9 నిమిషాల్లో 97% ఛార్జ్.. 710 కి.మీ రేంజ్.. బీవైడీ కారు సంచలనం!

ఈ కారు 4,850 మిమీ పొడవు, 1,910 మిమీ వెడల్పు 1,670 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. 2,840 మిమీ వీల్‌బేస్ కారణంగా లోపల విశాలమైన స్పేస్ ఉంటుంది.;

Update: 2026-05-02 11:30 GMT

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్రపంచంలో చార్జింగ్ సమయం అనేది ఒక పెద్ద అడ్డంకిగా భావించే వారికి బీవైడీ సాంగ్ అల్ట్రా ఈవీ ఒక సంచలన సమాధానం అని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్ కంటే వేగంగా చార్జ్ అవ్వడం, అది కూడా కేవలం 9 నిమిషాల్లోనే 97% అంటే ఇది సాంకేతిక అద్భుతమనే చెప్పాలి. చైనా మార్కెట్లో విడుదలైన నెల రోజుల్లోనే 60 వేలకు పైగా బుకింగ్‌లు సాధించిందంటే ఈ కారు పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా ఎదుగుతున్న బీవైడీ (Build Your Dreams), తన సరికొత్త 'సాంగ్ అల్ట్రా ఈవీ' (Song Ultra EV) తో వాహన రంగాన్ని ఒక్క కుదుపు కుదిపింది. ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులు ప్రధానంగా ఎదుర్కొనే 'రేంజ్ యాంగ్జైటీ', సుదీర్ఘ ఛార్జింగ్ సమయం వంటి సమస్యలకు ఈ కారు చెక్ పెట్టింది. ప్రారంభ ధర సుమారు రూ. 2.1 మిలియన్లు (151,900 యువాన్లు) ఉండడంతో ఇది మధ్య తరగతి, ప్రీమియం విభాగాల మధ్య వంతెనలా నిలిచింది.

కనురెప్పపాటులో ప్రయాణానికి సిద్ధం

ఈ కారు ప్రధాన ఆకర్షణ దాని ఛార్జింగ్ స్పీడ్. కొత్త బ్లేడ్ బ్యాటరీ 2.0 టెక్నాలజీతో, కేవలం 5 నిమిషాల్లోనే 10% నుంచి 70% వరకు ఛార్జ్ అవుతుంది. 97% వరకు ఛార్జింగ్ కేవలం 9 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కంటే వేగంగా లోడ్ అవుతుంది. మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వంటి విపరీతమైన చలిలో కూడా ఈ కారు కేవలం 12 నిమిషాల్లో ఛార్జ్ అవ్వగలదు.

అద్భుతమైన బ్యాటరీ, రేంజ్

ఈ ఎస్‌యూవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. 68.4 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన మోడల్ ఒక పూర్తి ఛార్జ్‌తో 605 కిలోమీటర్ల ప్రయాణ పరిధిని అందిస్తుంది. మరో మోడల్.. 82.7 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన హై-ఎండ్ మోడల్ ఏకంగా 710 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలోని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ 362 హెచ్‌పీ శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కారుకు వేగవంతమైన పికప్‌ ఇస్తుంది.

హై-టెక్ ఇంటీరియర్స్, స్మార్ట్ ఫీచర్లు

కారు లోపల డ్రైవింగ్ అనుభవం అద్భుతంగా ఉండేలా హై-టెక్ ఫీచర్లు జోడించారు. కారులో 15.6-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేతో పాటు 26-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. 'గాడ్స్ ఐ' అనే ప్రత్యేక వ్యవస్థ ద్వారా 27 సెన్సార్లు, LiDAR సాయంతో కారు హైవేలపై, నగరాల్లో దానంతట అదే ప్రయాణించగలదు (అటానమస్ డ్రైవింగ్) పార్కింగ్ చేసుకోగలదు.

కొలతలు మరియు మార్కెట్ పోటీ

ఈ కారు 4,850 మిమీ పొడవు, 1,910 మిమీ వెడల్పు 1,670 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. 2,840 మిమీ వీల్‌బేస్ కారణంగా లోపల విశాలమైన స్పేస్ ఉంటుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో టెస్లా మోడల్ వై (టెస్టా మోడల్ Y), ఎక్స్‌పెంగ్ జీ6 (Xpeng G6) వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది.

బీవైడీ సాంగ్ అల్ట్రా ఈవీ సాధించిన బుకింగ్‌ల రికార్డు (ఒక్క నెలలో 61,240 బుకింగ్‌లు) చూస్తుంటే, ప్రజల వేగవంతమైన ఛార్జింగ్ సాంకేతికతను ఎంతగా ఆశిస్తున్నారో అర్థం అవుతోంది. ఈ సాంకేతికత భారతదేశం వంటి దేశాలకు వస్తే, పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఒకే ఛార్జ్‌తో 710 కి.మీ ప్రయాణం అనేది సుదీర్ఘ ప్రయాణాలకు ఎలక్ట్రిక్ కార్లను అత్యుత్తమ ఎంపికగా మారుస్తుంది.

Tags:    

Similar News