రియల్ ఎస్టేట్ మాఫియా-బ్యాంకుల అక్రమ బంధం: వేల కోట్ల కుంభకోణంపై సిబిఐ పంజా!

తాజా కేసులతో కలిపి ఈ కుంభకోణానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన మొత్తం కేసుల సంఖ్య 50కి చేరింది.;

Update: 2026-04-15 03:50 GMT

రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది బిల్డర్లు .. బ్యాంకు అధికారులు కుమ్మక్కై సామాన్య గృహ కొనుగోలుదారులను నిలువునా ముంచిన వైనంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఉక్కుపాదం మోపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 77 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా 22 కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు కావడమే కాకుండా.. బిల్డర్లు, బ్యాంకు అధికారుల మధ్య ఉన్న అపవిత్ర బంధం ఏ స్థాయిలో వేల కోట్ల దోపిడీకి పాల్పడిందో బహిర్గతమైంది.

ఈ కుంభకోణం ప్రధానంగా `సబ్వెన్షన్ స్కీమ్` పేరుతో సాగడం గమనార్హం. తక్కువ అడ్వాన్స్‌తో ఇల్లు సొంతం చేసుకోవచ్చనే ఆశను మధ్యతరగతి ప్రజల్లో కలిగించి.. వారి పేరిట బ్యాంకుల నుండి భారీగా రుణాలు మంజూరు చేయించారు. అయితే బిల్డర్లు ఆ నిధులను ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాకుండా ఇతర అవసరాలకు మళ్లించారు. బ్యాంకు అధికారులు కనీస నిబంధనలను పాటించకుండా... ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించకుండానే నిధులు విడుదల చేయడం ఈ కుట్రలో వారి క్రియాశీల పాత్రను స్పష్టం చేస్తోంది.

కేవలం కాగితాల మీద మాత్రమే ఉన్న ప్రాజెక్టులకు కూడా బ్యాంకులు కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేయడం గమనార్హం. ఢిల్లీ-ఎన్.సి.ఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పాటు పుదుచ్చేరి, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో విస్తరించిన ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సామాన్య కొనుగోలుదారులు ఒకవైపు సొంత ఇంటి కల నెరవేరక... మరోవైపు కట్టని ఇంటికి ఈఎంఐలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోవడానికి బ్యాంకులు- రియ‌ల్ట‌ర్ల‌ ఈ అక్రమ ఒప్పందాలే ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది.

తాజా కేసులతో కలిపి ఈ కుంభకోణానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన మొత్తం కేసుల సంఖ్య 50కి చేరింది. గతంలో నమోదైన 28 కేసులు ప్రస్తుతం దర్యాప్తు తుది దశలో ఉండగా... తాజా దాడులు ఈ మాఫియా నెట్‌వర్క్‌ను పూర్తిగా విచ్ఛిన్నం చేసే దిశగా సాగుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన బిల్డర్లతో పాటు వారికి సహకరించిన బ్యాంకు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సిబిఐ సిద్ధమవుతోంది. ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాకుండా... లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యవస్థీకృత నేరంగా దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి లొసుగులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుండటంతో దోషులు తప్పించుకునే అవకాశం లేకుండా దర్యాప్తు ముమ్మరం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు పునరావృతం కాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని ఈ కుంభకోణం మరోసారి గుర్తుచేస్తోంది. చిట్స్ మోసం.. రియ‌ల్ ఎస్టేట్ మోసం.. బ్యాంకులు మోసం.. క‌ల్తీ స‌రుకుల‌తో మోసం.. ఇప్పుడు ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

Tags:    

Similar News