దసరాకు పెద్ద గిఫ్ట్ సిద్ధం చేస్తున్న బాబు

చంద్రబాబు ఈసారి అధికారంలోకి వస్తూనే చాలా మార్పులు చూపిస్తున్నారు గతంలో ఆయన హామీలు ఇచ్చినా అవి నెరవేరడానికి కొంత సమయం పట్టేది.;

Update: 2025-08-29 03:36 GMT

చంద్రబాబు ఈసారి అధికారంలోకి వస్తూనే చాలా మార్పులు చూపిస్తున్నారు గతంలో ఆయన హామీలు ఇచ్చినా అవి నెరవేరడానికి కొంత సమయం పట్టేది. ఈసారి అలా కాకుండా అభివృద్ధి ఒక వైపు అలాగే సంక్షేమం మరో వైపు బాబు చూసుకుంటూ జోరు గుర్రాల స్వారీని సమర్ధంగా చేస్తున్నారు. ఈ క్రమంలో బాబు వరుసగా పేద ప్రజలకు అవసరమైన పధకాలను ఇస్తూనే వారికి గూడు కూడా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో సరికొత్త రికార్డులనే సాధించేలా బాబు మార్క్ లక్ష్యాలు ఉంటున్నాయి.

దసరాకు అసలైన పండుగ :

ఈసారి దసరా పండుగ ఏపీలోని పేదలకు అసలైన పండుగ కాబోతోంది. దానికి తగిన విధమైన కసరత్తుని కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఈసారి ఏకంగా మూడు లక్షల ఇళ్ళను లబ్దిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం శ్రమిస్తోంది. ఆ దిశగా అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పరుగులు పెట్టిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి మూడు లక్షల ఇళ్ళలో పేదలు గృహ ప్రవేశం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దాంతో దానికి సంబంధించిన పనులు శర వేగంగా సాగుతున్నాయి.

సంక్రాంతికి మరో రెండు లక్షలు :

ఇక దసరాకి మూడు లక్షల మందిని ఒక ఇంటి వారిని చేస్తున్న కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది పెద్ద పండుగకు మరో రెండు లక్షల మందికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఈసారి సంక్రాంతి పండుగ వేళ అంతా తమ సొంత ఇంట్లో పాలు పొంగించి పూజలు చేస్తారు అన్న మాట. ఆ దిశగా ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించి మరీ అధికారులను ఆదేశిస్తున్నారు.

ఆర్థిక సంవత్సరం అంతానికి :

ఇక చూస్తే కనుక 2025-2026 ఆర్థిక సంవత్సరం అంతానికి మరో అయిదు లక్షల మందికి సొంత ఇంటి కలను నిజం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు. అంటే 2026 మార్చి నెలాఖరులోగా ఇంకో అయిదు లక్షల మందికి సొంత ఇళ్ళు సిద్ధమవుతాయన్న మాట. మొత్తంగా చూస్తే ఈ దసరా నుంచి మార్చి వరకూ ఆరు నెలల వ్యవధిలో పది లక్షల మంది పేదలకు సొంత ఇళ్ళు ఇవ్వడం అంటే ఒక పెద్ద రికార్డుగానే భావించాలని అంటున్నారు. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా పేదలకు శాశ్వతంగా ఇళ్ళను నిర్మించి ఇవ్వడం అన్నది ప్రభుత్వం ఉద్దేశ్యంగా కనిపిస్తోంది అని అంటున్నారు.

నిధులకు ఢోకా లేకుండా :

మరో వైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా ఎప్పటికపుడు మంజూరు చేస్తోంది దాంతో పాటుగా పాలనాపరంగా ఇవ్వాల్సిన ఆదేశాలను ఇస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నారు. ఇక పోతే దసరాకు పూర్తి కావాల్సిన మూడు లక్షల ఇళ్ల పనులు ఇపుడు ఏపీలో శరవేగంగా సాగుతున్నాయని అంటున్నారు. కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అంతా జోరుగా పనిచేస్తున్నారు.

ఎట్టి పరిస్థితులల్లోనూ దసరాకు మూడు లక్షల ఇళ్ళలో గృహ ప్రవేశం చేయించడం ఖాయమని కూటమి పెద్దలు చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే ఇది పేదలకు అతి పెద్ద శుభవార్త. సొంత ఇళ్ళు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. అలాంటిది ఆరు నెలల తేడాలో పది లక్షల ఇళ్ళను నిర్మించి ఇవ్వడం ద్వారా కనీసం యాభై లక్షల మంది కుటుంబ సభ్యులకు శాశ్వత గూడు కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం మంచి పేరునే సాధిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News