పొత్తులు ఎందుకంటే...లాజిక్ ఉందన్న బాబు
బాబు ఎపుడూ పొత్తులతో వెళ్తారు, ఆయన ఒంటరిగా పోటీ చేయలేరు అన్నది ప్రత్యర్ధులు చేసే పర్మనెంట్ విమర్శ. దానికి బాబు ఇచ్చిన జవాబు లాజిక్ తో కూడుకున్నదిగా ఉంది అని చెప్పాల్సి ఉంది.;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన మనసులోని చాలా మాటలను వీలు దొరికినపుడల్లా జనాలతో పాత్రికేయులతో నాయకులతో పంచుకుంటూంటారు తాను ఏ పని చేసినా అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడాలి అన్నదే తన విధానం అని బాబు చెబుతూ ఉంటారు. ఒక తాజాగా కడప జిల్లా కమలాపురంలో చంద్రబాబు పర్యటన సాగింది. ఈ నేపధ్యంలో ఆయన ప్రజలతో చాలా విషయాలు చెప్పారు. అందులో రాజకీయ పరమైన అంశాలు కూడా ఉన్నాయి. బాబు ఎపుడూ పొత్తులతో వెళ్తారు, ఆయన ఒంటరిగా పోటీ చేయలేరు అన్నది ప్రత్యర్ధులు చేసే పర్మనెంట్ విమర్శ. దానికి బాబు ఇచ్చిన జవాబు లాజిక్ తో కూడుకున్నదిగా ఉంది అని చెప్పాల్సి ఉంది.
ఏపీ కోసమే అంటూ :
తాను ఏపీ అభివృద్ధి కోసమే పొత్తులు పెట్టుకున్నాను అని కమలాపురం సభలో బాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తాను పొత్తు రాజకీయాలు చేశానని ఆయన వివరించారు కేంద్రంలో రాష్ట్రంలో అనుకూల ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి వేగవంతంగా సాగుతోందని చంద్రబాబు వివరించారు. ప్రగతి కోసమే పొత్తులు పెట్టుకుంటున్నామని అటు ప్రజలకు మరో వైపు రాజకీయ ప్రత్యర్ధుల విమర్శకులకు బాబు జవాబు ఇచ్చారు అన్న మాట.
నాన్నకు సాయం :
ఇక ఇదే సభలో చంద్రబాబు తన జీవితం గురించిన కొన్ని విషయాలను జనాలతో పంచుకున్నారు తాను సైతం రైతు బిడ్డనే అని ఆయన చెప్పుకున్నారు తాను చిన్నతనంలో నాన్నకు పొలం పనులలొ సాయం చేసేవాడిని అని బాబు తన బాల్యాన్ని నెమరువేసుకున్నారు. తనకంటే రైతుల గురించి వారి కష్టాల గురించి తెలిసిన వారు ఎవరూ లేరని ఆయన చెప్పారు. అందుకే తాను రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నాను అన్నారు.
రైతులు ఎదగాలి :
రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న రైతులు ఎదగాలని బాబు ఉద్భోదించారు. రైతులు అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగంలో వారు ఆధునిక పద్ధతులు అలవర్చుకోవాలని బాబు సూచించారు. పాత పద్ధతులలోనే ఇంకా సాగు చేస్తామంటే నష్టాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఏ పంటకు ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలని అలా . డిమాండ్ ఆధారిత పంటలు పండించాలని బాబు దిశా నిర్దేశం చేశారు. ఏపీ నుంచి పండే పంటలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ప్రతీ ఒక్క రైతూ ఎదగాలని ఆయన కోరారు. ఆనాడే వ్యవసాయం అన్నది తప్పనిసరిగా అద్భుతమైనదిగా గొప్ప లాభసాటిగా మారుతుందని బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పంచసూత్రాలను పాటిస్తే సమస్యలు వాటికి అవే పరిష్కారమవుతాయని చంద్రబాబు రైతాంగానికి గట్టి భరోసా ఇచ్చారు.
విజన్ ఇదేనంటూ :
ఏపీకి సంబంధించిన వ్యవసాయం నీటి పారుదల రంగాల విషయంలో తన విజన్ ని బాబు జనం ముందు ఉంచారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే తన ఏకైక సంకల్పంగా ఆయన స్పష్టం చేశారు. ఏపీ గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి సహా అనేక నదులను అనుసంధానిస్తామని, వాటితో రిజర్వాయర్లను నింపగలిగితే ఒక ఏడాది వర్షాలు లేకపోయినా ఇబ్బంది ఉండదని బాబు అన్నారు. అలాగే ఏపీలోని చెరువులు అన్నీ పూర్తిగా నింపాలని, భూగర్భ జలాలను పెంచాలని, భూమిని ఏకంగా ఒక పెద్ద జలాశయంగా మార్చాలని తన దార్శనికతను చంద్రబాబు రైతుల ముంగిట ఆవిష్కరించారు. రానున్న కాలంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నదుల అనుసంధానం చేసి తీరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం విశేషం.