ఏపీ అడగడమే ఆలస్యం.. రైట్ రైట్ అంటున్న కేంద్రం

గతంలో రాష్ట్రానికి ఏం కావాలన్నా కొర్రీలపై కొర్రీలు వేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఏది కావాలంటే అది సమకూర్చుతూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని అంటున్నారు.;

Update: 2025-09-19 11:22 GMT

ఏపీ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన సంపూర్ణంగా మారినట్లే కనిపిస్తోంది. గతంలో రాష్ట్రానికి ఏం కావాలన్నా కొర్రీలపై కొర్రీలు వేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఏది కావాలంటే అది సమకూర్చుతూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా.. 2014-19 మధ్య ఏపీ అభివృద్ధి పనులు, రుణాలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇలా చాలా అంశాల్లో కేంద్ర సహకారం సరిగా అందేది కాదన్న ప్రచారం ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ రాజధాని అమరావతి కోసం మరో రూ.14,200 కోట్ల రుణం సమకూర్చుకునేందుకు కేంద్రం అంగీకరించడమేనని చెబుతున్నారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అదనంగా రూ.14,200 కోట్లు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15 వేలకోట్లు అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించాయి. ఆరేళ్ల వ్యవధిలో దశల వారీగా ఈ రుణం మంజూరు చేయడానికి అంగీకారం కుదిరింది. తొలి విడత రుణం కూడా ఇప్పటికే అందిందని చెబుతున్నారు. ఈ రుణానికి అదనంగా ఇప్పుడు మరో రూ.14,200 కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాజధానిలో మౌలిక వసతులు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణానికి దాదాపు రూ.91 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నిధులలో సగం అప్పుగాను, మిగిలిన సగం భూములు విక్రయించడం ద్వారా సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల, జర్మన్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు సేకరించారు. దీంతో మూడో వంతు నిధులు సమకూరినట్లైంది. మొత్తం రూ.91 వేల కోట్లకు గాను ప్రస్తుతానికి రూ. 31 వేల కోట్లు రుణానికి ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు మరో రూ.14,200 కోట్లు సమకూరడంతో సగం మొత్తం అందుబాటులో ఉన్నట్లే అయిందని అంటున్నారు.

రాజధాని నిర్మాణానికి ఇంకా రూ.41 వేల కోట్లు సేకరించాల్సివుందని అంటున్నారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్ననిధులతో తొలి విడత ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చని అంటున్నారు. రాజధాని రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయడంతోటు రోడ్లు, కరెంటు, నీరు సరఫరా, ప్రభుత్వ కాంప్లెక్స్ ల నిర్మాణం పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది మేలో ప్రధాని రెండో సారి కొబ్బరికాయ కొట్టారు. అప్పటి నుంచి పనులు పరుగులు తీస్తున్నట్లు చెబుతున్నారు. నిధులకు కొరత లేకపోవడంతో రాజధాని గ్రామాల్లో కూలీల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. భారీ వాహనాల రాకపోకలతో నిత్యం సందడి నెలకొంది.

Tags:    

Similar News