జంధ్యాల సినిమాలో మెరిసిన బీవీ పట్టాభిరాం

మనిషి మనసుని స్వాధీనం చేసుకుని తమకు నచ్చిన విధంగా హిప్నటైజ్ చేస్తారా ఇది సాధ్యమా అని అంతా ఆలోచించేవారు.;

Update: 2025-07-02 03:25 GMT

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్ బీవీ పట్టాభిరాం ఇక లేరు అన్న వార్త చాలా మందిలో ఎంతో ఆవేదను కలుగచేసింది. ఈ రోజున అయితే సాంకేతిక అభివృద్ధి చెంది ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఏమీ లేని రోజులలో ఒక మెజీషియన్ గా బీవీ పట్టాభిరాం చేసిన మ్యాజిక్కులను ఒక తరం ఎంతో ఆస్వాదించి ఆనందించింది.

ఆయనను ఎన్నో మంత్ర తంత్ర విద్యలు వచ్చిన వారిగా ఆ రోజులలో చూశారు. 1980 కాలంలో బీవీ పట్టాభిరాం తన ప్రదర్శనలతో అందరికీ ఆకట్టుకున్నారు. ఆయన మెజీషియన్ గా ఎంతో ఖ్యాతి సంపాదించారు. అదే సమయంలో ఒక హిప్నాటిస్టు గా కూడా ఆయన పాత తరానికి అద్భుతంగా కనిపించారు.

మనిషి మనసుని స్వాధీనం చేసుకుని తమకు నచ్చిన విధంగా హిప్నటైజ్ చేస్తారా ఇది సాధ్యమా అని అంతా ఆలోచించేవారు. సాధ్యమే అని చాలా ప్రదర్శనల ద్వారా బీవీ పట్టాభిరాం రుజువు చేశారు. ఇక ఆయన తరువాత కాలంలో వ్యక్తిత్వ వికాసం మీద ఎంతో పరిశోధనలు చేసి యువతకు విలువైన సూచనలు ఇచ్చేవారు. అలా యువతరానికి ఆయన బాగా దగ్గర కావడమే కాకుండా ఎందరికో మార్గదర్శిగా నిలిచారు.

బీవీ పట్టాభిరాం అసలు పేరు భావరాజు వెంకట పట్టాభిరాం. ఆయనది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు. తెలుగు ఇంగ్లీష్ కన్నడ తమిళ భాషలలో ఆయన వందలాది పుస్తకాలు రచించారు. ఆయన బహుముఖీయమైన ప్రజ్ఞ కలిగిన వారుగా చెప్పాలి. ఆయన మృదువైన మాటలతో ఎన్ని వేల మంది నిండిన సభను అయినా మెస్మరైజ్ చేయడంలో సిద్ధహస్తులు.

ఆయన మూఢ నమ్మకాల మీద పోరాటమే చేశారు. తన మ్యాజిక్కుల ద్వారా వ్యక్తిత్వ వికాసం ద్వారా మూఢ నమ్మకాలు వద్దు అని గట్టిగా చెప్పేవారు. 17 ఏళ్ళకే పోతారని ఒక జ్యోతీష్యుడు చెప్పిన మాటలను ఆయన సీరియస్ గా తీసుకుని అతి తప్పు అని నిరూపించారు. అంతే కాదు పదవ తరగతితో చదువు ఆపేస్తారు అని జ్యోతీష్యుడు చెబితే ఏకంగా రెండు పీహెచ్ డీలు చేసి అది తప్పు అని నిరూపించారు.

నిన్ను నీవు ప్రేమించుకో అన్నదే ఆయన చెప్పే మాట. ఆంత న్యూనతా భావం కానీ తాను తక్కువ అని బెదురు కానీ భయాలు కానీ యువతలో ఉండరాదు అన్నదే ఆయన విధానంగా ఉండేది. మ్యాజిక్ ని హాబీగా తీసుకుని దానిని ప్రొఫెషన్ గా మార్చుకుని దానికి ఎంతో గొప్ప హోదా ఇచ్చిన వారు బీవీ పట్టాభిరాం

ఆయనకు ఒక సినిమా హీరోకు ఉన్నంత ఇమేజ్ ఉంది. ఆయన ఎక్కడికి వెల్ళినా వేలాది మంది సభలకు వచ్చేవారు ఆయన సభ ముగిసేంతవరకూ వారు అలాగే ఉండేవారు అంటే ఆయన ప్రసంగాలు ఎంతలా ఆకర్షిస్తాయో చూడాల్సిందే.

తాను అందరిలో ఒకడిగా ఉండకూడని తాను ఏదో సాధించాలన్న ఆయన తపన వల్లనే ఫుడ్ కార్పోరేషన్ లో వచ్చిన మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఆయన తాను అనుకున్న రంగంలో స్థిరపడ్డారు. మెజీషియన్ ని ఎంతో గౌరవం ఇచ్చారు.

ఇక జంధ్యాల తీసిన రెండు రెళ్ళు ఆరు మూవీ లో నటించారు. అందులో కూడా ఆయన హిప్నాటిస్టు పాత్ర పోషించారు. ఆ సినిమాలో ఆయన శ్రీలక్ష్మిని హిప్నటైజ్ చేసే పాత్రలో నటించి మెప్పించారు. జంధ్యాల ఆయనకు స్నేహితుడు కావడం వల్లనే ఆయన నటించారు.

బీవీ పట్టాభిరాం ఇచ్చే వ్యక్తిత్వ వికాసం సలహాలు విని ఒక సినీ నటి తన ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుంది అంటే ఆయన ప్రభావం ఎంత అన్నది ఆలోచించాల్సిందే. ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు ఉన్న ఎందరినో ఆయన తన మాటలతో మార్చారు. పాజిటివ్ థింకింగ్ అనేది అలవరచుకుంటే మనిషి జీవితం బాగుంటుదని ఆయన చెబుతారు.

ఇక టైం మేనేజ్మెంట్ గురించి కూడా ఆయన మంచి మాటలు చెప్పారు. కాలాన్ని తన జీవితంలో ఉన్నతికి తగిన విధంగా మార్చుకోవడమే టైం మేనేజ్మెంట్ అని ఆయన వివరించారు. ఇక చూస్తే కనుక బీవీ పట్టాభిరామ్ కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా, పేరుగాంచిన ఇంద్రజాలికుడిగా, మానసిక నిపుణుడిగా కూడా తెలుగు ప్రజలకు సుపరిచితులుగా ఉన్నారు.

ఆయన అనేక పుస్తకాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వేలాది ప్రసంగాల ద్వారా ఆయన సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేశారు. క్లిష్టమైన మానసిక శాస్త్ర అంశాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా సులభమైన శైలిలో వివరించడం ఆయన ప్రత్యేకతగా ఉంది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News