సాక్షులకు ప్రాణభయం.. వివేకా కేసులో బిగ్ ట్విస్ట్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ పునఃప్రారంభించింది.;

Update: 2026-02-28 07:59 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ పునఃప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండేళ్ల విరామం తర్వాత పులివెందులలో ముగ్గురు సాక్ష్యులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసులో కుట్ర కోణంపై స్పష్టత రాకుండానే సీబీఐ దర్యాప్తు ముగించిందని వివేకా కుమార్తె వైఎస్ సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఆమె అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలని సూచిస్తూ సీబీఐ పునర్విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం సూచనలతో కేసును రీ ఓపెన్ చేసిన సీబీఐ అధికారులు పులివెందులలో ముగ్గురు సాక్ష్యులను విచారించారు.

సుప్రీం సూచనలతో వివేకా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ2 సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ తోపాటు సాక్షి భరత్ యాదవ్ సోదరుడు మహేంద్ర కుమార్ యాదవ్, మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సుమారు రెండు గంటల పాటు ఈ ముగ్గురిని ప్రశ్నించిన సీబీఐ కీలక సమాచారం సేకరించిందని చెబుతున్నారు. వివేకా హత్య సమాచారం మరుసటి రోజు ఉదయం 6.15 నిమిషాలకు భాహ్య ప్రపంచానికి తెలిసింది. అయితే కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డికి ఈ విషయమై ముందు రోజు అర్ధరాత్రి 1.45 నిమిషాలకే సమాచారం ఉందని, ఆ ఇద్దరు వాట్సాప్ చాట్ ద్వారా చర్చించుకున్నారని సీబీఐ గతంలో గుర్తించింది.

అయితే ఇంతకుముందు విచారణలో ఈ అంశంపై లోతుగా విచారణ చేయకపోవడంపై హతుడి కుమార్తె సునీత రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కిరణ్ యాదవ్, భరత్ రెడ్డి మధ్య సంభాషణలపై దర్యాప్తు జరిపి, వివేకా హత్య సమాచారం ముందుగా వారికి ఎలా తెలిసిందన్న సమాచారంపై స్పష్టత ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై తాజాగా సీబీఐ ఆ ఇద్దరిని ప్రశ్నించింది. ఇంతకు ముందు అంటే ఫిబ్రవరి 20న కూడా ఈ విషయమై వీరిని హైదరాబాద్ లో ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, సీబీఐ విచారణ అనంతరం కిరణ్ యాదవ్, మహేందర్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

రెండు గంటల పాటు తమను సీబీఐ ప్రశ్నించిందని కిరణ్ యాదవ్, మహేంద్ర యాదవ్ వెల్లడించారు. అదే సమయంలో కేసు విచారణ పూర్తిస్థాయిలో జరిగి న్యాయం జరగాలంటే ముందు తాము ప్రాణాలతో ఉండాలని మీడియాతో వ్యాఖ్యానించారు. మీడియా ప్రశ్నలపై తాము ఏమీ చెప్పలేమని, కోర్టులో ఉండటం వల్ల తాము ఏమీ మాట్లాడకూడదని వెల్లడించారు. అయితే తమకు ప్రాణ హాని ఉందంటూ కిరణ్ యాదవ్, మహేంద్ర యాదవ్ చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి, ఏ2 నిందితుడు సునీల్ కుమార్ సైతం గతంలో ప్రాణభయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని హతుని కుమార్తె వైఎస్ సునీత కోరుతున్నారు.

Tags:    

Similar News