కేంద్రం బంతాట పై చంద్రబాబు డైలమా.. !
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై దీనికి మద్దతు ఇస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు డైలమాలో పడ్డారు.;
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై దీనికి మద్దతు ఇస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు డైలమాలో పడ్డారు. గతంలోను.. ఇప్పుడు కూడా... కేంద్రంలోని పెద్దల వ్యవహారంపై బాబు విముఖతతోనే ఉన్నారు. కానీ, రాజకీయ ప్రయోజనాలు.. ఇతరత్రా అంశాల నేపథ్యంలోనే ఆయన సర్దుకు పోతున్నారన్నది అందరికీ తెలిసిందే. గతంలోనూ 2014-19 మధ్య బీజేపీతో చేతులు కలిపిన చంద్రబాబు 2018లోనే బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా, పోలవరం వంటి విషయాల్లో విభేదించారు.
కానీ, అంతర్గతంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. వైసీపీతో చెలిమి చేయడాన్ని చంద్రబాబు అప్పట్లోనే తప్పుబట్టారు. ప్రధానంగా ఈ కారణంతోనూ ఆయన కూటమి నుంచి బయటకు వచ్చారన చర్చ అప్పట్లో జోరుగా సాగింది. ఇక, ఇప్పుడు మరోసారి చేతులు కలిపినా.. బీజేపీ వ్యవహారం మాత్రం.. చంద్రబాబును డైలమాలోకి నెడుతోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇచ్చే విషయంలో రాజ్‌నాథ్ సింగ్.. జగన్‌కు ఫోన్ చేయడం, దీనివెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా చక్రం తిప్పడం తెలిసిందే.
అయితే, ఎన్డీయే కూటమిలో ఉన్న తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, ఇంకా జగన్‌తో ఏం పని అనేది చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేస్తున్న ఆలోచన. తాము నిరంతరం.. పోరాటం చేస్తున్న జగన్‌తో మీరు చెలిమి చేస్తే.. ఇక, అర్ధం ఎక్కడ ఉంటుందన్నది ఆవేదన. ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు.. జగన్‌ను రాజకీయంగా బలంగా విమర్శిస్తున్నామని.. దీనికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు కలిసి రాకపోగా.. ఆయనకు ఫోన్లు చేసి మద్దతు కోరడం సరికాదన్న వాదన టీడీపీ, జనసేన వర్గాల్లోనూ వినిపిస్తోంది. దీనికి తోడు రాష్ట్ర బీజేపీ వైఖరిపైనా వారు ఆవేదనతో ఉన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం తెరమీదికి రాగానే.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు యూటర్న్ తీసుకున్నారు. వైసీపీని పన్నెత్తు మాట కూడా అనడం లేదు. పైగా.. కీలక నాయకులపై కేసుల విషయంలోనూ.. ఆలోచన చేసే పరిస్థితిని కల్పిస్తున్నారన్నవాదనా వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు గత ప్రభుత్వం, గత పాలన అంటూ.. విమర్శలు గుప్పించిన రాష్ట్ర బీజేపీ పెద్దలు కూడా.. ఇప్పుడు కనీసం పన్నెత్తు మాట కూడా.. జగన్‌పై చేయకపోవడంతో ఈ వ్యవహారం.. టీడీపీ, జనసేనలకు ఇబ్బందిగానే మారింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు మన పని మనం చేద్దాం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.