బుట్టా రేణుకమ్మ...ముందే కర్చీఫ్ వేసేశారా ?
ఎమ్మిగనూరు బుట్టా రేణుక సొంత ప్రాంతం. పైగా సామాజిక వర్గం బలం ఉంది. ఆర్ధికంగా ఆమెకు బలం ఉంది.;
బుట్టా రేణుక. రాజకీయాల మీద కాస్తా అవగాహన ఉన్న వారికి ఈ పేరు గుర్తుకు వస్తుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ డిస్కవరీగా అనూహ్యంగా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఒక ఉదుటన ఆమె ఏకంగా కర్నూలు నుంచి ఎంపీ అయ్యారు. కర్నూల్ ఎంపీ సీటు అంటే ప్రముఖ రాజకీయ కుటుంబాల చేతులలో అప్పటిదాకా ఉంటూ వచ్చింది. అలాంటి చోట రాజకీయంగా కొత్త అయిన బుట్టా రేణుక వైసీపీ నుంచి గెలిచి ఢిల్లీలోని పార్లమెంట్ లో అడుగు పెట్టారు. అలా మొదటి ప్రయత్నంలోనే అద్భుతమైన తీరున సాగిన ఆమె రాజకీయం తరువాత కాలంలో మాత్రం తడబడి చివరికి చతికిలపడింది. దానికి కారణం ఆమె స్వయంకృతమని అంటారు. అలాగే రాజకీయంగా సరైన వ్యూహాలను ఆమె అనుసరించలేదని కూడా అంటారు.
అటు ఇటూ అలా :
బుట్టా రేణుక 2017లో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. ఆమె ఆనాడు వైసీపీని వీడడం రాజకీయంగా తప్పిదమే అని అంటారు. ఎందుకంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019 ఎన్నికల ముందు ఆమె వైసీపీలోకి తిరిగి వచ్చినా అధినాయకత్వం అయితే ఆమెకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ కోసం పనిచేయమని కోరింది. అయిదేళ్ల వైసీపీ పాలనలో ఆమె రాజ్యసభ సీటుని ఆశించినా కూడా దక్కలేదని చెబుతారు. ఇక 2024 ఎన్నికల్లో ఆమెకు ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ని పార్టీ ఇచ్చింది. కానీ ఆమె కూటమి ప్రభంజనంలో ఓడిపోయారు.
దూకుడు పెంచుతున్న వైనం :
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో బుట్టా రేణుక తన రాజకీయ దూకుడు పెంచారు. ఎమ్మిగనూరు అసెంబ్లీలో ఆమె పర్యటిస్తున్నారు. జనంతో మమేకం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే సీటు నుంచి పోటీ చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆమె ముందుగా కర్చీఫ్ వేశారు అని అంటున్నారు. ఎమ్మిగనూరులో ఆమె సామాజిక వర్గం అధికంగా ఉంది. అయితే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బైరెడ్డి జయ నాగేశ్వరరెడ్డి ఉన్నారు. అయితే టీడీపీలో వర్గ పోరు హెచ్చుగా ఉంది.
ఆశలన్నీ దాని మీదనే :
ఎమ్మిగనూరు బుట్టా రేణుక సొంత ప్రాంతం. పైగా సామాజిక వర్గం బలం ఉంది. ఆర్ధికంగా ఆమెకు బలం ఉంది. మరో వైపు చూస్తే టీడీపీలో వర్గపోరు ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆశలు పెట్టుకుని ఆమె రంగంలోకి దిగుతున్నారు. జనంతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మిగనూరు నుంచే పోటీ చేసి తీరాలని ఆమె ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు.
జగన్ ఓకే అంటారా :
ఎమ్మిగనూరు నుంచి గతంలో వైసీపీకి బలమైన నేతలు ఉన్నరు. కె చెన్నకేశవరెడ్డి కాంగ్రెస్ లో గెలిచి వైసీపీలో చేరారు. ఆయనకే వైసీపీ టికెట్ ఇస్తూ వస్తోంది. ఆయన వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ జగన్ బుట్టా రేణుక వైపు మొగ్గు చూపించారు. అయితే ఆమె తన సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలు అయ్యారు. దాంతో 2029 నాటికి వైసీపీ హైకమాండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలని అంటునారు. రేణుకను మళ్ళీ కర్నూల్ పార్లమెంట్ కి పోటీ చేయిస్తారా అన్న చర్చ కూడా ఉంది. అయితే రేణుక మాత్రం ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని చూస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఆమె ప్రయత్నం ఏ విధంగా సాగుతుందో.