ఏపీకి చాలా అంటే చాలా... తెలంగాణను మించి కేటాయింపులు
కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేసిన పన్ను వాటాలో ఏపీకి దాదాపు రూ.4112 కోట్లు విడుదలయ్యాయి. ఇక తెలంగాణకు రూ.2,136 కోట్లు అందాయి.;
కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల్లో ఏపీకి అగ్ర తాంబూళం దక్కుతోంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను తాజాగా పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం మిగిలిన చిన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి కాస్త ఎక్కువగా నిధులు కేటాయించిందని అంటున్నారు. ఈ నెల 10వ తేదీన ఇవ్వాల్సిన ఈ నిధులను పది రోజులు ముందుగానే ఇచ్చి జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలు విషయంలో చేదోడుగా నిలిచిందని అంటున్నారు. దేశవ్యాప్తంగా వసూలు చేసిన పన్ను మొత్తం నుంచి రాష్ట్రాలకు రూ.1,01,603 కోట్లను కేటాయించింది.
కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేసిన పన్ను వాటాలో ఏపీకి దాదాపు రూ.4112 కోట్లు విడుదలయ్యాయి. ఇక తెలంగాణకు రూ.2,136 కోట్లు అందాయి. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణకు దాదాపు సగం డబ్బు మాత్రమే అందడం ప్రత్యేకంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉండటం వల్లే పన్ను ఆదాయంతోపాటు ఇతర కేటాయింపుల్లో ఏపీకి సింహభాగం దక్కుతుందని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీల బలం కేంద్రానికి చాలా అవసరం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకోడానికి నిధుల కేటాయింపులో పెద్దపీట వేస్తున్నారని అంటున్నారు.
ఇక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఈ నిధులను కేటాయించగా, అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రూ.18,227 కోట్లు దక్కించుకుంది. కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న బిహార్ రూ.10,219 కోట్లు అందుకుంటుంది. ఇదే సమయంలో దేశంలో అత్యధిక పన్నులు చెల్లించే రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్న మహారాష్ట్ర రూ. 6,418 కోట్లు మాత్రమే పొందింది. ఈ రాష్ట్రానికన్నా అధికంగా మధ్యప్రదేశ్ రూ.7,976 కోట్లు, పశ్చిమబెంగాల్ రూ.7,644 కోట్లు పొందుతున్నాయి.
ప్రధాని మోదీ ఈ నెల 16న ఏపీకి వస్తున్నారు. మరోవైపు దసరా, దీపావళి పండగలను ద్రుష్టిలో పెట్టుకుని కేంద్రం ముందుగానే ఈ కేటాయింపులు చేసినట్లు భావిస్తున్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన 9 రాష్ట్రాలకు రూ.4,645.60 కోట్ల విలువైన రికవరీ, పునర్నిర్మాణ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో భాగంగా, జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ నిధి (ఎన్‌డీఎంఎఫ్) నుంచి 11 ప్రధాన నగరాలకు అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం-ఫేజ్-2 కింద రూ.2,444.42 కోట్లు కేటాయించడానికి ఆమోదం తెలిపింది. నగరాల్లో వరద ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం. ఈ 11 నగరాల జాబితాలో విశాఖపట్నం కూడా ఉందని చెబుతున్నారు.