పెట్టుబడుల 'ప్రచారం' బెడిసికొడుతోందా..!
ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులకు ప్రధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.;
ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులకు ప్రధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. అయితే, అతిగా స్పందించడం, అతిగా వ్యాఖ్యానించటం అనేది వ్యక్తిగతంగానే కాదు.. రాజకీయాల్లో కూడా పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే ప్రమాదాన్ని తెచ్చింది అనేది పార్టీ నాయకులు చెబుతున్నారు. పెట్టుబడులు తీసుకురావడం ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఉద్యోగ ఉపాధి కల్పన జరిగి తీరాల్సిందే దీనిని కూడా ఎవరూ కాదనరు.
కానీ, పెట్టుబడుల కోసమే అన్నట్టుగా ప్రభుత్వం పనిచేయడం, ప్రజలకు సెంటు భూమి కూడా ఇవ్వకుండా ప్రైవేటు సంస్థలకు ఎకరాలకు ఎకరాల స్థలాలను రూపాయికి, అర్ధ రూపాయికి కేటాయించటం వంటివి బెడిసికొడుతున్నాయి. ఇవి చంద్రబాబే ప్రచారం చేసుకున్నారు. నిజానికి ఈ ప్రచారం వైసిపి చేసి ఉంటే అది వేరేగా ఉండేది. కానీ, స్వయంగా ఎక్కడ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు స్వయంగా ఫలానా కంపెనీకి 99 పైసలకే ఎకరా భూమి ఇచ్చామని, మరో కంపెనీకి అర్ధ రూపాయికి ఇచ్చామని చెప్పుకొచ్చారు.
పోనీ ఆయా కంపెనీలు ఇప్పట్లో వస్తున్నాయా అంటే ఇప్పట్లో రావడం లేదు. పైగా పచ్చని పొలాలను తీసుకుని రైతులకు ఎటువంటి పరిహారం ప్రకటించకుండానే వాటిని ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి, నెల్లూరు, కడప తదితర జిల్లాల్లో పెట్టుబడుల పేరుతో ప్రైవేట్ కంపెనీలకు వందలాది ఎకరాలను అప్పగిస్తుండడం పట్ల చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిగో దీనివల్ల ఉపాధి కలుగుతుందని, ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో దీనిపై జరుగుతున్న చర్చ చిత్రంగాను ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఉండడం విశేషం.
దీనిని వైసీపీ పెంచి పోషిస్తోందని అనుకుంటే పొరపాటు. పేపర్లలో వస్తున్న వార్తలు, అదేవిధంగా మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు పరిగణలోకి తీసుకొని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంటే పెట్టుబడిదారులకు అనుకూలంగా మారింది అనే వాదన బలపడే దిశగా వ్యవహారం నడుస్తోంది. మరోవైపు వైసీపీ హయంలో పేదలకు సెంటు నుంచి సెంటున్నర వరకు భూములను కేటాయించారు. కొన్నిచోట్ల జగనన్న ఇళ్ల కాలనీలను కూడా కట్టారు. అయితే, కట్టిన వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కట్టనివి ఎక్కువగా సంఖ్యలో ఉన్నాయి.
నాలుగు లక్షల మందికి ఇళ్లను, ఇళ్ల స్థలాలను వైసిపి ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు వాటిలో రెండు లక్షల పైచిలుకు ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జీవో జారీ చేయడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. దీనిని ఎంత తొక్కి పెట్టాలని అనుకున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జగనన్న ఇల్లు కింద కేటాయించిన స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇది జిల్లాల స్థాయిలో అదే విధంగా గ్రామీణ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రభుత్వం పై విమర్శలు వచ్చేలా చేస్తోంది.
పెట్టుబడిదారులకు వేలాది ఎకరాలను, వందలాది ఎకరాలను అర్ధ రూపాయికి, రూపాయికి ఇస్తున్న ప్రభుత్వం తమకు జగన్ ఇచ్చిన స్థలాన్ని కూడా ఉంచడం లేదని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. అంటే, ఒక రకంగా తాను చేసుకుంటున్న ప్రచారం తనకే వివాదంగా మారే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నది కనిపిస్తోంది. దీనిని గత వారంలోనే ప్రభుత్వం గుర్తించింది. ప్రజల్లో పెట్టుబడులపై ఆసక్తి ఒకప్పుడు ఉండేదని, కానీ ఇటీవల కాలంలో కేటాయిస్తున్న భూములు, ఇస్తున్న సౌకర్యాలు వంటివి తీవ్ర వివాదంగా మారి పేదలకు ఏమీ చేయకుండా పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున దోచుపెడుతున్నారన్న వాదన బలపడుతోందని ప్రభుత్వానికి సమాచారం అందింది.
దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు శనివారం మాచర్లలో పర్యటించినప్పుడు పెట్టుబడుల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా పేదల విషయాన్ని. పేదల ఆరోగ్యం విషయాన్ని ఆయన చర్చించారు. త్వరలోనే సంజీవని వంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే మొదట్లో చేసిన ప్రచారం నుంచి ఇప్పట్లో అయితే తప్పించుకునే పరిస్థితి లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఏది ఏమైనా అతిగా ప్రచారం చేసుకోవడం ఎవరికీ మంచిది కాదని కూడా అంటున్నారు.
గతంలో వైసిపి అధినేత జగన్.. సంక్షేమ పథకాలకు తానే కేరాఫ్ అని అతిగా ప్రచారం చేసుకుని బుట్టలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు పెట్టుబడిదారులకు.. పెట్టుబడులకు తానే కేరాఫ్ అని చెప్పుకొని ప్రజల్లో వ్యతిరేక ప్రచారానికి దారి తీసేలాగా చేసుకున్నారనేది విశ్లేషకులు చెబుతున్న మాట.