క్యాన్సర్ పై యుద్ధం.. తప్పనిసరిగా మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్
చంద్రబాబు ప్రజారోగ్యంపై ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ రోగులు పెరిగిపోతుండటంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.;
చంద్రబాబు ప్రజారోగ్యంపై ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ రోగులు పెరిగిపోతుండటంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వ్యాధి ముదిరిన తర్వాతే గుర్తించడం వల్ల ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు కేన్సర్ స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి వైద్య పరీక్షలు చేయనున్నారు.
సీఎం చంద్రబాబు సూచనల మేరకు ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లను చేపడతారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ‘మహిళలకు ప్రత్యేక క్యాన్సర్ పరీక్షకు ఆహ్వానం’ పేరుతో ఇన్విటేషన్ కార్డును ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ కార్డులను వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ఇవ్వనున్నారు.
సీఎం సూచనలతో విజయవాడలో క్యాన్సరుపై అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. 3వ విడత ఎన్సీడీ స్క్రీనింగ్ లో ఎదురైన అనుభవాలు, సవాళ్లను పరిశీలించిన అనంతరం 4వ విడతలో ప్రత్యేకించి క్యాన్సర్ స్క్రీనింగ్ పై దృష్టి పెట్టనున్నారు. 4వ విడత ఎన్సీడీ స్క్రీనింగ్ పై అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచారాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్(ఐఇసి) కార్యక్రమం కింద పోస్టర్లు, కరపత్రాల్ని ప్రచురించనుంది.
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ అసంక్రమిక వ్యాధులైన రక్తపోటు (బీపీ), మధుమేహం (బ్లడ్ షుగర్) పరీక్షల్ని ఉచితంగా చేస్తారు. ప్రత్యేకంగా మహిళలకు రొమ్ము , గర్భాశయ ముఖ ద్వార పరీక్షలకు సంబంధించి అవగాహన కల్పించి, స్క్రీనింగ్ చేసి, సమీప వైద్యాధికారికి సమాచారాన్ని అందిస్తారు. నిర్దిష్ట సమయాల్లో వైద్యాధికారి వీరికి అవసరమైన పరీక్షలు చేసి, లక్షణాలుంటే ఆయా జిల్లాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో (జీజీహెచ్) ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్లలో స్పెషలిస్ట్ డాక్టర్లతో చికిత్స చేయిస్తారు.
క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ విభాగాలకు చెందిన దాదాపు 20,000 మందికి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చింది. గతంలో బీపీ, మధుమేహం, ఎనీమియాతోపాటు క్యాన్సర్‌కు సంబంధించి 18 ఏళ్లు దాటిన (జనాభాలో 70 శాతం) వారిని స్క్రీనింగ్ చేయగా, 2 లక్షల అనుమానిత కేసులు బయటపడ్డాయి. వీరిలో 4,500 మందిని జీజీహెచ్‌లలోని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్లకు పంపించారు. 783 మందికి క్యాన్సర్ చికిత్స అవసరమని గుర్తించారు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ కచ్చితంగా క్యాన్సర్ నుండి వ్యాధి నుంచి బయటపడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పుల్ని తీసుకురావడం ద్వారా క్యాన్సర్ ను ఎదుర్కొవచ్చని ప్రజలకు పిలుపునిస్తోంది.
30 ఏళ్లు దాటిన మహిళలందరూ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలి
గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్(సర్వికల్ క్యాన్సర్) విషయంలో మహిళలు నిర్లక్ష్యాన్ని విడనాడాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎఎన్ఎం, సిహెచ్ఓలకు సహకరించాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్ కోరారు. సర్వికల్ క్యాన్సర్ విషయంలో చాలా మంది మహిళల్లో నేటికీ అవగాహన లేకపోవడం వల్ల ప్రాణాల్ని కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేసే ముందస్తు స్క్రీనింగ్ పరీక్షల్ని వినియోగించుకోవడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడొచ్చన్నారు. 30 ఏళ్లు దాటిన మహిళల ఇంటికి ఎఎన్ఎం, సిహెచ్ఓలు వెళ్లి సమీప ఆరోగ్య కేంద్రానికి వచ్చి స్క్రీనింగ్ చేసుకోవాలని ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డును అందజేస్తారని, దానిపై ఎప్పుడు, ఎక్కడికి రావాలో కార్డుపై రాసి ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.