వాజ్ పేయి చేసింది మోడీ ఎందుకు చేయడం లేదు?.. కాంగ్రెస్ కీలక పాయింట్!

పాకిస్థాన్ పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-01 16:30 GMT

పాకిస్థాన్ పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్ కు చెందిన ఆరు విమానాలను కూల్చేసినట్లు పాక్ చెప్పడం మాత్రం అసత్యమని చెప్పి ఖండించిన ఆయన.. కచ్చితంగా ఎన్నింటిని కోల్పోవాల్సి వచ్చిందనేది మాత్రం వెల్లడించలేదు.

షాంగ్రిలా డైలాగ్ లో పాల్గొనడం కోసం సింగపూర్ వెళ్లిన ఆయన బ్లూమ్ బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఆపరేషన్ సిందూర్ లో భారత్ కోల్పోయిన యుద్ధ విమానాలపై తొలిసారి స్పందించారు. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో.. వాజ్ పేయి పాఠాలను గుర్తు చేస్తూ మోడీ సర్కార్ ను మందలించే పనికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ.

అవును... సింగపూర్ లో ఆపరేషన్ సిందూర్ పై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు భారతదేశ సైనిక నష్టాలను అంగీకరించాయని.. వాటిని తీవ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని.. దీనిపై విస్తృత రాజకీయ చర్చ అవసరమని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. సైనిక అధికారి విదేశాలలో ఈ విషయాలు వెల్లడించడం ఏమిటని ప్రశ్నించారు.

అంతకంటే ముందు రక్షణ మంత్రి రాజకీయ పార్టీలకు ఈ విషయాలను గురించి తెలియజేయాల్సిందని ఈ సందర్భంగా జైరాం రమేష్ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. కార్గిల్ సమీక్ష కమిటీ మాదిరిగానే స్వతంత్ర నిపుణుల కమిటీ ద్వారా భారతదేశ రక్షణ సంసిద్ధతను సమగ్రంగా సమీక్షించాలని రమేష్ పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా... 1999 జూలైలో కార్గిల్ యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కార్గిల్ సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం విదేశాంగ మంత్రి జైశంకర్ తండ్రి ఈ నివేదికను తయారు చేసిన నలుగురు సభ్యులలో ఒకరని కాంగ్రెస్ నాయకుడు ఎత్తి చూపారు. ఆ ఆలోచన మోడీ చేయలేకపోతున్నారని అన్నారు.

ఈ సమయంలో తాము అడిగిందల్లా ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే అని చెప్పిన జైశంకర్... సింగపూర్ లో జనరల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యల అనంతరం తమ డిమాండ్ మరింత సందర్భోచితం చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో.. 1994 ఫిబ్రవరి 22 నాటి పీఓకే తీర్మానాన్ని పునరుద్ఘాటించే తీర్మానంగా అది ఉండాలని అన్నారు.

Tags:    

Similar News