‌ర‌హా మార్పులు తీసుకువ‌చ్చారు. అయితే.. ఇవి న్యాయ ప‌రీక్ష‌కు నిల‌వలేదు. దీంతో అల‌హాబాద్ హైకోర్టు సూచ‌న‌లు, హెచ్చ‌రిక‌ల‌ను అనుస‌రించి.. కొన్ని మార్పులు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. శాంతి భ‌ద్ర‌త‌లు(ఎవ‌రి ఇంట్లో అయినా ఎలాంటి పిటిష‌న్‌, వారెంటు లేకుండా సెర్చ్ చేసుకునే నిబంధ‌న‌), రెవెన్యూ(ఎవ‌రి భూమినైనా ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకునే) విష‌యాల్లో తీసుకువ‌చ్చిన మార్పుల‌ను కోర్టు కొట్టి వేసింది.

Tags:    

Similar News