అటు క్లాస్.. ఇటు మాస్.. చంద్రబాబు డబుల్ యాక్షన్

ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో కాఫీ మీటింగులకు హాజరవుతున్న చంద్రబాబు.. మరోవైపు గ్రామాల్లో పర్యటిస్తూ పేద, మధ్య తరగతి ఇళ్లలో స్వయంగా కాఫీ, టీ కలుపుతూ వారిలో ఒకరిగా నడుస్తున్నారు.;

Update: 2025-07-02 08:35 GMT

ఏపీ సీఎం చంద్రబాబు స్టైల్ మార్చారు. ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో కాఫీ మీటింగులకు హాజరవుతున్న చంద్రబాబు.. మరోవైపు గ్రామాల్లో పర్యటిస్తూ పేద, మధ్య తరగతి ఇళ్లలో స్వయంగా కాఫీ, టీ కలుపుతూ వారిలో ఒకరిగా నడుస్తున్నారు. గతంలో ఎక్కువగా క్లాస్ లీడర్ గా ఇమేజ్ కోసం పరితపించిన ఆయన ఇప్పుడు మాస్ లీడర్ ముద్ర కోసం అడుగులు వేస్తున్నారని అంటున్నారు. తన 4.O సర్కారులో 95 సీఎం ను చూస్తారని గతంలో చెప్పిన చంద్రబాబు.. అదే తరహాలో ప్రజల్లోకి వెళుతున్నా ఈ సారి కాస్త డిఫరెంట్ లుక్కులో కనిపిస్తుండటమే పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది.

ఎప్పుడూ ఐటీ అంటూ టెక్నాలజీ వెంట పరుగులు తీసిన చంద్రబాబు ప్రస్తుతం రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు. ఏఐ, డీప్ టెక్ అంటూ ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తూనే పేదలు, మధ్య తరగతి సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు సంకేతాలు పంపుతున్నారు. ప్రతి నెలా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు తన టూర్ బోరు కొట్టకుండా ఉండేలా సరికొత్త ప్రణాళిక అమలు చేస్తున్నారు.

జులై నెలలో పింఛన్లు పంపిణీ చేయడానికి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు మార్గ మధ్యలో ఓ కిరాణా షాపు వద్ద తన కాన్వాయ్ ని ఆపి ఆ దుకాణ దారుతో ముచ్చటించారు. వ్యాపారం ఎలా సాగుతున్నది అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులతో సెల్ఫీ తీసుకోవడమే కాకుండా, అక్కడే ఉన్న ఓ చర్మకారుడుని తన పక్కసీట్లో కూర్చొబెట్టుకుని సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణించారు.

ఆ తర్వాత ఆ చర్మకారుడి ఇంటికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశారు. 2024 జూన్ లో అధికారంలోకి వచ్చిన నుంచి ప్రతి నెలా 1వ తేదీన చంద్రబాబు ఇలా పింఛన్లు అందజేస్తూనే ఉన్నారు. అయితే గతంలో ఆయన ఏ ఇంటికి వెళ్లినా వారి కష్టసుఖాలు తెలుసుకోవడం, వారెంట్లో కాఫీ, టీ తాగుతూ తాను సామాన్యుడినే అన్న సంకేతాలిచ్చేందుకు ప్రాధాన్యమిచ్చేవారంటున్నారు.

సుమారు 45 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న చంద్రబాబులో గతంలో ఎప్పుడూ ఈ యాంగిల్ చూడలేదని అంటున్నారు. 1995లో తొలిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు దాదాపు 16 ఏళ్లు సీఎంగా పనిచేశారు. 1995-99 మధ్య దాదాపు తొమ్మిదిన్నరేళ్లు ఏకధాటిగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఆ సమయంలో ఎక్కువగా కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించేవారు. పారిశ్రామిక పెట్టుబడులు వస్తే రాష్ట్రం అభివృద్ధి పథాన నడుస్తుందని నమ్మిన చంద్రబాబు ఐటీ రంగానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. అదే సమయంలో పట్టణాలు, నగరాల అభివృద్ధి చర్యలు తీసుకునేవారు. ఆయన విధానాలను విమర్శించేందుకు వ్యవసాయంపై అప్పట్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు బాగా ఉపయోగించుకునేవి.

ఇలా మోడరన్ సీఎంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా పట్టణ మధ్యతరగతి బాగా దగ్గరయ్యారు చంద్రబాబు. అదే సమయంలో గ్రామీణ పేదలకు దూరమయ్యారు. దీంతో పలుమార్లు ఎన్నికల్లో చంద్రబాబుతోపాటు టీడీపీ ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సివచ్చిందని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈ సారి చంద్రబాబు అటు క్లాస్ లీడర్ గానే కాకుండా, మాస్ ఇమేజ్ తెచ్చుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా పేదలు, మధ్య తరగతి వారికి దగ్గరయ్యేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వాటి ప్రచారానికి తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

సాదాసీదా పర్యటనలతో ప్రతి నెలా పేదలతో మమేకయ్యేలా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు బిల్ గేట్స్, టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ వంటివారిని కలుస్తూనే రోజు కూలీలతోనూ సమావేశమై వారి సాదక బాధలు తెలుసుకుంటూ తన రూటు మారిందని తెలియజేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News